Mangli: మంగ్లీ కారుపై యువకుల రాళ్ల దాడి - అసలు ఏం అయిందంటే?
ప్రముఖ గాయని మంగ్లీ కారుపై కర్ణాటకలో రాళ్ల దాడి జరిగింది.
ప్రముఖ సింగర్ మంగ్లీ కారుపై శనివారం రాత్రి కొంతమంది యువకులు రాళ్ల దాడి చేశారు. బళ్లారి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంగ్లీ ఆ ప్రోగ్రామ్ పూర్తయ్యాక తిరిగి వెళ్లేటప్పుడు ఈ సంఘటన జరిగింది. అయితే ఆ సమయానికి మంగ్లీ కారులో లేదు.
బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో శనివారం బళ్లారి ఫెస్టివల్ ఎంతో వైభవంగా మొదలైంది. ఈ ఉత్సవంలో సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదటి రోజు ఉత్సవంలో సింగర్ మంగ్లీ, మరికొంతమంది గాయకులు కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని మంగ్లీ స్టేజీ మీద పాటలు పాడింది. తిరిగి వెళ్లేటప్పుడు మంగ్లీని చూసేందుకు స్థానిక యువకులు ఎగబడ్డారు. మంగ్లీ వేదిక వెనుక ఉన్న మేకప్ టెంట్ లోపలికి వెళ్లినప్పుడు అందులోకి కూడా ప్రవేశించారు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జి చేశారు. ఆ తర్వాత మంగ్లీ తిరిగి వెళ్లిపోయేటప్పుడు కొంత మంది స్థానిక యువకులు ఆమె కారుపై రాళ్లతో దాడి చేశారు.
కొన్ని రోజుల క్రితం చిక్ బళ్లాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా సింగర్ మంగ్లీ పాల్గొంది. ఆ కార్యక్రమంలో మంగ్లీని యాంకర్ అనుశ్రీ వేదిక మీదకు పిలిచింది. వేదిక పైకి చేరుకున్న మంగ్లీ అందరికీ నమస్కారం అంటూ తెలుగులో మాట్లాడటం ప్రారంభించింది. ‘ఈ కార్యక్రమంలో కన్నడవారు ఉన్నారు. కొంచెం కన్నడలో మాట్లాడండి’ అని యాంకర్ అనుశ్రీ చెప్పినప్పుడు, ‘పక్కన అనంతపురం కూడా ఉంది. అందరికీ తెలుగు అర్థం అవుతుంది.’ అని మంగ్లీ సమాధానమిచ్చింది. అనుశ్రీ బలవంతం చేయగా కన్నడలో ఒకటి రెండు మాటలు మాత్రమే మాట్లాడింది.
యాంకర్ అనుశ్రీ కన్నడలో ప్రశ్న అడిగేటప్పుడు కూడా తనకు అర్థం కావడం లేదని మంగ్లీ చెప్పింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తీవ్ర వ్యతిరేకతను కూడా వ్యక్తం చేశారు. రాబర్ట్ సినిమా ద్వారా కన్నడ ప్రేక్షకులకు కూడా పరిచయమైంది మంగ్లీ. జోగి ప్రేమ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏక్ లవ్ యా’ చిత్రం తర్వాత కన్నడలో వరుసగా పాటలు పాడే అవకాశాలు కూడా వస్తున్నాయి . పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మామ’ పాట కన్నడ వెర్షన్‌ను మంగ్లీనే పాడింది.
మంగ్లీ ఎస్వీబీసీ చానల్ సలహాదారుగా కూడా నియమితం అయింది. మంగ్లీ అసలు పేరు సత్యవతి. ఉత్తర్వులు కూడా ఈ పేరుతోనే వచ్చాయి. తెలంగాణ యాసలో ఆమె పాడిన పాటలు పాపులర్ అయ్యాయి. బతుకమ్మ పాటలతో పాటు పలు సినిమాల్లో ఆమె పాటలు ప్రజాదరణ పొందాయి. గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్‌సీపీ ప్రచార పాటలు పాడారు. జగనన్న పేరుతో ఆమె పాడిన పాటలు పాపులర్ అయ్యాయి. అలాగే జగన్ ప్రచార సభల్లోనూ .. ఆయన రాక ముందు నిర్వహించే సాంస్కృతి క కార్యక్రమాల్లో ఖచ్చితంగా మంగ్లి ప్రదర్శ ఇచ్చే వారు. ఎస్వీబీసీకి సలహాదారుగా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి.