Unstoppable with NBK 2: ‘అన్‌స్టాపబుల్-2’ ప్రోమో: బాలకృష్ణ కొత్త క్రష్ ఆమేనట - విశ్వక్, సిద్ధూలతో ఆడేసుకున్న బాలయ్య!
ఈ సారి బాలయ్య యువ హీరోలతో అలరించేందుకు సిద్ధమైపోయారు. తాజాగా ఎపిసోడ్‌లో సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్‌లు ‘అన్‌స్టాపబుల్-2’కు అతిథులుగా విచ్చేశారు. ఇదిగో ప్రోమో.
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ సీజన్-2 రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ గెస్టులుగా వచ్చిన సంగతి తెలిసిందే. వారు బాలయ్యకు బంధువులు కూడా కావడం, ఈ ఎపిసోడ్‌కు ముందు వదిలిన ప్రోమో అభిమానుల్లో అంచనాలు పెంచేయడంతో.. ఫస్ట్ ఎపిసోడ్ సరికొత్త రికార్డులను సృష్టించింది. 24 గంటల వ్యవధిలో పది లక్షల మందికి పైగా ఈ ఎపిసోడ్‌ను చూశారు. ఇదివరకు ఎన్నడూ ఆహా షోకు ఈ స్థాయిలో వ్యూస్ రాలేదట. మున్ముందు స్ట్రీమింగ్ కాబోయే షోస్ కూడా ఇదే స్థాయిలో దూసుకెళ్తాయని ‘ఆహా’ టీమ్ భావిస్తోంది.
తాజాగా ఆహా మరో ప్రోమో కూడా విడుదల చేసింది. ఈ ఎపిసోడ్‌లో హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డలు అతిథులుగా పాల్గొన్నారు. వారితో బాలయ్య మామూలుగా ఆడుకోలేదు. కాసేపు వారిని చిలిపి ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెట్టారు. ‘‘ఇండస్ట్రీలో చాలామంది కుర్రాళ్లను చూస్తుంటాను. అంతమందిలో నా మనసు దోచుకున్నవాళ్లను మీ ముందుకు తీసుకొస్తున్నా’’ అంటూ బాలయ్య విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డను స్టేజ్ మీదకు ఆహ్వానించారు. ఆ తర్వాత సిద్ధూ హెయిర్ స్టైల్ చూసి బాలయ్య ఫన్నీగా స్పందించారు. ఇందుకు సిద్ధూ మాట్లాడుతూ.. ‘‘అది మెస్సీ లుక్’’ అని తెలిపాడు. ఇందుకు బాలకృష్ణ స్పందిస్తూ.. ‘‘నేను అలా మెస్సీ లుక్‌తో కనిపించిన సినిమాలన్నీ మెస్సయ్యాయమ్మా’’ అని ఆయన మీద ఆయనే సెటైర్ వేసుకున్నారు.
ఆ తర్వాత బాలకృష్ణ.. బయట ఎప్పుడైనా కలుస్తుంటారా మీరిద్దరూ అని అడిగారు. ఇందుకు విశ్వక్ నిన్న కాక మొన్న నైటే కలిశామని సమాధానం చెప్పాడు. దీంతో ఎన్ని పెగ్‌లు వేశారని బాలయ్య అడిగారు. ‘‘ఒకడేమో మాస్‌కా దాస్, ఇంకొకడేమో మాస్ కా బాస్. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? గాడ్ ఆఫ్ మాస్’’ అంటూ బాలయ్య తన గురించి తాను చెప్పుకున్నారు. ‘‘మీ కరెంట్ క్రష్ ఎవరు?’’ అని విశ్వక్, సిద్ధూలు అడిగిన ప్రశ్నకు.. బాలయ్య ‘రష్మిక మందన్నా’ అని తెలిపారు. మొత్తం ఎపిసోడ్‌లో బాలయ్య బోలెడంత ఫన్ క్రియేట్ చేసినట్లు ప్రోమోను బట్టి తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ అక్టోబర్ 21న ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది.
‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ ప్రోమోను ఇక్కడ చూడండి:
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2' ఫస్ట్ ఎపిసోడ్‌కు 24 గంటల్లో పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని ఆహా ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. సెన్సేషనల్ ఎపిసోడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోందని, నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో ఓటీటీ రికార్డులు తిరగరాస్తున్నారని పేర్కొంది. మరోవైపు యూట్యూబ్‌లో కూడా ప్రోమో రికార్డుల మోత మోగిస్తోంది. ఈ ప్రోమో విడుదలైన రోజు నుంచి ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే’ సీజన్-2 ప్రోమో టాప్ ట్రెండ్స్‌లో ఉంది.
Also Read: కొరియా, చైనా, జపాన్ భాషల్లోనూ ‘జిన్నా’ రిలీజ్? చిరును టార్గెట్ చేశారా? మంచు విష్ణు సమాధానం ఇదే!