Maa Election: చనిపోతే డబ్బులివ్వడం.. రేషన్ ఇవ్వడం కాదు.. ప్రకాష్ రాజ్ కామెంట్స్..
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పై సినీ నటుడు, మా ఎన్నిక అధ్యక్ష అభ్యర్థి ప్రకాష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పై సినీ నటుడు, మా ఎన్నిక అధ్యక్ష అభ్యర్థి ప్రకాష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నారు. మంగళవారం నాడు తన ప్యానెల్ తో కలిసి సమావేశం నిర్వహించిన ఆయన.. రెండేళ్ల క్రితం 'మా' ఎన్నికలు జరిగిన సమయంలో కూడా పోటీ చేద్దామనుకున్నానని.. కొందరు రమ్మన్నారని.. ఇంకొందరు వద్దన్నారని చెప్పారు. తప్పు చేసిన వాడిని చరిత్ర మర్చిపోవచ్చేమో కానీ.. మౌనంగా ఉన్న వాడిని క్షమించదు.. అందుకే నేను మౌనంగా ఉండకూడదనుకున్నా అని చెప్పారు.
మనకు తెలియకుండా.. 'మా'ను ఓ ఛారిటీ అసోసియేషన్ గా మార్చేశారని.. చనిపోయినప్పుడు డబ్బులివ్వడం, రేషన్ ఇప్పించడం, వేషాలు దక్కేలా చేయడం.. 'మా' అసోసియేషన్ అంటే ఇది కాదని.. ఇది ఆర్టిస్టులను బలపరిచే అసోసియేషన్ ఉండాలని చెప్పారు. ఆర్టిస్ట్ కు కష్టం లేకుండా చేసేలా అసోసియేషన్ పని చేయాలని అన్నారు. 'మా' అసోసియేషన్ లో 900 మంది సభ్యులున్నారని అందరూ అంటున్నారని.. అందులో సుమారు 150 మంది యాక్టివ్ మెంబర్స్ కాదని అన్నారు.
అలా చూసుకుంటే 750 మంది మాత్రమే ఉన్నారని.. అందులో 147 మంది చెన్నై, బెంగుళూరు, కేరళ నుంచి వచ్చి తమ షూటింగ్ పూర్తి చేసుకొని వెళ్లిపోతారని.. వాళ్లకు అమౌంట్ బాగానే వస్తుందని అన్నారు. ఇక ఉన్నది 600 మంది మాత్రమేనని.. అందులో కొందరు యంగ్ హీరోలు, పెద్ద పెద్ద నటులు ఓటింగ్ కి రారని.. వాళ్లకు అవసరం లేదని కామెంట్స్ చేశారు. మిగిలిన వాళ్లు 450 మంది అని.. అందులో కూడా 200 మంది బాగానే ఉన్నారని.. ఇక ఆడుకోవాల్సింది 250 మంది మాత్రమేనని చెప్పుకొచ్చారు.
ఆరు నెలల పాటు ఈ హోమ్ వర్క్ చేసుకొని వచ్చానని చెప్పారు. మంచి చేయాలనుకుంటున్నారు కానీ.. ఎలా చేయాలో ఎవరికీ తెలియడం లేదని అన్నారు. తను మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే.. తనకు తెలిసిన డాక్టర్ల సహాయంతో వంద మంది వైద్యులతో క్లబ్ ఏర్పాటు చేస్తామని.. ఆ క్లబ్ కేవలం సినిమా ఆర్టిస్ట్ లకు మాత్రమే నాని.. మూడు నెలల్లో అసోసియేషన్ ఆఫీస్ లో ప్రతీ ఒక్కరికీ హెల్త్ కార్ట్ వచ్చేలా చేస్తానని చెప్పారు.
కోవిడ్ సమయంలో 'నవరస' ప్రాజెక్ట్ చేసి పేద కళాకారులను ఆదుకున్నామని.. తెలుగులోనూ సాయం అడిగితే చేయడానికి త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, క్రిష్, నాని ఇలా అందరూ ముందుకు వస్తారని అన్నారు. ఇకపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో నలుగురు కో-ఆర్డినేటర్స్ ఉంటారని.. ప్యానెల్‌లో ఉన్న 26మందికీ 26 ఫోన్ నెంబర్లు ఉంటాయని.. ఈ మెంబర్స్ సినిమా సెట్స్‌కు వెళ్లి, ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్న ‘మా’ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకొని.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పుకొచ్చారు.