Jabardast Ganapathi: ఆ ‘జబర్దస్త్’ కమెడియన్ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ - ఎక్కడో తెలుసా?
‘జబర్దస్త్’ షో ఎంతోమంది కమెడియన్స్‌ను బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేసింది. వారిలో మంచి గుర్తింపు పొందిన గణపతి ఇప్పుడు స్కూల్ టీజర్‌గా సెటిలైనట్లు వార్తలు వస్తున్నాయి.
Jabardast Ganapathi: ‘జబర్దస్త్’ షోలో కమెడియన్‌గా కడుపుబ్బా నవ్వించిన గణపతి మాస్టార్ గుర్తున్నారా? ఆయన ఇప్పుడు నిజంగా మాస్టార్ అయ్యారు. బుల్లి తెరకు వీడ్కోలు తెలిపి.. ఇప్పుడు విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలనే తన చిరకాల కోరికను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు.
‘జబర్దస్త్’ లో బాగా గుర్తింపు తెచ్చుకున్న టీమ్ లలో హైపర్ ఆది టీమ్ ఒకటి. ఈ టీమ్ లో ఎత్తుగా, బొద్దుగా కామెడీ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు గణపతి. స్కిట్ లలో కూడా టీచర్‌గా, స్టూడెంట్ గా కనిపించి నవ్వులు పూయించారు. అయితే గణపతికి ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది. దానికోసం దాదాపు 25 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారట. అయితే ఇటీవల ఏపీ ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ పోస్టులను భర్తీ చేసింది. ఇందులో గణపతికి టీచర్ గా ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వులు రావడంతో వెంటనే ఉద్యోగానికి ఓకే చెప్పేశాడట. తన సొంత ఊరు శ్రీకాకుళంలో టీచర్ గా సెటిల్ అవ్వనున్నాడు గణపతి.
ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు గణపతి. ‘‘నా పాతికేళ్ల కల నెరవేరింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు చెప్పాలన్న నా కల నేటికి నెరవేరింది. ఏపీ ప్రభుత్వానికి ధన్యావాదాలు’’ అంటూ చెప్పుకొచ్చారు గణపతి. ఓ వైపు జబర్దస్త్ లో చేస్తూనే మరో వైపు అడపా దడపా సినిమాల్లో చిన్న చిన్న కామెడీ రోల్ లలో కనిపించి నవ్వించేవారు గణపతి. దీంతో టీవీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు, జబర్దస్త్ అభిమానులు గణపతికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కేవలం గణపతి మాత్రమే కాదు ‘జబర్దస్త్’ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది మంచి మంచి అవకాశాలను దక్కించుకుంటున్నారు. యాంకర్ అనసూయ, రష్మీ, సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, హైపర్ ఆది, గెటప్ శీను, షకలక శంకర్, చమ్మక్ చంద్ర ఇలా ఎంతో మంది కెరీర్ లో దూసుకెళ్తున్నారు. ఇదే జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిన ఆర్పి లాంటివాళ్లు వ్యాపారంలో రానిస్తున్నారు. అలాగే ఇటీవల వేణు ఎల్దండి ‘బలగం’ అనే సినిమా తీసి ఔరా అనిపించారు.
Also Read: ‘విరూపాక్ష’ డైరెక్టర్ ఎక్కువ రోజులు బతకడని డాక్టర్లు చెప్పారు: దర్శకుడు సుకుమార్
తెలుగు బుల్లితెరపై ‘జబర్దస్త్’ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కామెడీ షో కు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. ‘జబర్దస్త్’ ప్రోగ్రాం మంచి సక్సెస్ అవ్వడంతో ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ అనే మరో కామెడీ ప్రోగ్రాంను కూడా ప్రారంభించారు. ఈ షో హిట్ అవ్వడంతో ఇతర ఛానళ్లలో కూడా కామెడీ ప్రోగ్రాంలను స్టార్ట్ చేశారు. కానీ జబర్దస్త్ ప్రోగ్రాం ను మాత్రం క్రాస్ చేయలేకపోయాయి. కొన్ని ప్రోగ్రాంలు రద్దు అయ్యాయి కూడా. అంతలా జబర్దస్త్ ప్రోగ్రాం ప్రేక్షకలను ఆకట్టుకుంది. ఇక ఈ కామెడీ ప్రోగ్రాంలలో పాల్గొన్న కమెడియన్స్ కు కూడా మంచి లైఫ్ ను ఇచ్చింది జబర్దస్త్. దీని ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇంకొంత మంది వేరే టీవీ ప్రోగ్రాంలు చేస్తున్నారు. మరికొంత మంది సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఇలా ఈ వేదిక ద్వారా ఎంతో మంది కమెడియన్స్ తమ కలలను సాకారం చేసుకుంటున్నారు.