BRO TRP: ఏంటి 'బ్రో'.. పవన్ కల్యాణ్ సినిమాకి మరీ ఇంత తక్కువ టీఆర్పీనా?
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం 'బ్రో'. థియేటర్లలో యావరేజ్ ఫలితాన్ని అందుకున్న ఈ సినిమాకి బుల్లితెర మీద కూడా అలాంటి స్పందనే వచ్చినట్లు టీఆర్పీని బట్టి తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బ్రో - ది అవతార్'. జూలై చివరి వారంలో థియేటర్లలో వచ్చిన ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ను అలరించింది. కాకపొతే హిట్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. దీంతో ఫైనల్ రన్ ముగిసే నాటికి యావరేజ్ గా మిగిలిపోయింది. అయితే ఈ చిత్రానికి బుల్లితెర మీద కూడా అలాంటి స్పందనే రావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
'బ్రో' సినిమా ఇటీవల జీ తెలుగు ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన టీఆర్పీ రేటింగ్ తాజాగా వెలువడింది. మెగా మేనమామ మేనల్లుడు కలసి నటించిన ఈ సినిమా 7.24 టీఆర్పీ రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇతర టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల రేటింగ్స్ తో పోల్చుకున్నా, పవన్ కల్యాణ్ గత సినిమాలతో కంపేర్ చేసినా ఇది చాలా తక్కువ అని చెప్పాలి.
అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమా 29.4 రేటింగ్ తో అత్యధిక టీఆర్పీ నమోదు చేసిన తెలుగు చిత్రంగా రికార్డ్ సృష్టించింది. మహేశ్ బాబు చేసిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా 23.4 టీఆర్పీతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ప్రభాస్ నటించిన 'బాహుబలి-2' మూవీ 22.7 టీఆర్పీ రేటింగ్ తో థర్డ్ ప్లేస్ లో వుంది. అయితే అదే రేంజ్ స్టార్ డమ్ ఉన్న పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'బ్రో' చిత్రానికి 7.24 రేటింగ్ రావడం గమనార్హం.
Also Read: క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొడుకుతో యాక్షన్ కింగ్ కుమార్తె ఎంగేజ్మెంట్.. ఫొటోలు వైరల్!
ఓటీటీలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఎంత పెద్ద సినిమాకైనా బుల్లితెర మీద ఆశించిన టీఆర్పీ రావడం లేదనేది వాస్తవం. అయినప్పటికీ స్టార్ హీరోల చిత్రాలకు ఓ మోస్తరు రేటింగ్స్ వస్తున్నాయి. ప్రభాస్ డిజాస్టర్ మూవీ 'రాధేశ్యామ్' 8 రేటింగ్ నమోదు చెయ్యగా.. చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమాకు 7.7 రేటింగ్ వచ్చింది. అఖిల్ చేసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రానికే 9.31 టీఆర్పీ నమోదైంది. పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' మూవీకి 19.12 రేటింగ్ వస్తే.. గత చిత్రం 'భీమ్లా నాయక్' కు 9.06 టీఆర్పీ వచ్చింది. కాబట్టి వీటితో పోల్చి చూసుకున్నా ఇద్దరు మెగా హీరోలు కలిసి చేసిన 'బ్రో' సినిమాకు తక్కువ రేటింగే వచ్చిందని చెప్పుకోవాలి.
'బ్రో' చిత్రంలో పవన్ కల్యాణ్, సాయి తేజ్ లతో పాటుగా ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది తమిళ్ లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'వినోదయ సీతం' చిత్రానికి తెలుగు రీమేక్. సముద్రఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు - స్క్రీన్ ప్లే అందించారు. ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. జీ స్టూడియోస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read: ఓవైపు యాక్షన్, మరోవైపు డైరెక్షన్ - యాక్టర్స్‌గా రాణిస్తున్న డైరెక్టర్స్ వీరే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial