వారే లేకపోతే కశ్మీర్ పాక్ వశమయ్యేది - త్వరలో ‘ఆర్ఎస్ఎస్’పై సినిమా, వెబ్ సీరిస్: విజయేంద్ర ప్రసాద్
ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ‘ఆర్ఎస్ఎస్’పై సినిమా, వెబ్ సీరిస్‌లు తీయనున్నట్లు ప్రకటించారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన విషయాన్ని వెల్లడించారు.
విజయేంద్ర ప్రసాద్.. ప్రముఖ కథా రచయిత, దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు, పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి. ఆయన కలం నుంచి జాలు వారిన కథలు ఎన్నో అద్భుతమైన సినిమాలుగా తెరకెక్కాయి. కనీవినీ ఎరుగని రీతిలో విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సినిమా పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలను సంపాదించిన విజయేంద్ర ప్రసాద్‌ను ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ద
ఆర్.ఎస్.ఎస్. గురించి తప్పుడు అభిప్రాయం ఉండేది: ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు రామ్ మాధవ్ రాసిన ‘ది హిందూత్వ పారడైమ్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో జరిగింది. సాహితీ సుధా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కొంతకాలం వరకు తనకు ఆర్ఎస్ఎస్ మీద విపరీతమైన ద్వేషం ఉండేదని చెప్పారు. శాంతి కాముకుడైన మహాత్మా గాంధీని ఓ ఆర్ఎస్ఎస్ వాది చంపాడనే ఆగ్రహంతో ఉండేవాడినని తెలిపారు. అయితే తాను నాగ్ పూర్ కు వెళ్లాక ఆర్ఎస్ఎస్ మీద ఉన్న భావం పూర్తిగా తొలగిపోయిందన్నారు. అప్పటి వరకు తనకు ఆర్ఎస్ఎస్ మీద ఉన్న అభిప్రాయం సరైనది కాదని తెలుసుకున్నానని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
సుమారు నాలుగు సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ మీద కథ రాయాలని అడిగినప్పుడు.. తాను నాగ్ పూర్‌కు వెళ్లానని తెలిపారు. అప్పటి వరకు ఆర్ఎస్ఎస్ గురించి తనకు పెద్దగా తెలియదన్నారు. కానీ అక్కడికి వెళ్లాక ఆశ్చర్యకర విషయాలు తెలిశాయన్నారు. ఒకవేళ ఆర్ఎస్ఎస్ లేకపోతే కశ్మీర్ ఇప్పుడు మనకు దక్కేదే కాదన్నారు. ఎప్పుడో ఆ సుందర ప్రాంతం పాకిస్తాన్ వశమయ్యేదన్నారు. స్వయం సేవక్ సంఘ్ మీద తాను ఓ కథ రాశానని, దాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు చూపించానన్నారు. ఆ కథ చదివి ఆయన ఎంతో సంతోష పడినట్లు వెల్లడించారు. అప్పుడు తాను రాసిన కథతో ఇప్పుడు సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. వెబ్ సిరీస్ కూడా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
నా కథలన్నీ తియ్యటి అవాస్తవాలు: ఆయన రాసే కథల గురించి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాసే స్టోరీలన్నీ తియ్యటి అబద్దాలుగా అభివర్ణించారు. విన్న కథలన్నీ వాస్తవం కావని చెప్పారు. కొన్ని కథలు మాత్రమే నిజం అవుతాయన్నారు. అలా తాను రాసే కథల్లో చాలా వరకు కల్పనలే ఉంటాయని చెప్పారు. కొన్ని కథల్లో మాత్రమే వాస్తవ ఘటనలను జోడిస్తానన్నారు. సినిమాల్లో చాలా వరకు కల్పితాలే ఉంటాయన్నారు. కొంత మేర మాత్రమే వాస్తవాలు ఉంటాయని చెప్పారు. అయినా ప్రతి చిత్రం నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
Also Read: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?