Adipurush: ప్రభాస్‌కు షారుక్ అనుకోని సాయం - ఇక ‘ఆదిపురుష్’కు లైన్ క్లియర్
ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత అందరూ సినిమాల వైపు చూస్తున్నారు. అందులోనూ పెద్ద సినిమాలు థియేటర్ లో విడుదల అయి చాలా రోజులు అవుతోంది. దీంతో జూన్ 16 విడుదల కాబోతున్న ‘ఆదిపురుష్’ పై అంచనాలు పెరిగాయి.

Adipurush: ఇండియాలో సినిమాలు, స్పోర్ట్స్ కు మించిన ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది. అందులోనూ క్రికెట్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. మొన్నటి వరకూ ఐపీఎల్ జరగడంతో దాదాపు నెల రోజులు ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు. అయితే ఇటీవలే ఐపీఎల్ సీజన్ ముగిసిపోవడంతో ఇప్పుడు అంతా సినిమాల వైపు చూస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలు కూడా ఇలాంటి టైమ్ లో తమ సినిమాలను విడుదల చేయాలని చూస్తాయి. ఎందుకంటే అప్పటి వరకూ ఇంట్లో కూర్చొని క్రికెట్ చూసిన వాళ్లు కొత్త వినోదం కోసం థియేటర్లకు క్యూ కడతారు. అందుకే ఈ సమయంలో పెద్ద సినిమాల హవా కూడా బానే ఉంటుంది.
షారుఖ్ ఖాన్ బదులు ప్రభాస్..
ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో భారీ చాలా భారీ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. వాటిలో కొన్ని ఐపీఎల్ తర్వాత విడుదల చేయాలనే యోచనలో ఉన్నారు మేకర్స్. అలాంటి సినిమాల్లో బాలీవుడ్ నటుటు షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ కూడా ఒకటి. వాస్తవానికి ‘జవాన్’ సినిమా జూన్ 2న విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా సక్సెస్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. అందుకే ఈసారి ‘జవాన్’ కు కూడా భారీ ఓపెనింగ్స్ ఉంటాయి అని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడిచింది. కానీ కొన్ని కారణాల వలన ‘జవాన్’ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. సెప్టెంబర్ 7న ‘జవాన్’ ను విడుదల చేయాలని నిర్ణయించారు మేకర్స్. ఇది ఇప్పుడు ‘ఆదిపురుష్’కు కలిసొచ్చేలా ఉంది.
ఈ సినిమా తర్వాత విడుదల కావాల్సిన సినిమా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’. ఈ మూవీను జూన్ 16 న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అనుకున్న తేదీ ప్రకారమే సినిమా విడుదల అవుతుందని తెలుస్తోంది. దీంతో అందరి చూపు ఇప్పుడు ‘ఆదిపురుష్’ పైనే ఉంది. రామాయణ ఇతిహాసాల ఆధారంగా సినిమా రూపొందడం, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమా కావడంతో ఈ సినిమా ఓపెనింగ్స్ భారీ గానే ఉంటాయని చర్చ జరుగుతోంది. అయితే ఐపీఎల్ తర్వాత భారీ సినిమాల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులను ఈ మూవీ ఎంత వరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్వం సిద్దం..
‘ఆదిపురుష్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 6 న తిరుపతిలో గ్రాండ్ జరగనుంది. తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కింది కాబట్టి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సభాప్రాంగణాన్ని సుందరంగా తీర్చదిద్దనున్నారు. దాదాపు నాలుగు వందల మంది సింగర్స్, డాన్సర్స్ ఈ వేదికపై ప్రదర్శన ఇవ్వనున్నారు. ప్రభాస్ అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఆధ్యాత్మిక గురువు చినజీయార్ స్వామీజి కూడా హాజరుకానున్నారు. ఇక ఈ మూవీ లో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్, రావణుడిగా సైష్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి జూన్ 16 న విడుదల సినిమా కానుంది.





















