Suresh Babu: రోజు రోజుకు థియేటర్ బిజినెస్ పడిపోతుంది, దిల్ రాజు కావాలనే అలా చేస్తున్నారు: సురేష్ బాబు
Suresh Babu: గతంతో పోల్చితే ఇప్పుడు థియేటర్ల బిజినెస్ బాగా పడిపోయిందని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తెలిపారు. మున్ముందు ఇంకా తగ్గిపోతుందని వెల్లడించారు.
Suresh Babu Reacted On Dil Raju Theatres Issue: తెలుగు సినిమా పరిశ్రమలో వస్తున్న నూతన పోకడలు, రావాల్సిన మార్పులు, థియేటర్ల బిజినెస్ గురించి ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా పరిశ్రమలో కచ్చితంగా మార్పులు జరగాలన్నారు. అలా జరిగినప్పుడే తెలుగు సినిమా పరిశ్రమ సర్వైవల్ అవుతుందన్నారు. సినిమా తీసే విధానంలో మార్పులు రావాలన్నారు. మన దగ్గర పెద్ద బడ్జెట్ సినిమాలు 100 నుంచి 120 రోజులు షూటింగ్ జరుపుకుంటే, ఇవే చిత్రాలను ఫారిన్ వాళ్లు కేవలం 20 నుంచి 30 రోజుల్లోనే తీస్తారని చెప్పారు. అంతేకాదు, సినిమా అవుట్ ఫుట్ కూడా అద్భుతంగా వస్తుందన్నారు. దానికి కారణం సినిమాలు తీసే ప్రాసెస్ ను వాళ్లు కచ్చితంగా పాటించడమేనన్నారు.
థియేటర్ల బిజినెస్ బాగా తగ్గింది- సురేష్ బాబు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బిజినెస్ బాగా తగ్గిందని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు. “ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2000 సంవత్సరంలో 3000 థియేటర్లు ఉన్నాయి. ఇవాళ 1800 థియేటర్లు ఉన్నాయి. చాలా ఊర్లలో థియేటర్లు మూసేశారు. నేను ఏటా 15 సినిమాలు తీస్తున్నాను. నాకు థియేటర్లు అవసరం. నేను పెట్టుకుంటాను. దిల్ రాజు సినిమాలు తీస్తున్నారు. ఆయనకు థియేటర్లు కావాలి. అందుకే ఆయన కూడా పెట్టుకుంటున్నారు. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు పెరుగుతున్నారా? తగ్గుతున్నారా? సిటీల్లో ప్రేక్షకులు సంఖ్య పెరుగుతుంది. కారణం మల్టీఫ్లెక్సులు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిపోతున్నారు. ఇంకా తగ్గిపోతారు కూడా” అని చెప్పారు.
డబ్బు వస్తుంది కాబట్టి ఖర్చు పెరుగుతోంది- సురేష్ బాబు
గతంతో పోల్చితే ఇప్పుడు ప్రొడక్షన్ ఖర్చు భారీగా పెరిగిందని సురేష్ బాబు తెలిపారు. అదే సమయంలో ఆదాయం కూడా వస్తోందన్నారు. “సినిమా బడ్జెట్ రోజు రోజుకు పెరుగుతుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఎక్కువ మొత్తంలో సాలరీస్ ఇవ్వాల్సి వస్తోంది. ఇంతకు ముందు చెట్టుకింద కూర్చొని షూటింగ్ చేసే వాళ్లం. కానీ, ఈ రోజుల్లో 10 క్యారీవ్యాన్లు అవసరం అవుతున్నాయి. ఈ రోజుల్లో కంఫర్ట్ ను కోరుకుంటున్నారు. అప్పట్లో అది కరెక్ట్. ఇప్పుడు ఇది కరెక్ట్. సినిమాల ద్వారా డబ్బు వస్తుంది కాబట్టి ఖర్చుకు వెనుకాడ్డం లేదు. ఈ ఖర్చు పట్ల బాధ లేదు. కానీ, వర్క్ ఎఫీషియెన్సీ పట్ల వర్రీ అవుతున్నాను. పద్దతి ప్రకారం సినిమా జరుగుతుందా? లేదా? అనేది ముఖ్యం” అన్నారు.
మంచి ప్రొడ్యూసర్స్ రాబోతున్నారు- సురేష్ బాబు
రానున్నరోజుల్లో సినిమా పరిశ్రమలో మంచి ప్రొడ్యూసర్స్ రాబోతున్నట్లు సురేష్ బాబు తెలిపారు. “చాలా మంది ఆయా రంగాల్లో డబ్బు సంపాదించుకుని, ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకోవాలని సినిమాలు తీస్తున్నారు. నేను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, కొత్తవారికి సభ్యత్వం ఇచ్చేముందు రెండు గంటలు క్లాస్ తీసుకుంటాను. నాతో పాటు నిపుణులు ఉంటారు అని చెప్పాను. మెంబర్ షిప్ ఇస్తే చాలు. వీడి దగ్గర ఏంటి మనం వినేది అన్నారు. నా సొమ్ము నా ఇష్టం. నేను సినిమాలు చేసుకుంటాను. మీరెవరు మాకు చెప్పడానికి? మీ నాన్నకు ఎవరైనా నేర్పించారా? మీకు ఎవరైనా నేర్పించారా? అనేవాళ్లు. కానీ, ముంబైలో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ గురించి బాగా స్టడీ చేస్తున్నారు. ముంబైలో ప్రొడ్యూసర్స్ గా రాణిస్తున్న వాళ్లంతా ఇంటర్నేషనల్ యాక్టింగ్ స్కూల్ స్టూడెంట్స్. అందుకే వాళ్లు మంచి చిత్రాలు తీస్తున్నారు. మనదగ్గర కూడా స్టార్ట్ అయ్యింది. మున్ముందు మంచి ప్రొడ్యూసర్స్ రాబోతున్నారు” అని చెప్పారు.
Read Also: హీరోయిన్ అసిన్ ఇప్పుడు ఏం చేస్తోంది? ఆమె భర్త ఆదాయం ఎంతో తెలిస్తే కళ్లు తేలేయడం ఖాయం