Tollywood Update: రూ.100 కోట్లతో సినిమా తీస్తున్నాం - మోహన్ బాబు కీలక ప్రకటన
ప్రముఖ నటుడు మోహన్ బాబు కీలక ప్రకటన చేశారు. మంచు విష్ణుతో కలిసి రూ. 100 కోట్లతో ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మోహన్ బాబు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, నటుడిగా, నిర్మాతగా వందల చిత్రాలు చేశారు. 80, 90వ దశకంలో ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమా విడుదలను వాయిదా వేసుకునే వారు. కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, అద్భుత చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అద్భుత నటుడిగా గుర్తింపు పొందారు.
గత కొంతకాలంగా సక్సెస్ కాలేకపోతున్న మంచు ఫ్యామిలీ
ఒకప్పుడు సినిమా పరిశ్రమలో వెలుగు వెలిగిన మోహన్ బాబుకు గత కొంత కాలంగా అస్సలు కలిసి రావడం లేదు. ఆయన నటించిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. నిర్మాతగా చేసిన సినిమాలు కూడా అంతగా ఆడటం లేదు. ఆయన వారసులు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కావడం లేదు. మంచు విష్ణు నటించిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా మిగులుతున్నాయి. ఆయన తాజాగా నటించి ‘జిన్నా’ చిత్రం కూడా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ లాంటి హీరోయిన్లు నటించినా ప్రజలు ఆ సినిమాను ఆదరించలేదు. మంచు మనోజ్ వెండి తెర మీద కనిపించక చాలా రోజులు అవుతోంది. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలను అనౌన్స్ చేశారు. ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా, మరో సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మంచు లక్ష్మీ సైతం పెద్దగా రాణించడం లేదు.
రూ. 100 కోట్లతో ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణం
ఈ నేపథ్యంలోనే మంచు మోహన్ బాబు ఓ సంచలన ప్రకటన చేశారు. ఇటీవల తిరుమల ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తాను, విష్ణు కలిసి రూ. 100 కోట్ల భారీ వ్యయంతో ఒక చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను మంచు విష్ణు త్వరలో తెలియజేస్తారని మోహన్ బాబు వెల్లడించారు. మా అధ్యక్షుడు విష్ణు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు మోహన్ బాబు వెల్లడించాడు.
సినిమా కథ అదేనా?
పరమ శివ భక్తుడైన భక్త కనప్పపై సినిమా చేయాలనేది మోహన్ బాబు చిరకాల కోరిక. ఈ విషయాన్ని ఆయన పలుమార్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన చిత్రం ఇదే కథతో తెరకెక్కుతుందా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా అయినా నటుడిగా మోహన్ బాబుకు, నిర్మాతగా విష్ణుకు కలిసి వస్తుందో లేదో చూడాలి. మోహన్ బాబు చివరిగా ‘శాకుంతలం’ చిత్రంలో కనిపించారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో దుర్వాసముని పాత్రలో మోహన్ బాబు నటించారు. తెల్లటి పొడవాటి గడ్డం, పైన కొప్పు, మెడలో రుద్రాక్ష మాల, ఓ చేతిలో చెంబు, మరో చేతిలో యోగ దండం, కాషాయ బట్టలు చెక్క చెప్పులో చక్కటి లుక్ లో అలరించారు. అయితే, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
Read Also: త్వరలో అనౌన్స్ చేస్తాం, వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లిపై స్పందించిన నాగబాబు!