Balakrishna First Movie: బాలకృష్ణ మొదటి సినిమాను అప్పటి ప్రభుత్వం ఎందుకు నిషేదించిందో తెలుసా?
బాలయ్య మొదటి చిత్రాన్ని ప్రభుత్వం నిషేదించింది. 2 నెలల తర్వాత మళ్లీ విడుదలైంది. టాలీవుడ్ హిస్టరీలో ఒకే చిత్రం 2 సార్లు విడుదలవ్వడం అదే తొలిసారి. మొదట్లో బ్లాక్ అండ్ వైట్ రెండోసారి కలర్‌లో విడుదలైంది.
నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వింటేనా అభిమానుల్లో పూనకాలు వస్తాయి. ఫ్యాన్స్ మాత్రమే కాదు, యావత్ తెలుగు ప్రజలంతా తమ ఆయన్ని ఇంటి మనిషిగా ‘బాలయ్య’ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన డైలాగు చెబితే చాలు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయన తొడకొట్టారంటే.. థియేటర్లు విజిల్స్‌తో మారుమోగాల్సిందే. బాలయ్యకు ఉన్న మాస్ ఇమేజ్ తెలుగులో మరే హీరోకు లేదంటే నమ్మలేరు. బాలయ్య ఎంత ఆవేశంగా, ఆగ్రహంగా కనిపించినా.. మనసు మాత్రం వెన్న అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అలాంటి బాలయ్య మన తెలుగు ఇండస్ట్రీకి దొరకడం గొప్పవరమని ఆయన అభిమానులు పొంగిపోతుంటారు. 14 ఏళ్ల వయస్సులో ముఖానికి రంగు వేసుకున్న నందమూరి బాలకృష్ణ.. దాదాపు 50 దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. 62 ఏళ్ల వయస్సులో కూడా అదే ఉత్సాహం.. అదే పవర్.. అదే ఎనర్జీ.
బాలకృష్ణ నటించిన తొలి చిత్రం ‘తాతమ్మకల’. ఆయన తండ్రి నందమూరి తారక రామరావు స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1974, ఆగస్టు 30న విడుదలైంది. బాలకృష్ణ నటనపై ఉన్న ఆశక్తిని గమనించిన ఎన్టీఆర్.. ఆయన కోసం ప్రత్యేకంగా ఒక పాత్రను రాసుకున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సోదరుడు హరికృష్ణ కూడా నటించారు. ఎన్టీఆర్ తాతగా, బానుమతి ఆయన భార్య తాతమ్మగా నటించారు. అప్పట్లో కుటుంబ నియంత్రణ ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా ఆ సినిమాలో కొన్ని డైలాగులు కూడా ఉంటాయి. భూసంస్కరణపై ప్రభుత్వ విధానాలను ఈ సినిమాలో ఎత్తిచూపారు. దీంతో ఈ చిత్రం వివాదాస్పదంగా మారింది.
‘ఇద్దరు ముద్దు, ఆ పై వద్దు’ అంటూ సాగుతున్న కుటుంబ నియంత్రణ ప్రచారానికి వ్యతిరేకంగా ఈ సినిమా ఉందంటూ అసెంబ్లీలో పెద్ద రచ్చే జరిగింది. దీంతో ఈ సినిమా ప్రదర్శన నిలిపేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే సినిమా విడుదలై 50 రోజులైంది. దీంతో ఆ చిత్ర ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. అందులో ఆయన.. ‘‘కుటుంబ నియంత్రణకు, భూసంస్కరణలకు వ్యతిరేకంగా ఈ సినిమా తీయలేదు. అంతా కష్టపడి పనిచేస్తే అలాంటి సంస్కరణలతో పనిలేదని చెప్పే ప్రయత్నం చేశాను’’ అని తెలిపారు.
ఆ సినిమాను పరిశీలించిన కేంద్రం.. మళ్లీ విడుదల చేయడానికి అనుమతి ఇచ్చింది. అయితే, ఈ చిత్రాన్ని స్వల్ప మార్పులతో విడుదల చేశారు. మొదటి సారి ఈ చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్‌లో రిలీజ్ చేయగా.. రెండోసారి మాత్రం కలర్‌లో విడుదలచేశారు. అలా 1975, జనవరి 8న ఈ చిత్రం రెండోసారి విడులైంది. అంటే బాలయ్య నటించిన మొదటి చిత్రం టాలీవుడ్ చరిత్రలో తొలిసారి రెండు సార్లు విడుదలైంది. ఈ
చిత్రంలో పల్లెటూరు ప్రజలకు, పట్టణ ప్రజల జీవితాల మధ్య ఉండే వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపించారు. చెడువాళ్లతో సావాసం చేసే మంచివాడు.. ఏ విధంగా మారిపోతాడనేది హరికృష్ణ పాత్రలో చూపించారు. అయితే, బాలయ్య మొదటి సీన్‌లోనే ఎన్టీఆర్‌తో తిట్లు తిన్నారట. అయితే, భానుమతి బాలయ్యను వెనకేసుకుని వచ్చారట. చిన్న పిల్లాడు.. చక్కగా నటిస్తున్నాడు. భవిష్యత్తులో మీ పేరు నిలబెడతారని అన్నారట. ఆమె అన్నమాటే నిజమైంది. ఎన్టీఆర్ వారసుల్లో బాలయ్య మాత్రమే నటనలో ఇంకా రాణిస్తున్నారు.
Also Read: 'నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ - నా జీవో గాడ్స్ ఆర్డర్' బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలే!
Also Read: నయన్-విఘ్నేష్ ల మంచి మనసు, వేలాది పేద పిల్లలకు విందు భోజనం