Kosaraju Aditya: కన్నడవాళ్లను తీసుకొచ్చి, హీరో చేసి అన్ని సౌకర్యాలు ఇస్తారు - తెలుగు సీరియల్స్ దుస్థితిపై కోసరాజు ఆదిత్య కామెంట్స్
Kosaraju Aditya: ప్రస్తుతం తెలుగు సీరియల్స్‌లో కన్నడ నటీనటులు ఎక్కువయిపోయారు. దాని వల్ల తెలుగు సీరియల్స్‌లో వస్తున్న సమస్యలను కోసరాజు ఆదిత్య బయటపెట్టారు. వారికి డెడికేషన్ లేదని వ్యాఖ్యలు చేశారు.
Kosaraju Aditya About Kannada Actors: ప్రస్తుతం తెలుగు సీరియల్స్‌లో తెలుగు నటీనటుల కంటే కన్నడ నుంచి వచ్చిన యాక్టర్సే ఎక్కువగా కనిపిస్తున్నారు. దాని వల్ల బుల్లితెరపై తెలుగు యాక్టర్స్‌కు అవకాశాలు తగ్గిపోతున్నాయని పలువురు వాపోయినా మేకర్స్ పట్టించుకోవడం లేదు. తాజాగా ఈ విషయంపై కోసరాజు ఆదిత్య కూడా స్పందించారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఎన్నో సీరియల్స్‌లో మామ, తండ్రి పాత్రలు పోషిస్తున్న ఆదిత్య.. తెలుగు సీరియల్స్ పద్ధతిపై నిరాశ వ్యక్తం చేశారు.
మనవల్లే..
‘‘రోజుకు రెండున్నర రోజుల ఎపిసోడ్స్ షూటింగ్ జరిగితే కానీ ప్రొడ్యూసర్ బ్రతకలేడు. ఒకటిన్నర ఎపిసోడ్ ఖర్చులకు పోయినా.. మిగతా ఒక ఎపిసోడ్ అయినా వారికి మిగలాలి. ఏ నిర్మాత కూడా ఇప్పుడు హ్యాపీగా లేడు. దానికి కారణం యాక్టర్లే. మన దగ్గర సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. అందరూ యాక్టింగ్ బాగా చేస్తారు. కానీ టైమ్ అవ్వగానే వెళ్లిపోతాం అంటారు. వాళ్ల ఇంటి నుంచి ఫోన్లు వస్తుంటాయి. కన్నడ నుంచి వచ్చినవాళ్లు అలా వెళ్లిపోతామని అడగరు. ఒకరకంగా చెప్పాలంటే మనవాళ్లు చేసుకున్న పరిస్థితే ఇది. తెలుగు వాళ్లు వద్దు, కన్నడ వాళ్లు అయితే మన మాట వింటారు అన్నది మనకు మనగా చేసుకున్నదే. దానివల్లే ఇప్పుడు అంతా కన్నడ వాళ్లు వచ్చేశారు’’ అంటూ నిర్మాతల దుస్థితిపై స్పందించారు కోసరాజు ఆదిత్య.
వారికే అన్ని సౌకర్యలు..
‘‘కన్నడ వాళ్లకి తెలుగు అస్సలు రాదు, యాక్టింగ్ రాదు. కన్నడలో 2, 3 సీరియల్స్‌లో చిన్న పాత్రలు చేసినవాడిని తీసుకొచ్చి ఇక్కడ హీరో చేస్తున్నారు. వాడికి అన్ని సౌకర్యాలు ఇచ్చి రూ.10 వేలు, రూ.12 వేలు రెమ్యునరేషన్ ఇస్తారు. కానీ ఇక్కడ వాళ్లకి రూ.8 వేలు కూడా ఇవ్వరు. డిమాండ్ చేస్తే తర్వాత చూద్దాం అంటారు. ఏం మాట్లాడకుండా చేసుకోగలిగిన వాడు ఉంటాడు. మాకు ఇంకా డెడికేషన్ ఉంది కాబట్టే ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు వచ్చిన యాక్టర్స్‌కు డెడికేషన్ అంటే ఏంటో తెలియదు. డైరెక్టర్ చెప్తున్నా వినకుండా అద్దం చూసుకుంటారు. అలా అయితే దర్శకుడికి ఏం మర్యాద ఇస్తున్నట్టు? ఇప్పుడు కాఫీ మగ్ పట్టుకొని రావడం ఫ్యాషన్ అయిపోయింది. ఆ తర్వాత షాట్‌కు రెడీనా అంటే తెలీదు బ్లాంక్ అయ్యింటారు. ఎందుకంటే డైరెక్టర్ చెప్పింది వినలేదు కాబట్టి. ఈరోజుల్లో చాలామంది యంగ్ యాక్టర్లు అలాగే ఉన్నారు. ఇదంతా దరిద్రం’’ అంటూ ఈరోజుల్లో యాక్టర్ల ప్రవర్తనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆదిత్య.
ఆర్టిస్టుల మధ్య గొడవలు..
ఒక్కొక్కసారి ఉన్నట్టుండి సీరియల్స్‌లో నటీనటులను మార్చేస్తుంటారు. అలా ఎందుకు జరుగుతుంది అనే విషయంపై కోసరాజు ఆదిత్య స్పందించారు. ‘‘ప్రవర్తనలో సమస్య ఉన్నా, డేట్స్ ఇబ్బంది అయినా ఆర్టిస్టులు తప్పుకోవాల్సి వస్తుంది. ఆర్టిస్టుల మధ్య గొడవలు కూడా దీనికి కారణం. కొంతకాలం నుంచి అలాంటివి కూడా చూస్తున్నాను. హీరో వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్‌ను కొడితే.. అతడిని అందరూ కలిసి కొట్టి పంపించేశారు. అలాంటి గొడవలు వచ్చినప్పుడు వారిలో ఎవరు ముఖ్యమో వారిని ఉంచి ఇంకొకడిని పంపించేయాలి’’ అని చెప్పుకొచ్చారు. ఇక ‘దేవత’ సీరియల్‌లో కూడా కోసరాజు ఆదిత్య కీలక పాత్రలో కనిపించగా.. అందులో సెకండ్ హీరోయిన్‌గా నటించిన సిరి పెళ్లి ఫిక్స్ అవ్వడం వల్ల సీరియల్ మానేసిందని తెలిపారు. అర్జున్ కూడా బిగ్ బాస్‌కు వెళ్లాడం వల్ల కనిపించలేదన్నారు.
Also Read: ‘కన్నప్ప’ కోసం బాలీవుడ్ ఖిలాడీ - అతిథి పాత్రలో హిందీ స్టార్ హీరో!