Premi Viswanth Profile : వంటలక్క గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?
ఇప్పటివరకు బుల్లితెరపై ఏ టీవీ సీరియల్ కు రానంత క్రేజ్ సంపాదించుకుంది 'కార్తీకదీపం'.
ఇప్పటివరకు బుల్లితెరపై ఏ టీవీ సీరియల్ కు రానంత క్రేజ్ సంపాదించుకుంది 'కార్తీకదీపం'. ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన ఈ టీవీ సీరియల్ కొద్దిరోజుల్లోనే బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసింది. రామాయణం కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ టీవీ షో తెలుగు వారికి హాట్ ఫేవరెట్ గా మారింది. ఈ సీరియల్ ను సాగదీస్తున్నారనే ఫీలింగ్ కలిగినా.. జనాలు మాత్రం చూడకుండా ఉండలేకపోతున్నారు. అంటే అంతగా ప్రేక్షకులపై ప్రభావం చూపింది.
మొన్నటివరకు కూడా డాక్టర్ బాబు, దీపా కలుస్తారా..? లేదా అంటూ సోషల్ మీడియాలో కూడా చర్చించుకునేవారు. ఇక ఈ సీరియల్ పై వచ్చే మీమ్స్ కి లెక్కే లేదు. ఈ సీరియల్ లో నటించిన వారందరికీ కూడా మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా వంటలక్క పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రలో ప్రేమి విశ్వనాథ్ జీవించేస్తుంది. తెలుగు సీరియల్ నటి కాకపోయినా.. స్ట్రెయిట్ సీరియల్ నటీమణుల కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటుంది ఈ బ్యూటీ.
1991 డిసెంబర్ 2న కేరళలో జన్మించిన ప్రేమి విశ్వనాథ్ 'లా' కోర్సు పూర్తి చేసింది. ఆ తరువాత ఓ ప్రైవేట్ సంస్థలో లీగల్ అడ్వైజర్ గా పని చేసింది. ఇక సీరియల్స్ లో నటించడం కంటే ముందు మోడల్ గా రాణించింది. అంతేకాకుండా.. 'సాల్మన్ 3 డీ' సినిమాలో కూడా నటించింది. ప్రేమి అన్నయ్య శివప్రసాద్ కేరళలో ఫేమస్ ఫోటోగ్రాఫర్. ఆయనకు ఎర్నాకుళంలో రెండు స్టూడియోలు కూడా ఉన్నాయి. తన సోదరుడిలానే ఫోటోగ్రఫీ మీద మక్కువతో కొన్ని పెళ్లిళ్లు, శుభకార్యాలకు పని చేసిందట ప్రేమి విశ్వనాథ్. ఎప్పుడైతే 'కార్తీకదీపం' సీరియల్ లో నటించడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి తెలుగు ఆడియన్స్ ఆమెని నెత్తిన పెట్టుకున్నారు.
ఈమె తెలుగులో మరికొన్ని సీరియల్స్ చేస్తే చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు. ప్రేమి విశ్వనాధ్ ఓకే చెబితే భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీ అవుతున్నారు. కేరళకు చెందిన మన వంటలక్క వ్యక్తిగత జీవితం గురించి మాత్రం చాలా మందికి తెలియదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వృత్తి, వ్యక్తిగత జీవితాల గురించి కొన్ని విషయాలు అభిమానులతో పంచుకుంది.
కొన్నేళ్లక్రితం ప్రముఖ ఆస్ట్రాలజర్ వినీత్ భట్ ను వివాహం చేసుకుంది ప్రేమి విశ్వనాథ్. వినీత్ కు కేరళలో మంచి పేరుంది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా తమ జాతకాలు పట్టుకొని ఆయన చుట్టూనే తిరుగుతుంటారట. వృత్తి రీత్యా తన భర్త ఇంట్లో ఉండరని.. టూర్లకు వెళ్తుంటారని ప్రేమి చెప్పుకొచ్చింది. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు ప్రస్తుతం తన తల్లి దగ్గర ఉంటున్నాడని.. వాడికి సంబంధించిన అన్ని పనులు తన తల్లే దగ్గరుండి చూసుకుంటుందని ప్రేమి చెప్పింది.
టెక్నాలజీ పెరిగిన తరువాత ఫ్యామిలీని మిస్ అవుతున్నాననే ఫీలింగ్ రావడం లేదని.. తరచూ వీడియో కాల్స్ మాట్లాడుకుంటామని ఓ సందర్భంలో తెలిపింది. సీరియల్ షూటింగ్స్ కారణంగా.. ఓ వారం హైదరాబాద్ లో ఉంటే మరో వారం కేరళలో గడుపుతుంటుంది ప్రేమి విశ్వనాధ్. లాక్ డౌన్ నిబంధనలు అమలైన సమయంలో కూడా ప్రేమి విశ్వనాధ్ 'కార్తీకదీపం' సీరియల్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ సమయంలో తన తండ్రి ఎంతో భయపడుతూ ఉండేవారని ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయింది. కరోనా కారణంగా పరిస్థితులు బాగాలేనప్పటికీ షూటింగ్ చేశామని చెప్పుకొచ్చింది.