Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి
Vani Jayaram Passed Away : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మరణం మిస్టరీగా మారింది. ఆమెకు ఏమైందనేది మిస్టరీగా మారింది. వాణీ జయరామ్ చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు.
లెజండరీ సింగర్ వాణీ జయరామ్ (Vani Jayaram Death) మరణం చుట్టూ పలు అనుమానాలు నెలకొన్నాయి. అదొక మిస్టరీగా మారింది. చెన్నైలోని నాగంబాక్కంలో గల హద్డౌస్ రోడ్డులోని సొంత ఇంటిలో వాణీ జయరామ్ ప్రమాదానికి గురి అయ్యారు. దాంతో ఆమె మృతిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకోవడం కూడా ప్రేక్షకుల్లో మరిన్ని సందేహాలకు కారణం అవుతోంది.
వాణీకి ఏమైంది?
ఇంట్లో ఏం జరిగింది?
వాణీ జయరామ్ ఇంట్లోని గ్లాస్ టేబుల్ మీద పడటంతో ఆమె ముఖానికి బలమైన గాయాలు అయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ రోజు (శనివారం) ఉదయం ఆ ఘటన జరిగిందట. ఆ సమయంలో ఎవరూ లేరట. ఇంట్లో వాణీ జయరామ్ ఒక్కరే ఉంటారు. పని మనిషి వచ్చి తలుపు కొట్టగా వాణీ జయరామ్ ఎంత సేపటికీ తలుపు తీయక పోవడంతో బంధువులకు సమాచారం అందించగా... వెంటనే వచ్చారు.
రక్తపు మడుగులో ఎందుకు?
బంధువులు వచ్చి తలుపు తీసి ఇంట్లోకి వెళ్ళే సరికి వాణీ జయరామ్ రక్తపు మడుగులో ఉన్నారట. దాంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకు వెళ్ళగా... చికిత్స చేయడం ప్రారంభించారు. కొంత సేపటికి తుది శ్వాస విడిచారని తెలిసింది. పని మనిషి చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also Read : కళా తపస్వికి తెలుగు ప్రభుత్వాలు గౌరవం ఇవ్వలేదా? ఆయన స్థాయికి అది అవమానమేనా?
వాణీ జయరామ్ రక్తపు మడుగులో పడి ఉండటం కూడా అనుమానానికి కారణంగా కనిపిస్తోంది. కాలుజారి పడటం జరిగిందా? లేదంటే ఇంట్లోకి ఎవరైనా చొరబడి ఏమైనా చేశారా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు ఎండ్ కార్డు వేసిన రోజే 'నిజం విత్ స్మిత' మొదలు
వాణీ జయరామ్ అసలు పేరు కలైవాణి. తమిళనాడులోని వెల్లూరులో అయ్యంగార్ కుటుంబంలో నవంబర్ 30, 1945 జన్మించారు. కర్ణాటక సంగీతంలో చిన్నతనం నుంచి శిక్షణ తీసుకున్నారు. ఎనిమిదేళ్ళ వయసులో తొలి ప్రదర్శన ఇచ్చారు. చదువు పూర్తైన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశారు. ఆమె మామగారు కూడా కర్ణాటిక్ సింగర్ కావడంతో ఆయన ప్రోత్సాహంతో గాయనిగా అడుగులు వేశారు.
'గుడ్డీ' సినిమాతో వాణీ జయరామ్ చిత్రసీమకు పరిచయం అయ్యారు. అందులో తొలి పాటకు ఐదు అవార్డులు ఆదుకున్నారు. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ, కన్నడ, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, భోజ్ పురి, ఒరియా, తుళు భాషల్లో పాటలు పాడారు. ఐదు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. వాణీ జయరామ్ 50 ఏళ్ళ కెరీర్ లో మొత్తం మీద 10 వేల పాటలకు పైగా పాడారు. అందులో తెలుగు పాటలు వెయ్యి కంటే ఎక్కువే.
వాణీ జయరామ్ ఉత్తమ గాయనిగా మూడు సార్లు జాతీయ పురస్కారం అందుకున్నారు. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన 'అపూర్వ రాగంగాళ్' సినిమా (తెలుగులో 'అంతులేని కథ')లో పాటలకు గాను ఒకసారి జాతీయ పురస్కారం అందుకున్నారు. మిగతా రెండు సార్లు కె. విశ్వనాథ్ సినిమాల్లో పాటలు అనుకోవడం విశేషం. చిత్రసీమకు ఆమె చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం మొన్న గణతంత్ర దినోత్సవం నాడు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. అది అందుకోక ముందు కన్నుమూయడం విషాదమని అభిమానులు, ప్రేక్షకులు విలపిస్తున్నారు.