'ఆదిపురుష్'లోని డైలాగ్స్‌పై విమర్శలు - కీలక నిర్ణయం తీసుకున్న మూవీ టీమ్
ప్రభాస్ 'ఆదిపురుష్'లోని డైలాగులపై సినీ ప్రేక్షకులు చేసిన సలహాలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. రానున్న రోజుల్లో చేంజ్ అయిన డైలాగ్స్ తో 'ఆదిపురుష్'ను చూస్తామని ఆడియెన్స్ అంటున్నారు
Adipurush Dialogues Change : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన పౌరాణిక, ఇతిహాస చిత్రం 'ఆదిపురుష్' జూన్ 16న విడుదలై ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఊహించలేని విజయాన్ని సొంతం చేసుకుంది. డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కించారు. అన్ని వర్గాల వారిని ఆదిపురుష్ ఆకట్టుకుంటుండడంతో ఈ సినిమాకు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇక ఈ మూవీ మేకింగ్ లోని సాంకేతికత, భారీతనం, విజువల్స్ ప్రతి ఒక్కరికి కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ విషయంలో కొంతమంది ప్రేక్షకులు సూచనలు చేస్తున్నారు. వాటిని మార్చుకోవాలని లేదా తీసివేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వారి సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది.
ప్రేక్షకుల సూచనలను గౌరవిస్తూ 'ఆదిపురుష్' టీం ఓ ఇంట్రస్టింగ్ రిప్లై ఇచ్చింది. 'ఆదిపురుష్' సినిమాలో ఆడియెన్స్ ఇచ్చిన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో చిత్రంలోని కొన్ని డైలాగ్స్ మార్చబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. సినిమాలో ప్రస్తుతమున్న ఆ ఫీల్ ను కొనసాగిస్తూనే చేంజ్ చేసిన డైలాగ్స్ కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే ఈ మార్పులతో థియేటర్స్ లో 'ఆదిపురుష్' ను చూడవచ్చని సినీ ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి విజయం వైపు దూసుకెళ్తోన్న ఈ చిత్రంలోని డైలాగ్స్ మార్పులు సినిమా టీమ్ కు ఒక సాహసం లాంటిదే అని చెప్పాలి. ఏదేమైనా ప్రేక్షకుల మనోభావాలు, సెంటిమెంట్స్, వారి సూచనలు గౌరవించడం అన్నింటి కన్నా ముఖ్యమని దర్శక నిర్మాతలు భావించి, ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న 'ఆదిపురుష్'
ఓం రౌత్ రూపొందించిన ఈ మైథలాజికల్ ఫిల్మ్ ఎన్నో అడ్డంకులు దాటుకుని ఇటీవలే విడుదల ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన మొదటిరోజే రూ.140కోట్లు రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజూ కూడా అదే ఉత్సాహాన్ని కనబర్చింది. రూ.65కోట్లు వసూలు చేసి, ప్రస్తుతం రూ.200 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించి రికార్డు సృష్టించింది. పలు రాష్ట్రాల్లో ఈ సినిమాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ఈ రేంజ్ లో కలెక్షన్లు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏదైమైనా నటీనటులు, మేకర్స్ పడిన కష్టానికి, ఎదుర్కొన్న అవాంతరాలకు సరైన ఫలితం దక్కిందని సినీ ప్రేక్షకులు అంటున్నారు.
'ఆదిపురుష్'కు వ్యతిరేకంగా పిటిషన్
ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటీవలే హిందూసేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్త.. ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. హిందువుల విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీసేలా సినిమాను తీశారంటూ ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. మూవీలోని కొన్ని సన్నివేశాలను సరిదిద్దడం లేదా తొలగించాలని కోరుతూ విష్ణు గుప్త నివేదించారు. లేదంటే సినిమానే నిలిపివేయాలని కోరారు. రావణుడికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా వాస్తవానికి దూరంగా చూపించారని ఆయన ఆరోపించారు.
Read Also : 'ఆదిపురుష్'లో రామాయణాన్ని వక్రీకరించారు - ‘రామాయణం’ సీరియల్ దర్శకుడు రామానంద్ కుమారుడు!