Salman Khan Threat: సల్మాన్‌కు భద్రత కట్టుదిట్టం - జైల్లో నుంచే ప్లాన్ చేస్తున్న గ్యాంగ్‌స్టర్?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఈమెయిల్ ద్వారా బెదిరింపుకు దిగాడు. చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ మరోసారి బెదిరింపులు వచ్చాయి. ముంబై గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈమెల్ ద్వారా ఆయనకు హెచ్చరికలు పంపింది. ఈ విషయంపై నటుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆయనకు భద్రత పెంచారు. ఆయన నివాసం దగ్గర కూడా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ సహా పలువురిపై కేసులు
సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని హెచ్చరిస్తో శనివారం నాడు ఆయన ఆఫీస్ కు ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే సల్మాన్ సిబ్బంది పోలీసులకు కంప్లైంట్ చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, రోహిత్ గార్గ్ మీద బాంద్రా పోలీసులు కేసులు పెట్టారు. ఐపీసీ 506(2), 120 (బీ) 34 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అంతేకాకుండా, ఆయనకు ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన పోలీసులు తన నివాసం దగ్గర వై ప్లస్ కేటగిరీ భద్రత ఏర్పాటు చేశారు.
ఇప్పటికే పలుమార్లు బెదిరింపులు
వాస్తవానికి, సల్మాన్‌కు గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. 2018లో కృష్ణ జింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో బిష్ణోయ్ హెచ్చరించాడు. వన్యప్రాణుల్ని వేటాడటం ద్వారా నా మనోభావాలను దెబ్బతీశారంటూ అప్పట్లో కామెంట్ చేశాడు. కచ్చితంగా ఆయనను చంపేస్తానంటూ బిష్ణోయ్ హెచ్చరించాడు. అయితే, ఈ కేసులో సల్మాన్ నిర్దోషిగా బయటపడ్డాడు.
గత సంవత్సరం పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యాడు. ఆ సమయంలోనూ సల్మాన్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. ఆయనను లేకుండా చేస్తామంటూ ఇదే గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ భద్రతను పెంచింది. అప్పటికే ఉన్న ఎక్స్ గ్రేడ్ భద్రతను వై ప్లస్ గా మార్చింది. దీంతో ఇద్దరు వెపన్స్ ధరించిన సిబ్బంది సల్మాన్ కు భద్రతగా ఉంటున్నారు. ఆయన ఇంటి దగ్గర కూడా భద్రతా సిబ్బంది నిత్యం పహారా కాస్తున్నారు. ఆ తర్వాత కూడా మరికొందరు దుండగులు సల్మాన్ ఖాన్‌తో పాటు ఆయన తండ్రి సలీం ఖాన్‌ను చంపేస్తామని బెదిరింపు లేఖలు పంపారు. తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఢిల్లీ జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్
అటు ఈ బెదిరింపులకు పాల్పడుతున్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్నాడు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు రావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తాజాగా సల్మాన్ ఖాన్ ను హత్య చేస్తామని బెదిరించడంతో ఆయనతో పాటు మరికొంత మంది గ్యాగ్ స్టర్ల మీద పోలీసులు కేసులు ఫైల్ చేశారు.
View this post on Instagram
Read Also: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్