Dil Raju : 'వారసుడు' వాయిదా వేసినా పవర్ చూపించిన 'దిల్' రాజు
చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా తమిళ హీరో విజయ్‌తో తీసిన 'వారసుడు'కు థియేటర్లు బ్లాక్ చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు 'వారసుడు' వాయిదా వేశారు. 'దిల్' రాజు నెగ్గడా? తగ్గాడా?
సంక్రాంతి బరిలో లెక్కలు మారిపోయాయ్. రెండు రోజుల క్రితం వరకు ఏ సినిమా ఎన్ని థియేటర్లలో విడుదల అవుతుంది? ఏ సినిమాకు ఎంత ఓపెనింగ్ రావచ్చు? అని డిస్ట్రిబ్యూషన్, ట్రేడ్ వర్గాల్లో ఓ లెక్క ఉంది. 'దిల్' రాజు సోమవారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ తన 'వారసుడు'ను జనవరి 14కు వాయిదా వేసినట్లు తెలిపారు. దాంతో ఒక్కసారి లెక్కలన్నీ మారిపోయాయ్.
మెగాస్టార్ చిరంజీవి, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కోసం విజయ్ హీరోగా తాను నిర్మించిన 'వారసుడు'ను వాయిదా వేసినట్లు 'దిల్' రాజు చెప్పారు. తమిళ వెర్షన్ 'వారిసు' 11న విడుదల అవుతుంటే... తెలుగు వెర్షన్ మాత్రం 14న విడుదల చేస్తున్నారు. ఇప్పుడీ నిర్ణయం తీసుకోవడం వల్ల 'దిల్' రాజు నెగ్గడా? తగ్గాడా? ఓ నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారి తీసింది.
తెలుగులో చిరు, బాలయ్యకు క్రేజ్
సంక్రాంతి సీజన్ కాకుండా వేరే సీజన్ అయితే 'వారసుడు'కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రస్తుతం ఉన్న బజ్ కంటే ఎక్కువ బజ్ క్రియేట్ అయ్యేది. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' పోటీలో ఉన్నప్పుడు కాకున్నా వేరే తేదీకి అయితే సినిమాపై మరింత క్యూరియాసిటీ క్రియేట్ అయ్యేది. తెలుగులో టాప్ ప్రొడ్యూసర్, టాప్ హీరోలతో సినిమాలు తీసిన దర్శకుడు కలిసి 'వారసుడు' చేసినా... సినిమాకు ఫేస్ అయినటువంటి హీరోది తమిళనాడు కావడంతో తెలుగు ప్రేక్షకులు ఫస్ట్ ప్రిఫరెన్స్ చిరు, బాలకృష్ణ సినిమాలకు ఇస్తున్నారనేది నిజం. ఇది 'దిల్' రాజుకు కూడా తెలియనిది కాదు.
పాన్ ఇండియా రిలీజ్ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చినా... దేశవ్యాప్తంగా విడుదల అయ్యే సినిమాలకు మాతృభాషలో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఆ తర్వాత హిందీ వసూళ్ళు కీలకంగా నిలుస్తున్నాయి. 'కాంతార'కు కన్నడ తర్వాత హిందీలో ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. 'పొన్నియిన్ సెల్వన్'కు తమిళనాట లభించిన ఆదరణ ఇతర భాషల్లో రాలేదు. 'వారసుడు' విషయానికి వస్తే... తెలుగు సినిమాలు మిక్సీలో వేసి తీసినట్టు ఉందని తెలుగులో ట్రోల్స్ వస్తున్నాయి. తమిళ ప్రేక్షకులకు బహుశా కథ కొత్తగా అనిపిస్తుందేమో!?
తెలుగు కంటే తమిళంలో 'వారిసు'కు ఎక్కువ క్రేజ్ ఉంది. అక్కడ ఆల్రెడీ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను 'దిల్' రాజు అమ్మేశారు. మరోవైపు 'వారసుడు' సినిమాకు ముందు నుంచి థియేటర్లు బ్లాక్ చేయడం వల్ల ఆయనపై నాలుగు దిక్కుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
'వారసుడు'తో 30 కోట్లు లాభమా?
ఆల్రెడీ 'వారసుడు'తో 'దిల్' రాజు ప్రాఫిట్ జోన్‌లో ఉన్నారని టాక్. సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ కాకుండా మిగతా రైట్స్ అన్నీ కలిపి సుమారు రూ. 280 కోట్లకు ఇచ్చేశారని ఫిల్మ్ నగర్ వర్గాల విశ్వసనీయ సమాచారం. సినిమా నిర్మాణానికి 250 కోట్ల రూపాయలు అయ్యిందట. ఆ లెక్కన 30 కోట్లు లాభమే. తెలుగులో ఓన్ రిలీజ్ చేస్తున్నారు. అయితే... డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 15 కోట్లు లెక్క కట్టారట. ఇక్కడి కలెక్షన్స్ ఎక్స్ట్రా ప్రాఫిట్. డబ్బులతో ఇండస్ట్రీలో రిలేషన్స్ కూడా 'దిల్' రాజుకు ముఖ్యమే. వాటి కోసమే ఆయన తన 'వారసుడు'ను వాయిదా వేశారు.
వాయిదాతో విమర్శలకు చెక్ పెట్టిన 'దిల్' రాజు!?
విమర్శలు చేసేవారు ఎలాగో చేస్తారు. కోడిగుడ్డుపై ఈకలు పీకే బ్యాచ్, సోషల్ మీడియాలో సెటైర్లు వేసే గ్యాంగ్ ఎప్పుడూ ఉంటారు. వాళ్ళను పక్కన పెడితే... 'వారసుడు' వాయిదా వేయడం వల్ల విమర్శలకు 'దిల్' రాజు చెక్ పెట్టారని చెప్పవచ్చు. 'దిల్' రాజు తగ్గాడని విమర్శలు చేస్తున్న ప్రేక్షకులకు ఆల్రెడీ ప్రెస్‌మీట్‌లో ఆయన ఆన్సర్ ఇచ్చారు. 'ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు' అంటూ 'అత్తారింటికి దారేది'లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి త్రివిక్రమ్ రాసిన డైలాగ్ చెప్పారు.
Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?
'దిల్' రాజు తగ్గినట్టు కొందరికి కనిపించవచ్చు. కానీ, భవిష్యత్తులో తన గెలుపు అవకాశాల కోసమే, నెగ్గడం కోసమే ఆయన 'వారసుడు' వాయిదా వేశారు. నిజం చెప్పాలంటే... సినిమా విడుదలకు రెండు మూడు రోజుల ముందు వరకూ డిస్ట్రిబ్యూషన్, ట్రేడ్ వర్గాలను సస్పెన్సులో, టెన్షనులో పెట్టేసి, ఒక్కసారిగా ట్రంప్ కార్డు (వాయిదా నిర్ణయాన్ని) బయటకు తీశారు. సినిమా వాయిదా పడినప్పటికీ ఒక్క విషయంలో మాత్రం ఇండస్ట్రీలో జనాలకు, ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది.
'దిల్' రాజు పవర్ ఏంటనేది సంక్రాంతి 2023 సీజన్ చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో 1800 స్క్రీన్లు ఉండొచ్చు. అయితే, చాలా ఏరియాల్లో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ స్క్రీన్లు 'దిల్' రాజు చేతిలో ఉన్నాయని క్లారిటీ వచ్చింది. ఆయన తలుచుకుంటే సినిమాకు ఎంత పెద్ద రిలీజ్ లభిస్తుందనేది క్లారిటీ వచ్చింది. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో 'దిల్' రాజు గుండె లాంటివాడని తెలిసొచ్చింది.
Also Read : ఆస్కార్స్‌లో 'కాంతారా' - రికార్డుకు రెండు అడుగుల దూరంలో రిషబ్ శెట్టి
'వారసుడు'ను 11 నుంచి 14కు వాయిదా వేసినా... మిగతా సినిమాలకు జస్ట్ ఒకటి రెండు రోజుల అడ్వాంటేజ్ మాత్రమే ఉంటుంది. తర్వాత విజయ్ సినిమాకు 'దిల్' రాజు ఎలాగో థియేటర్లు కేటాయిస్తారు. టాక్ బావుంటే కంటిన్యూ చేస్తారు. లేదంటే తన సినిమాను తీసేసి థియేటర్లు రన్ చేయడం కోసం, లాభాల కోసం వేరే సినిమాలకు ఇస్తారు. ఈలోపు రెండు రోజులు సినిమాలు వేసుకుంటారా? లేదంటే పంతానికి పోయి మానేస్తారా? మైత్రీ మూవీ మేకర్స్ కోర్టులో బాల్ పడేస్తారు.
ఇప్పుడు 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలను 'దిల్' రాజు థియేటర్లలో రెండు రోజులు వేసుకోకపోతే... తాను థియేటర్లు ఇచ్చినా వేసుకోలేదని కామెంట్ చేయడానికి 'దిల్' రాజు దగ్గర ఆధారం ఉంటుంది. ఒకవేళ రెండు రోజుల తర్వాత తీసేశారని ఎవరైనా విమర్శలు చేస్తే... తెలుగు హీరోల కోసం తన సినిమాను వాయిదా వేశానని చెప్పే ఆస్కారం ఉంది. ఎటు చూసినా 'దిల్' రాజుకు లాభమే. పండుగ సీజన్ కాబట్టి జనాలు థియేటర్లకు వద్దన్నా వస్తారు. ముందు బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు చూసిన ప్రేక్షకులు... ఆ తర్వాత అదే థియేటర్లలో విజయ్ 'వారసుడు' పడినా సెలవులు ఉంటాయి కాబట్టి వెళ్ళే అవకాశాలు ఎక్కువ.ఆ విధంగా చూస్తే... ఆయన థియేటర్లలో రెవెన్యూ షేరింగ్ ఎక్కువ ఉంటుంది. వేరేలా ఆలోచిస్తే ఈ కమర్షియల్ యాంగిల్ కూడా ఉండొచ్చు.
Also Read : లోకేష్‌ను కలిసిన నందమూరి తారకరత్న - ఎమ్మెల్యే టికెట్ విషయమై చర్చలు?