Veera Simha Reddy Ap Govt : ప్రజలు ఎన్నుకున్న వెధవలు, బుద్ధి తెచ్చుకో - వీర లెవల్‌లో సెటైర్స్
'వీర సింహా రెడ్డి' సినిమాలో ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారా? 'ప్రజలు ఎన్నుకున్న వెధవలు' డైలాగ్ ఎవరిని ఉద్దేశించినది? అభివృద్ధి ఎక్కడంటూ వేసిన ప్రశ్న ఎవరికి?
'సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో! కానీ, ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు' - 'వీర సింహా రెడ్డి' ట్రైలర్‌లో డైలాగ్ రాజకీయ పరంగా చర్చనీయాంశమైంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై పేల్చిన డైలాగ్ బుల్లెట్ కింద ఆ మాటను చాలా మంది చూశారు.
ఎందుకంటే... ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో ఎన్టీఆర్ పేరు తీసేసిన జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, వైఎస్సార్ పేరును పెట్టడంతో చురకలు వేశారని భావించారు. ఈ రోజు సినిమా విడుదలైంది. అందులో ఓ డైలాగ్, ఓ సన్నివేశం ఇంకా ఘాటుగా ఉన్నాయని చెప్పాలి.
ప్రజలు ఎన్నుకున్న వెధవలు ఎవరు?
'వీర సింహా రెడ్డి'లో ప్రజల అండదండలు ఉన్న నాయకుడిగా టైటిల్ పాత్రలో బాలకృష్ణ కనిపించారు. ఆయనకు హోమ్ మంత్రి నుంచి పిలుపు వస్తుంది. ఓసారి వచ్చి కలిసి వెళ్ళమని! అప్పుడు ''నువ్వు వెళ్ళడం ఏమిటి పెద్దన్నా'' అని ఓ పాత్రధారి అంటే... ''ప్రజలు ఎన్నుకున్న వెధవలు వాళ్ళు! గౌరవించడం మన ధర్మం / బాధ్యత'' అని బాలకృష్ణ బదులు ఇస్తారు.
'ప్రజలు ఎన్నుకున్న వెధవలు' అని ఎవరిని ఉద్దేశించి అన్నారు? సినిమా పరిశ్రమ పెద్దలు అందరూ అమరావతి వెళ్ళి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సమయంలో ''అక్కడకు హీరోలు వెళ్ళడం ఏమిటి?'' అని కామెంట్లు వినిపించాయి. కొందరికి ఆ దృశ్యాలు గుర్తుకు వచ్చి, ఈ మాటను అన్వయించుకుంటున్నారు. మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా, దర్శకుడు గోపీచంద్ మలినేని, హీరో బాలకృష్ణ ఏ ఉద్దేశంతో ఈ మాటకు సినిమాలో చోటు కల్పించారో మరి!?
అభివృద్ధి ఎక్కడ?
సూటిగా సెటైర్ వేశారా?
హోమ్ మంత్రిని వీర సింహా రెడ్డి కలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఓ సంభాషణ ఉంటుంది. అందులో అభివృద్ధి ఎక్కడ? అంటూ హీరో ప్రశ్నిస్తారు. అది కూడా ఏపీలో పరిస్థితులకు అన్వహించుకునేలా ఉందనేది కొందరు చెప్పే మాట. ఆ సీన్ ఏంటంటే...
రవిశంకర్ : మేం అధికారంలో ఉన్నాం
బాలకృష్ణ : కాంగ్రాచ్యులేషన్స్
రవిశంకర్ : నేను హోమ్ మినిష్టర్
బాలకృష్ణ : గ్లాడ్ టు మీట్ యు
రవిశంకర్ : ఇక్కడ ఏం జరగాలో, ఏం జరగకూడదో నిర్ణయించడానికి మీరెవరు?
బాలకృష్ణ : చెప్పుకునే అలవాటు నాకు లేదు. జీవోని యాజిటీజ్ గా అమలు చేస్తూ ఉంటాను.
రవిశంకర్ : జీవోనా?
బాలకృష్ణ : మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్. నా జీవో గాడ్స్ ఆర్డర్.
రవిశంకర్ : అభివృద్ధికి అడ్డుపడితే గవర్నమెంట్ ఊరుకోదు
బాలకృష్ణ : ఏ వృద్ధి?
రవిశంకర్ : అభివృద్ధి
బాలకృష్ణ : ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిష్టర్?
ప్రగతి సాధించడం అభివృద్ధి
ప్రజల్ని వేధించడం కాదు!
జీతాలు ఇవ్వడం అభివృద్ధి
బిచ్చం వేయడం కాదు!
పని చేయడం అభివృద్ధి
పనులు ఆపడం కాదు!
నిర్మించడం అభివృద్ధి
కూల్చడం కాదు!
పరిశ్రమలు తీసుకు రావడం అభివృద్ధి
ఉన్న పరిశ్రమలు మూయడం కాదు!
బుద్ధి తెచ్చుకో... అభివృద్ధికి అర్థం తెలుసుకో
రవిశంకర్ : మరి వచ్చే పరిశ్రమలను ఎందుకు వద్దంటున్నావ్?
బాలకృష్ణ : వాడు దోచుకోవడానికి వచ్చాడు, నాట్ అలవుడ్
రవిశంకర్ : నేను ఫోన్ కొడితే స్టేట్ పోలీస్ మొత్తం దిగుతుంది
బాలకృష్ణ : రారు, రానివ్వను. నాట్ అలవుడ్
రవిశంకర్ : నీకు ఎదురుగా నేనే వస్తా
బాలకృష్ణ : బై ఎలక్షన్ జనాలకు భారం, నాట్ అలవుడ్!
రవిశంకర్ : ఏం చూసుకుని నీకు ఆ పొగరు?
బాలకృష్ణ : పదవి చూసుకుని నీకు ఆ పొగరు ఏమో!? బై బర్త్ నా డీఎన్ఏకు పొగరు ఎక్కువ!
బాలకృష్ణ నోటి నుంచి, సాయి మాధవ్ బుర్రా కలం నుంచి 'వీర సింహా రెడ్డి'లో వెలువడిన మాటలు ఇవి. జీతాలు సమయానికి ఇవ్వకపోవడం, పరిశ్రమలను మూసేయడం, పనులు ఆపడం వంటివి ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించినవే అని టాక్.
థియేటర్లలో ప్రతి మాట ఒక తూటాలా పేలింది. ఏపీని టార్గెట్ చేస్తూ ఈ సీన్ ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. ఈ సన్నివేశంలో రాయలసీమ గురించి బాలకృష్ణ చెప్పేటప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు ఆరుగురు ముఖ్యమంత్రులను సీమ ఇచ్చిందని చెప్పారు గానీ నవ్యాంధ్రప్రదేశ్ తాజా సీయం గురించి చెప్పలేదు.
Also Read : 'వీర సింహా రెడ్డి' రివ్యూ : బాలకృష్ణ విశ్వరూపం, వీర విహారం - ఫ్యాక్షన్ స్టోరీ, సినిమా ఎలా ఉందంటే?
అవకాశం దొరికిన ప్రతిసారీ తెలుగు దేశం మీద, ఆ పార్టీ నాయకులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల మీద వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు చేస్తుంటారు. 'వీర సింహా రెడ్డి'కి విపరీతమైన క్రేజ్ నెలకొన్న నేపథ్యంలో... సినిమా విడుదలకు ముందు బాలకృష్ణ మీద ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్ చేశారు. బాలయ్య తాత అని వ్యాఖ్యానించారు. ఈ సన్నివేశాలు చూశాక ఏం అంటారో? వైసీపీ ప్రభుత్వం ఏం కౌంటర్ ఇస్తుందో?
Also Read : డబుల్ రోల్ పెట్టి వాడేసుకున్నావ్, నానా కుమ్ముడు కుమ్మేశావ్ - బాలకృష్ణ కుమ్మేశారంతే