(Source: ECI/ABP News/ABP Majha)
Women's Day 2023: కళను వదిలి కెరీర్ వైపుకు - టాప్ MNC కంపెనీల్లో జాబ్స్ చేస్తున్న తారలు వీరే!
టాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్లు అవకాశాలు వచ్చినా సినిమాలకు దూరం అవుతుంటారు. అలా సినిమాలకు దూరం అయి జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించిన నటీమణులు వీరే..
సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా అవకాశాలు వస్తాయో చెప్పలేము. నటీనటులుగా మంచి అవకాశాలు వచ్చినప్పుడే నటులుగా పరిశ్రమలో నిలదొక్కుకోగలరు. లేకుంటే సినిమాలకు దూరం కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కువగా ఇలాంటి పరిస్థితుల ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొంత మంది హీరోయిన్లు మాత్రం తెరపై నటించే అవకాశాలు వస్తున్నా వాటిని కాదని తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని అగ్రస్థానాలకు చేరుకున్నారు. అలా ఇండస్ట్రీలోనే కాకుండా బయట ప్రపంచంలో పేరు తెచ్చుకున్న కొంత మంది తెలుగు హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.
మాన్య:
మోడల్ నుంచి నటిగా మారింది మాన్య. ఆమె 1999 లో వచ్చిన ‘సీతా రామరాజు’ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జునకు సుమ పాత్రలో చెల్లెలుగా నటించింది. మాన్య తన ప్రతిభతో మంచి అవకాశాలను, అభిమానులను కూడా సంపాదించుకుంది. పెళ్లయ్యాక మాన్య తన కుటుంబంతో కలిసి న్యూయార్క్‌లో స్థిరపడింది. మాన్య దంపతులకు ఇక పాప కూడా ఉంది. పెళ్లి తర్వాత మాన్య ఇంటికే పరిమితం కాలేదు తెలుసా? న్యూయార్క్ నగరంలో QA - రెగ్యులేటరీ ఇష్యూ ధ్రువీకరణలతో సీనియర్ ఆడిట్ మేనేజర్‌గా పని చేస్తుంది.
మయూరి కాంగో:
నటి మయూరి కాంగో కూడా అదే బాటలో పయనిస్తోంది. ఐఐటీ ఖరగ్‌పూర్ లో చదువుకున్న మయూరి కాంగో సినిమాలపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె 2000 లో మహేష్ బాబు నటించిన ‘వంశీ’ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలలో ఒకరిగా నటించింది. ఈ సినిమా తో మయూరి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె అనేక బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవడంతో జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో మార్కెటింగ్‌లో ఎంబీఏ చదివింది. ఆమె ఆదిత్య ధిల్లాన్ అనే ఎన్నారైని వివాహం చేసుకుంది. ఆ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె గూగుల్ ఇండియాలో కీలక పదవుల్లో ఉంది.
అపర్ణ:
విక్టరీ వెంకటేష్ నటించిన ‘సుందరాకాండ’ సినిమాలో అపర్ణ నటి మీనాతో పాటు సినిమాలో రోజా పాత్ర లో కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆమె వెంకటేష్ ను ప్రేమిస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన తర్వాత తనకు చాలా ఆఫర్లు వచ్చాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ, అపర్ణ అన్ని ఆఫర్లను తిరస్కరించింది. తర్వాత తన చదువుపై దృష్టి పెట్టడానికి సినిమాలపై ఆసక్తి చూపలేదు. 2002 లో పెళ్లి చేసుకున్న అపర్ణ ఆ తర్వాత అమెరికా వెళ్లింది. ప్రస్తుతం ఆమె కాలిఫోర్నియాలో నివాసం ఉంటోంది. విదేశాలకు వెళ్లే ముందు ఆమె సైకాలజీ డిగ్రీని భారతదేశంలోనే చేసింది. అక్కడి ప్రముఖ విద్యాసంస్థలో గత ఏడేళ్లుగా ఎంతో మందికి చదువు చెబుతోంది.
యామిని శ్వేత :
చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదటి సినిమాతోనే పాపులర్ అయిన వారిలో యామిని శ్వేత ఒకరు. ‘జయం’ సినిమా తర్వాత ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. అయితే బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో సినిమాలకు దూరం అయింది. తన కలలను నిజం చేసుకోవడానికి, ఆమె తన డిగ్రీని పూర్తి చేసి, మాస్టర్స్ డిగ్రీ చేయడానికి విదేశాలకు వెళ్లి, ప్రముఖ బహుళజాతి కంపెనీలో పేరు మంచి ఉద్యోగం సంపాదించింది. యామిని శ్వేత ఇటీవలే వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె కుటుంబ వ్యవహారాలను చూసుకుంటుంది.
Also Read : 'కెజియఫ్' మీద కామెంట్స్‌పై వెనక్కి తగ్గని వెంకటేష్ మహా - మంట మీద పెట్రోల్ పోశారా?
వీరే కాదు ఇలా చాలా మంది హీరోయిన్లు తెరపైనే కాకుండా తమ నిజ జీవితాలలో కూడా అనుకున్నది సాధించడానికి సినిమాలకు దూరం అయ్యారు. వారంతా తమకు నచ్చిన రంగంలో మరింత రానించాలని ఆశిద్దాం.