Varalaxmi Sarathkumar: చిన్నతనంలో దారుణమైన అనుభవాలు... లైంగిక వేధింపులపై కన్నీళ్లు పెట్టుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్
Varalaxmi Sarathkumar on sexual assault: ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ఓ డాన్స్ షోలో చిన్నప్పుడు తనను ఐదారుగురు లైంగికంగా వేధించారంటూ ఎమోషనల్ అయ్యింది

ప్రముఖ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి తనకు చిన్నప్పుడే లైంగిక వేధింపులు ఎదురయ్యాయని చెప్తూ ఎమోషనల్ అయింది. ఓ డాన్స్ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్న వరలక్ష్మి... షోలో భాగంగా ఓ లేడీ కంటెస్టెంట్ తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పడంతో, తనకు చిన్నప్పుడు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమైంది. అదే షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్న స్నేహ ఆమెను దగ్గర తీసుకొని ఓదార్చింది.
లైంగిక వేధింపులను తలుచుకుని ఎమోషనల్
తమిళ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడికి కెరియర్ తొలినాళ్ళలో అవకాశాలు బాగానే వచ్చినప్పటికీ, అదృష్టం కలిసి రాలేదు. దీంతో లేడీ విలన్ గా యూటర్న్ తీసుకుని ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఇప్పటిదాకా తెలుగులో క్రాక్, హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. తాజాగా జీ తమిళంలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ షోలో వరలక్ష్మి శరత్ కుమార్ తనకు చిన్నప్పుడే లైంగిక వేధింపులు ఎదురయ్యాయనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
2024లో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన వరలక్ష్మి ప్రస్తుతం 'డాన్స్ జోడీ డాన్స్ రీలోడెడ్ 3' అనే షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఆ షోకు సంబంధించి తాజాగా విడుదల చేసిన ప్రోమోలో వరలక్ష్మి తన పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ విషయాలను బయట పెట్టింది. షోలో పాల్గొన్న ఓ లేడీ కంటేస్టెంట్ తనకు చిన్నప్పుడే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసి వరలక్ష్మి ఎమోషనల్ అవుతూ చిన్నతనంలో తాను కూడా అలాంటి లైంగిక వేధింపులకు గురయ్యాను అని, దాదాపు ఐదారుగురు తన లైంగికంగా వేధించే వారని గుర్తుచేసుకుంది. "నీది నాది ఒకటే స్టోరీ" అంటూ కన్నీటి పర్యంతమైంది. "నాకు ఇంకా పిల్లలు లేరు. పిల్లలు పుట్టాక వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి కచ్చితంగా అవగాహన కల్పిస్తాను" అని చెప్పుకొచ్చింది. దీంతో ఒక స్టార్ హీరో కూతురికి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందా? అంటూ అందరూ షాక్ అవుతున్నారు. ఇక వరలక్ష్మి గతంలో కూడా తనకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని పలు సందర్భాలలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీ
ఇదిలా ఉండగా టాలీవుడ్లో నటిగా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న వరలక్ష్మి 2024 లో తన స్నేహితుడు, ముంబైకి చెందిన వ్యాపారవేత్త నికోలయ్ సచ్ దేవ్ ని పెళ్లి చేసుకుంది. ఈ జంట ఇప్పుడు అన్యోన్యంగా గడుపుతున్నారు. ఇక పెళ్లయ్యాక ఈ అమ్మడు 'శివంగి' అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. లేడీ ఓరియంటెడ్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీలో ఆనంది మరో కీలకపాత్రను పోషిస్తుండగా, దేవరాజు భరణి ధరన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే వరలక్ష్మి కే హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న 'కూర్మనాయకి' అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. చివరగా వరలక్ష్మి 'మదగజరాజా' అనే సినిమాలో నటించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

