అది సినిమా వరకు మాత్రమే - ఎన్టీఆర్‌తో పోటీ, దోస్తీపై రామ్ చరణ్ కామెంట్స్
మెగా, నందమూరి కుటుంబపై కూడా సినిమాల పరంగా పోటీ ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఎన్టీఆర్, చరణ్ లు కలసి పనిచేయడంపై ఇది సాధ్యమేనా అనే సందేహాలు ఉండేవి. అయితే తాజాగా రామ్ చరణ్ దీనిపై స్పందించారు.
ఆస్కార్ అవార్డుతో ‘ఆర్ఆర్ఆర్’ పేరు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. ‘బాహుబలి’ సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి విజన్ కూడా మారిపోయింది. అందుకే మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను భారీ అంచనాల మధ్య తెరకెక్కించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఊహించిన దానికంటే ఎక్కువగానే భారీ సక్సెస్ ను అందుకుంది. మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడంతో మూవీ టీమ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ సినిమా గురించి అనౌన్స్ చేసినప్పటి నుంచీ రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోపై పుకార్లు వచ్చాయి. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో కుటుంబ పోటీలు కొనసాగుతూ ఉన్నాయి. మెగా, నందమూరి కుటుంబంపై కూడా సినిమాల పరంగా పోటీ ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఎన్టీఆర్, చరణ్ లు కలసి పనిచేయడంపై ఇది సాధ్యమేనా అనే సందేహాలు ఉండేవి. అయితే తాజాగా రామ్ చరణ్ దీనిపై స్పందించారు.
‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఆస్కార్ వేదికపై కీరవాణి, చంద్రబోస్ లు ఆస్కార్ అందుకున్నప్పటికీ.. ముందు నుంచీ సినిమాను అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడంలో ఈ ముగ్గురూ వార్తల్లో ఎక్కువగా నిలుస్తూ వస్తున్నారు. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ లో రామ్ చరణ్.. జూనియర్ ఎన్టీఆర్ తో పోటీ పడుతున్నారనే వార్తలపై మరోసారి చరణ్ స్పందించారు. ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం, మెగా కుటుంబాలు ప్రత్యర్థి కుటుంబాలు అని అనుకుంటారని, కానీ అవన్నీ పుకార్లు మాత్రమేనన్నారు. తమ కుటుంబాల మధ్య ఎప్పుడూ వ్యక్తిగత పోటీ లేదని అన్నారు. వృత్తిపరంగా ఎంత పోటీ ఉన్నా తాము ఎప్పుడూ కలిసే ఉంటామని అన్నారు.
వాస్తవానికి తాను ఎన్టీఆర్ తో కలసి స్క్రీన్ షేర్ చేసుకుంటానని అనుకోలేదని అన్నారు. తనకు ఆ ఆలోచనే ఎప్పుడూ రాలేదన్నారు. అయితే భవిష్యత్ లో ఎప్పుడైనా కలిసే చేసేవారమని, అయితే తమను ఒకే చోటుకు తీసుకురావడానికి ముఖ్య కారణం దర్శకుడు రాజమౌళినే అని అన్నారు. రాజమౌళి మాత్రమే అలా చేయగలరని, తమకు ఆ నమ్మకం ఉందని అన్నారు. తారక్ తో తనకు ఎన్నో ఏళ్ల స్నేహం ఉందని అన్నారు. సినిమాల కంటే ముందే తాము స్నేహితులమని చెప్పుకొచ్చారు.
వాస్తవానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా స్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సినిమాల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటూనే వస్తోంది. ఈ ఏడాది కూడా ఈ ఇద్దరి హీరోల సినిమాలకు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతూ వస్తోంది. అలాగే తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య కూడా ఇలాంటి పోటీ వాతావరణమే ఉండేది. అయితే ఇది కేవలం సినిమాల వరకూ మాత్రమేనని ఇప్పటికే చరణ్, ఎన్టీఆర్ పలు సందర్బాల్లో చెప్పారు. ఇదే విషయాన్ని తాజాగా రామ్ చరణ్ కూడా చెప్పుకొచ్చారు.
Read Also: మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై కీరవాణి కీలక వ్యాఖ్యలు - ఫ్యాన్స్‌కు పండుగే!