Vishal, Prakash raj: మోదీపై హీరో విశాల్ పొగడ్తల వర్షం, ‘షాట్ ఓకే’ అంటూ ప్రకాష్ రాజ్ కౌంటర్ - ఏం జరుగుతోంది?
తమిళ నటుడు విశాల్ పై ప్రకాష్ రాజ్ గుర్రుమన్నారు. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
"మోదీజీ కాశీకి వెళ్లాను. దర్శనం, పూజ అన్నీ అద్భుతంగా జరిగాయి. పవిత్ర గంగానది నీళ్లను తాకాను. ఈ నగరాన్ని, ఈ ఆలయాన్ని ఇంత సుందరంగా.. అందరూ దర్శించుకోవటానికి వీలుగా తీర్చిదిద్దిన మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. హ్యాట్యాఫ్ యూ, సెల్యూట్ టూయూ". ఇది హీరో విశాల్ చేసిన ఓ ట్వీట్ సారాంశం. కొద్దిరోజుల క్రితం వారణాసికి వెళ్లిన విశాల్ అక్కడి తన అనుభూతులను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీని ప్రశంసిస్తూ ఆయన ట్యాగ్ చేయటమే కాకుండా ఆ ట్వీట్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో పిన్ చేసి పైనే కనపడేట్లు పెట్టుకున్నారు విశాల్. ఓకే ఇక్కడి వరకూ బాగానే ఉంది. విశాల్ ట్వీట్ చేసిన మూడు రోజుల తర్వాత ఈ రోజు విలక్షణ నటుడు, దర్శకుడు ప్రకాశ్ రాజ్ సీన్ లోకి ఎంటరయ్యారు. 'షాట్ ఓకే..నెక్ట్...???' అని ట్వీట్ చేశారు. ఇప్పుడు యాక్టర్ల ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అసలు ఏమైంది?
ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. విశాల్ తన జెన్యూన్ అభిప్రాయాన్ని వ్యక్తపరిచి ఉండొచ్చు. కానీ సీన్ లోకి ప్రకాశ్ రాజ్ ఎంటరవటంతో ఈ ట్వీట్ వెనుక వేరే ఉద్దేశమేమన్నా విశాల్ కు ఉందా అన్న అనుమానం నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. కారణం గతంలో బీజేపీతో, ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో విశాల్ చూపించిన దూకుడు. విశాల్ కొన్నేళ్లుగా సామాజిక సమస్యలే ఇతివృత్తాలుగా సినిమాలు చేస్తున్నారు. అభిమన్యుడు, టెంపర్ రీమేక్ అయోగ్య, చక్ర ఇలా విశాల్ చేసే సినిమాల్లో సోషల్ ఎలిమెంట్స్ ను తీసుకుని క్వశ్చన్ చేశాడు. డిజిటల్ ఇండియా, ఆధార్ కార్డ్, నల్లధనాన్ని స్విస్ బ్యాంకుల నుంచి తిరిగి తీసుకురావటం, పెద్దనోట్ల రద్దు ఇలా అనేక అంశాలపై నిర్భయంగా తన అభిప్రాయాలను సినిమాల్లో వెల్లడించారు. ఇవన్నీ ప్రధాని మోదీని, బీజేపీని టార్గెట్ చేసి విశాల్ చేస్తున్నారని ఆయనపై అనేక అభియోగాలు వచ్చాయి. అదే సమయంలో సినిమాల్లో డైలాగులను మ్యూట్ చేస్తూ సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు, ఆదాయపుపన్నుల ఎగవేత అంటూ జరిగిన ఐటీ దాడులతో విశాల్ అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. ప్రజా సమస్యలపై తన గళం వినిపించినందుకే విశాల్ ను టార్గెట్ చేశారంటూ ఆ కష్టసమయాల్లో ఆయన అభిమానులు అండగా నిలబడ్డారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ లో, ప్రిరిలీజ్ వేడుకల్లో తనపై వస్తున్న ఆరోపణలు, బీజేపీ వ్యతిరేక ముద్రపైనా చాలా సార్లు విశాల్ బహిరంగంగానే మాట్లాడారు.
ఇప్పుడు ఈ మార్పేంటీ..?
అదే సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. బీజేపీ చర్యల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడని ఆయన అభిమానులు చెబుతుంటే...ప్రధాని మోదీ సంస్కరణలను మెచ్చుకుంటూ విశాల్ ట్వీట్ చేయటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే సమయంలో ప్రకాశ్ రాజ్ ఎంటర్ అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లైంది. కారణం ప్రకాశ్ రాజ్ బీజేపీ పార్టీకి, ప్రధాని మోదీ విమర్శకుడు, వ్యతిరేకి. బీజేపీని ఓడించాలనే సంకల్పంతోనే గత ఎన్నికల్లో ఆయన బెంగుళూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనేక సందర్భాల్లో #JustAsking అంటూ బీజేపీ నిర్ణయాలను, మోదీ స్టేట్ మెంట్స్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇప్పుడు విశాల్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ షాట్ ఓకే అని ప్రకాశ్ పెట్టడం చూస్తుంటే...వీళ్లిద్దరూ కావాలనే అలా ట్వీట్స్ పెట్టారా..లేదా విశాల్ నటిస్తున్నాడని కోపంతోనే ప్రకాశ్ రాజ్ నిజంగానే ట్వీట్ చేశారా అనేది తేలాలి.
Read Also: బ్లాక్ బస్టర్ మూవీ ‘కాంతార’ను చూసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, రిషబ్ శెట్టికి అభినందనలు
Shot Ok…. Next ??? … #justasking https://t.co/uybmBFVSwZ
— Prakash Raj (@prakashraaj) November 3, 2022