Dil Raju: ఆ లాజిక్స్ 'వారసుడు'కి వర్తించవా? - దిల్‌రాజు ఆ విషయం మర్చిపోయారా!
రాబోయే సంక్రాంతికి 'ఆదిపురుష్', 'వారసుడు' సినిమాలతో పాటు చిరంజీవి, బాలయ్యలు కూడా తమ సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు.
2023 సంక్రాంతికి మొత్తం నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. 'ఆదిపురుష్', 'వారసుడు' సినిమాలతో పాటు చిరంజీవి, బాలయ్యలు కూడా తమ సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు. ఒకేసారి నాలుగు పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయంటే.. కచ్చితంగా థియేటర్లను పంచుకోవాల్సి ఉంటుంది. పెద్ద హీరోల సినిమాలను థియేటర్లు పంచడం అంత ఈజీ కాదు. ఫ్యాన్స్ తో గొడవలు కూడా ఉంటాయి.
2019లో కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. అప్పుడు 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'వినయ విధేయ రామ', దిల్ రాజు 'ఎఫ్2' సినిమాలతో పాటు రజినీకాంత్ 'పేట' సినిమా కూడా రిలీజయింది. ఆ సమయంలో దిల్ రాజు కొన్ని కామెంట్స్ చేశారు. 'పేట' సినిమాను సడెన్ గా రేసులోకి దింపారని.. మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు తమిళ సినిమా 'పేట'కి ఎక్కువ థియేటర్లు ఇవ్వడం కుదరదని ఖరాఖండిగా చెప్పేశారు.
కావాలంటే సినిమాను వాయిదా వేసుకోవాలని మేకర్స్ కి చెప్పారు. దీంతో చేసేదేంలేక 'పేట' మేకర్స్ తెలుగులో ఎన్ని థియేటర్లు దొరికితే అన్నింట్లోనే రిలీజ్ చేసుకున్నారు. కట్ చేస్తే.. రాబోయే సంక్రాంతికి కూడా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో దిల్ రాజు 'వారసుడు' సినిమా తప్ప అన్నీ స్ట్రెయిట్ తెలుగు సినిమాలే. 'వారసుడు' సినిమా బైలింగ్యువల్ అని ముందుగా అనౌన్స్ చేశారు.
కానీ.. రీసెంట్ గా ఇండస్ట్రీలో షూటింగ్స్ బంద్ జరిగినప్పుడు 'వారసుడు' సినిమా షూటింగ్ మాత్రం జరిగింది. దీని గురించి దిల్ రాజుని ప్రశ్నించగా.. 'వారసుడు' తమిళ సినిమా అని.. కాబట్టి షూటింగ్ ఆపాల్సిన అవసరం లేదని ఆయన స్వయంగా మీడియా ముందు చెప్పారు. అంటే 'వారసుడు' సినిమా తమిళ సినిమా అని ఆయన ఒప్పుకున్నట్లే. మరిప్పుడు సంక్రాంతి రేసులో మిగిలిన సినిమాల కంటే 'వారసుడు'కి తక్కువ థియేటర్లు ఇస్తే దిల్ రాజు ఊరుకుంటారా..? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 'పేట' సమయంలో ఆయన చెప్పిన లాజిక్స్ ఇప్పుడు 'వారసుడు' సినిమాకి వర్తించవా..? అనే చర్చలు జరుగుతున్నాయి. మరి దిల్ రాజు వీటిపై రియాక్ట్ అవుతారేమో చూడాలి!
'వారసుడు' చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్... పీవీపీ పతాకంపై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినెమాటోగ్రఫీ: కార్తీక్ పళని కూర్పు: కె.ఎల్. ప్రవీణ్, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత.
ఈ సినిమాలో విజయ్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. దళపతి 66వ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది 'బీస్ట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. మరి ఈ సినిమాతోనైనా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి!
Also Read: పూర్ణకు పెళ్లయిపోయిందట, అందుకే ఎవరినీ పిలవలేకపోయానని చెప్పిన ముద్దుగుమ్మ!