Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
విజయ్, లోకేష్ కనగరాజ్‌ల దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకి ‘లియో’ అనే పేరు నిర్ణయించారు.
విజయ్, లోకేష్ కనగరాజ్‌ల సినిమా ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమోలోనే సినిమా టైటిల్, రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. ఈ సినిమాకు ‘లియో’ అనే టైటిల్ పెట్టారు. దసరా సందర్భంగా ఈ సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతానికి మలయాళంలో డబ్ చేయడం లేదు.
ఈ సినిమా ప్రోమోలో ఒక బేకరీలో విజయ్ చాక్లెట్లు తయారు చేయడం చూడవచ్చు. అలాగే మరోవైపు ఒక గోడౌన్‌లో కత్తి కూడా తయారు చేస్తూ ఉంటాడు. కత్తిని పూర్తిగా తయారు చేశాక మండుతున్న కత్తిని పక్కనే ఉన్న చాక్లెట్ లిక్విడ్‌లో ముంచుతాడు. దాన్ని బయటకు తీసి చాక్లెట్ టేస్ట్ చూసి ‘బ్లడీ స్వీట్’ అంటాడు. ఇంతలో చాలా వెహికిల్స్‌లో కొంతమంది విజయ్ ఉండే ఇంటికి చేరుకుంటారు. ఇక్కడ టైటిల్ వేసి ప్రోమోను క్లోజ్ చేశారు. అయితే ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లోదా కాదా అన్నది క్లారిటీ ఇవ్వలేదు.
2005లో వచ్చిన ‘A History of Violence’ సినిమాకు రీమేక్‌గా ‘లియో’ తెరకెక్కనుందని గతంలో వార్తలు వచ్చాయి. ఈ ప్రోమోను చూస్తే పుకార్లు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ‘A History of Violence’లో కూడా హీరో ఒక రెస్టారెంట్ ఓనర్‌గా పని చేస్తూ ఉంటాడు. సినిమా నుంచి మిగతా కంటెంట్ విడుదల అయ్యే కొద్దీ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. నాన్ థియేట్రికల్ రైట్సే ఏకంగా రూ.300 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే సినిమా మొత్తం బడ్జెట్ వీటి మీదనే రికవరీ అయిందన్న మాట. ఇంక సినిమా థియేట్రికల్ రైట్స్ వచ్చింది మొత్తం లాభమే అన్నమాట. ఈ సినిమా రూ.600 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తుందని అంచనా. అంటే నిర్మాతలకు వసూళ్ల వర్షమే అన్నమాట.
ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా త్రిష నటించనుంది. సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, దర్శకులు మిస్కిన్, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, శాండీ మాస్టర్, మాథ్యూ థామస్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
మ్యూజికల్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.ఎస్.లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిలోమోన్ రాజ్ ఎడిటర్ కాగా, అన్బరివు యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా వ్యవహరించనున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్‌గా మనోజ్ పరమహంసను తీసుకున్నారు.
తమిళంలో విజయ్, త్రిషలది సూపర్ డూపర్ హిట్ జోడీ. సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఒక్కడు' తమిళ రీమేక్ ‘గిల్లి’ సహా 'కురివి', 'తిరుప్పాచ్చి', 'ఆతి' సినిమాల్లో వాళ్ళిద్దరూ నటించారు. 14 ఏళ్ళ విరామం తర్వాత ఇప్పుడు మళ్ళీ విజయ్, త్రిష నటిస్తున్నారు.
ఈ సినిమాలో చియాన్ విక్రమ్ కూడా నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ‘విక్రమ్’ సినిమాలో రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించినట్లు ఇందులో విక్రమ్ కనిపించనున్నాడని తెలుస్తోంది.