Chalapathi Rao : ఎన్టీఆర్ మనిషిగా ముద్రపడిన చలపతి రావు రియల్ లైఫ్ తెలుసా?
తెలుగు చిత్రసీమలో చలపతి రావుది ఐదు దశాబ్దాల ప్రయాణం. ఆయన 1200లకు పైగా సినిమాల్లో నటించారు. ఐదు సినిమాలు నిర్మించారు. ఎన్టీఆర్ మనిషిగా ముద్ర పడటంతో తొలుత బయట ఛాన్సులు రాకున్నా తర్వాత అందరితో నటించారు.
నందమూరి తారక రామారావు 'కథానాయకుడు' సినిమాతో వెండితెరపై చలపతి రావు (Chalapathi Rao) ప్రయాణం మొదలైంది. అందులో ఆయన మున్సిపల్ కమిషనర్ వేషం వేశారు. నిజానికి, చలపతి రావు హీరో కావాలనుకుని మద్రాస్ వెళ్ళారు. అయితే, కథానాయకుడు కావడం అంత సులభం కాదని ఆయనకు సులభంగా అర్థమైంది. దాంతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని విలన్ అయ్యారు. ఎన్టీఆర్ మద్దతుతో ఇండస్ట్రీలో నటుడిగా తొలి తొలి అవకాశాలు అందుకున్నారు. ఆయన సినిమా ప్రయాణం చూస్తే...
పెళ్ళి తర్వాత సినిమాల్లోకి
చలపతి రావు 19 సంవత్సరాలకు వివాహమైంది. పెళ్ళైన మూడేళ్ళ తర్వాత సినీ ప్రయత్నాలు ప్రారంభించారు. సినిమాల్లోకి రావాలని అనుకోవడానికి కారణం చుట్టుపక్కల జనాలే. చిన్నతనం నుంచి చలపతి రావు చదువులో వీక్. చదువు కంటే నాటకాల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. బాగా నటించే సరికి అందరూ 'నువ్వు మద్రాసు వెళితే హీరో అవుతావు' అని చెప్పడంతో ఇంట్లో లక్ష రూపాయలు తీసుకుని మద్రాస్ ట్రైన్ ఎక్కారు.
మద్రాసు వచ్చిన తర్వాత పరిస్థితి అర్థమైంది. లగ్జరీ లుక్ ఇస్తే హీరోగా అవకాశాలు వస్తాయని కారు కొన్నారు. ఒక డబ్బింగ్ సినిమా విడుదల చేశారు. అది ఆడలేదు. కారుకు యాక్సిడెంట్ కావడంతో పోయింది. ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. అప్పటికి శోభన్ బాబు, కృష్ణ హీరోలుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాజనాల, కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి విలన్లుగా బిజీ. ఎటు చూసినా తనకు అవకాశాలు రావడం కష్టమని ఎన్టీఆర్‌ను కలిశారు.
'దాన వీర సూర కర్ణ'తో బ్రేక్
ఎన్టీఆర్ చెప్పడంతో 'కథానాయకుడు' చిత్రంలో చలపతి రావుకు నటించే అవకాశం దక్కింది. ఆ తర్వాత నుంచి ఎన్టీఆర్ దగ్గర ఎక్కువ ఉండటంతో ఆయన మనిషిగా ముద్ర పడి ఇతరులు అవకాశాలు ఇవ్వలేదు. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించడంతో పాటు స్వీయ రచన, దర్శక నిర్మాణంలో రూపొందిన 'దాన వీర సూర కర్ణ'తో చలపతి రావుకు బ్రేక్ వచ్చింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ మూడు వేషాలు వేస్తే... చలపతి రావు ఐదు వేషాలు వేశారు. ఆ తర్వాత ఇతర హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి.
రియల్ లైఫ్‌లో మందు తాగరు
కెరీర్ స్టార్టింగ్‌లో చలపతి రావుకు ఎక్కువ విలన్ వేషాలు వచ్చాయి. రేప్ సీన్లు అంటే చాలు... తోటి నటీనటులకు, ప్రేక్షకులకు గుర్తొచ్చే పేరు చలపతి రావు. హీరోయిన్లు అయితే అవుట్ డోర్ షూటింగ్ ఉన్నప్పుడు ఆయన బస చేసే హోటల్‌లో ఉండటానికి భయపడేవారు. అయితే, నిజ జీవితంలో ఆయన ఎలా ఉండేవారో తెలుసా?
చలపతి రావు నాన్ ఆల్కహాలిక్. మందు, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండేవారు. ''సినిమాల్లోకి వెళతానని అన్నప్పుడు... మందు, సిగరెట్ ముట్టకూడదు. మహిళల జోలికి వెళ్ళకూడదని మా ఆవిడ చెప్పింది. తనకు ఇచ్చిన మాట మీద నిలబడ్డా'' అని ఓ సందర్భంలో ఆయన చెప్పారు. ఎన్టీఆర్ దగ్గర ఉండటంతో తనకు చెడు అలవాట్లు దరిచేరలేదని చెప్పారు.
మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు
చలపతి రావు సినిమాల్లోకి వచ్చిన ఐదారేళ్ళకు భార్య మరణించారు. అప్పటికి ఆయన వయసు 28 ఏళ్ళు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. పిల్లలను పెంచడం కోసం తొలుత మరొకరిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడినా... ఎవరూ ముందుకు రాలేదు. దాంతో తల్లి సాయంతో పిల్లల్ని పెంచారు. సినిమాల్లో చలపతి రావు బిజీ అయ్యాక చాలా మంది నుంచి పెళ్ళి చేసుకుంటామని ప్రతిపాదనలు వచ్చాయి. అప్పుడు ఆయన ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు ఆయన కుమారుడు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నారు.
Also Read : నటుడిగా కైకాల ప్రయాణంలో మజిలీలు - సత్యనారాయణ సమగ్ర సినిమా చరిత్ర
'నిన్నే పెళ్ళాడతా'... కెరీర్ టర్న్
చలపతి రావు కెరీర్ గురించి చెప్పాల్సి వస్తే... ఒక విధంగా 'నిన్నే పెళ్ళాడతా'కు ముందు, తర్వాత అని చెప్పాలి. విలన్‌గా పాపులర్ అయిన ఆయన చేత ఆ సినిమాలో తండ్రి వేషం వేయించారు కృష్ణవంశీ. ఆ తర్వాత నుంచి చలపతి రావుకు తండ్రి, బాబాయ్ పాత్రలు, కామెడీ వేషాలు రావడం మొదలైంది. మూడు తరాల నటులతో ఆయన పని చేశారు. 'యమగోల', 'యుగపురుషుడు', 'అక్బర్ సలీమ్ అనార్కలి', 'జస్టిస్ చౌదరి', 'దొంగ రాముడు', 'నిన్నే పెళ్ళాడతా', 'సింహాద్రి', 'ఆది', 'అరుంధతి', 'సింహా', 'దమ్ము', 'లెజెండ్' తదితర సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆర్.సి. క్రియేషన్స్ నిర్మాణ సంస్థ స్థాపించి ఐదు సినిమాలు తీశారు.