Raviteja: రవితేజ మాటలకు అర్థాలు వేరులే! అసలు మేటర్ అదేనా!?
'ఖిలాడి' సినిమాలో దర్శకుడు రమేష్ వర్మ క్రెడిట్ ఏమీ లేదా? స్టేజి మీద రవితేజ అలా అనేశాడేంటి? ఇన్నాళ్లు ఇండస్ట్రీకి తెలిసిన గొడవ పబ్లిక్ స్పెస్‌లోకి వచ్చిందా?
మాస్ మహారాజ రవితేజకు, 'ఖిలాడి' దర్శకుడు రమేష్ వర్మకు మధ్య సరిగా పొసగడం లేదా? ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయా? ఇన్నాళ్లు ఇండస్ట్రీకి తెలిసిన గొడవ కాస్తా ఇప్పుడు పబ్లిక్‌కి తెలిసిందా? బుధవారం రాత్రి జరిగిన 'ఖిలాడి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ స్పీచ్ చూస్తే... అటువంటి అనుమానాలు కలుగుతాయి. 'ఖిలాడి' సినిమా చేయడానికి దర్శకుడు కారణం కాదని ఆయన చెప్పారు. క్రెడిట్ మొత్తం రచయితకు కట్టబెట్టారు. రవితేజ మాటలకు అర్థాలు వేరులే అనేది ఇండస్ట్రీ టాక్.
'ఖిలాడి' కథా రచయిత శ్రీకాంత్ విస్సాను వేదిక మీదకు రవితేజ పిలిచారు. ''ఇతడు నాకు కథ చెప్పాడు. ఇతను చెప్పాడు కాబట్టే చేశాను. ఈ సినిమా ఒప్పుకొన్నాను. 'ఖిలాడి' నేను చేయడానికి మొదటి కారణం ఇతడే'' - ఈ మాటలను ఒకటికి రెండుసార్లు రవితేజ చెప్పారు. దీని అర్థం ఏమిటి? దర్శకుడి కోసం కాకుండా రచయిత కోసం సినిమాను చేశారా? పైగా, 'ఖిలాడి' సినిమా చేయడానికి ముఖ్య కారణం శ్రీకాంత్ విస్సా అయితే... మరో కారణం నిర్మాత కోనేరు సత్యనారాయణ గారని రవితేజ చెప్పారు. సినిమాలో సన్నివేశాలు, డైలాగులు ఎంజాయ్ చేస్తారంటే అవన్నీ శ్రీకాంత్ విస్సా రాసినవని, అతనితో సినిమాలు చేస్తున్నానని, గొప్ప టాలెంట్ ఉన్న అతడిని పరిచయం చేసినందుకు రమేష్ వర్మకు థాంక్స్ చెప్పాలని అన్నారు. ఆ ఒక్క విషయంలో థాంక్స్ చెప్పుకోవాలన్నారు.
బేసిగ్గా తాను అదృష్టాన్ని నమ్మనని, కష్టాన్ని నమ్ముతానని రవితేజ అన్నారు. కానీ, రమేష్ వర్మను చూస్తే అదృష్టాన్ని నమ్మే శాతం కొంచెం పెంచాలని ఉందని చిన్న సెటైర్ వేశారు. అతడు మహార్జాతకుడు అన్నారు. రమేష్ వర్మ అదృష్టం, జాతకం పేరు కోనేరు సత్యనారాయణ అని... సినిమా విడుదలకు ముందు ఆయన దగ్గర నుంచి రమేష్ వర్మ కారు కొట్టేశారని రవితేజ అనడం గమనార్హం. రమేష్ వర్మ దగ్గరుండి ప్రొడక్షన్ చూసుకున్నారని కోనేరు సత్యనారాయణ అన్నారు. అయితే... ఆ తర్వాత స్పీచ్ ఇచ్చిన రవితేజ ఆయన్ను సెట్స్ దగ్గరకు రావాలని కోరారు. వస్తే చాలా విషయాలు తెలుస్తాయనన్నారు. ఏం తెలుస్తాయో మరి?
రమేష్ వర్మతో గతంలో రవితేజ 'వీర' చేశారు. అది ప్లాప్. అయినా మరోసారి కలిసి 'ఖిలాడి' చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 18న విడుదల చేద్దామంటే... ఫిబ్రవరి 11న విడుదల చేయాలని రమేష్ వర్మ పట్టుబట్టారని, షూటింగులో ఏవో మనస్పర్థలు వచ్చాయని గుసగుసలు ఉన్నారు. అవన్నీ నిజమో? కాదో? కానీ 'ఖిలాడి' ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం హీరో, దర్శకుడు మధ్య సత్సంబంధాలు లేవనే విషయాన్ని బయటపెట్టింది.