Janaki Kalaganaledu June 6th (ఈరోజు) ఎపిసోడ్: వంటల పోటీలో రామచంద్రకు అవమానం- అమ్మ పేరుతో మార్కులు కొట్టేసిన రాముడు
జ్ఞానాంభ భయపడినట్టే జరిగింది. పల్లెటూరి వాడిని రామచంద్రను చూసి అంతా నవ్వుకుంటారు. చదువు లేదని హేళన చేస్తారు. కానీ అమ్మ పేరుతో అందరి నోళ్లు మూయిస్తాడు రాముడు.
వంటల పోటీలకు వచ్చిన వాళ్లంతా తమను తాము ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. రామచంద్ర వంతు వస్తుంది. తన గురించి చెప్తుంటాడు. విద్యార్హతలు గురించి చెప్పమంటారు న్యాయనిర్ణేతలు. వాళ్లు ఇంగ్లీష్‌లో అడిగే సరికి రామచంద్రకు ఏం అర్థం కాదు. అక్కడ ఉన్న వాళ్లంతా హేళనగా మాట్లాడుతుంటారు. చివరకు ఆరో తరగతి అని చెప్తాడు. అది విన్న వాళ్లంతా ఒక్కసారి ఫక్కున నవ్వుతారు.
ఇంట్లో టీవీ చూస్తున్న జ్ఞానాంభ లేచి వెళ్లిపోతుంది. కూర్చొని ఇంట్లో వాళ్లు చెబుతుంటే... అసలు పోటీ మొదలు కాక ముందే వాళ్లంతా తన బిడ్డను అవమానిస్తున్నారని ఇంకా ఏ మొహం పెట్టుకొని పోటీ చూడాలని అడుగుతుంది జ్ఞానాంభ. ఇలాంటివి ముందే ఆలోచించి పోటీలు వద్దూ అన్నాని... ఒక్కరు కూడా తన మాట వినలేదని బాధపడుతుంది. దానికి మల్లిక ఆజ్యం పోస్తుంది. ఇప్పటికైనా ఫోన్ చేసి వచ్చేయమంటుంది. దీంతో ఈ అవమానాలు ఇక్కడితో ఆగిపోతాయని సలహా ఇస్తుంది.
జాతీయస్థాయిలో జరిగే ఈ పోటీలకు గొప్ప గొప్ప చదువులు చదువుకొని వచ్చారని... వాళ్లతో మీరు పోటీ గలరా అని రామచంద్రను న్యాయనిర్ణీతలు అడుగుతారు. తనకు అమ్మే స్ఫూర్తి అని... ప్రపంచం అమ్మ కంటే గొప్పగా వంట చేసే వాళ్లు ఎవరూ లేరని అంటాడు. రామచంద్ర మాటలకు అంతా ఇంప్రెస్ అవుతారు.
తన బిడ్డకు జరిగిన అవమానాన్ని తలుచుకొని బాధపడుతుంది జ్ఞానాంభ. వాళ్లందరూ నా బిడ్డను ఎగతాళి చేసి మాట్లాడుతున్నారని అనుకుంటుంది. అవి తెలిస్తే రామచంద్ర తట్టుకోగలడా అని అనుకుంటుంది. ఇంతలో రామచంద్ర జ్ఞానాంభకు ఫోన్ చేస్తాడు. తన బిడ్డకు జరిగిన అవమానాలు తలుచుకొని పరధ్యానంలో ఉంటుంది. ఫోన్ వస్తున్న సంగతి కూడా చూసుకోదు. ఇంతలో గోవిందరాజు వచ్చి... పోన్ మోగుతుంటే చూసుకోవా అని అడుగుతాడు. జ్ఞానాంభ పట్టించుకోకపోయేసరికి తానే ఫోన్ తీసి గోవిందరాజే మాట్లాడతాడు. చాలా ఆనందంగా ఉందని... కచ్చితంగా కప్ గెలుస్తానని అంటాడు రామచంద్ర. అమ్మతో మాట్లాడతానంటాడు రామచంద్ర. పడుకొని ఉందని అబద్దం చెప్పి కవర్ చేస్తాడు గోవిందరాజు.
రామచంద్రకు మాత్రం తల్లితో మాట్లాడలేదే అనే లోటు కనిపిస్తుంది. ఇంతలో జ్ఞానాంభ ఫొటో తీసుకొచ్చి ఇస్తుంది జానకి. ఆనందంతో పొంగిపోతాడు రామచంద్ర.
తెల్లారేసరికి వంటల పోటీ మొదలవుతుంది. పోటీలో ఉన్న రామచంద్ర కంగారు పడుతుంటాడు. అతన్ని అలా చూసిన జానకి.. వచ్చి ధైర్యం చెబుతుంది. కచ్చితంగా పోటీలో మీరే గెలుస్తారని ప్రోత్సహిస్తుంది.
పోటీలో ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయలు ఇస్తామని... మీరు చెయ్యబోయే వంటకు సంబంధించిన సరకులు తెచ్చుకోవాలని.. సొంత డబ్బులు వాడొద్దని హెచ్చరిస్తారు నిర్వహకులు. పోటీలో పాల్గొన్న వారు మాత్రం వెళ్లి కొనుక్కోవాలని సూచిస్తారు. వెంటనే డబ్బులు కూడా ఇచ్చేస్తారు.
సరకులు కొనడానికి రామచంద్ర బయల్దేరతాడు. షాప్ వద్దకు వెళ్లేసరికి ఓ వ్యక్తి తన తల్లికి బాగాలేదని... డబ్బులు అడుగుతాడు. తన వద్ద ఉన్న వెయ్యి రూపాయాల్లో ఐదు వందలు ఇచ్చేస్తాడు రామచంద్ర. ఇప్పుడు ఉన్న ఐదు వందలతోనే సరకులన్నీ తీసుకోవాలనుకుంటాడు రామచంద్ర. తనకు కావాల్సిన సరకులు తీసుకునే సరికి 800 రూపాయల బిల్లు అవుతుంది.
రేపటి భాగం
కాంపిటేషన్ ప్రారంభమవుతుంది. తన వద్ద ఉన్న ఐదు వందలతోనే కావాల్సిన సరకు తెచ్చుకున్న రామచంద్ర... పోటీలకు సిద్ధమవుతాడు.