Radhe Shyam: 'రాధేశ్యామ్'పై కీ అప్డేట్.. మూడు రోజుల్లో డార్లింగ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్
పండగ సీజన్లను ముందే బ్లాక్ చేసేసుకుంటారు మన హీరోలు. వచ్చే సంక్రాంతి సినిమాల విషయంలో ఇప్పటికే బెర్తులు కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు.
పండగ సీజన్లను ముందే బ్లాక్ చేసేసుకుంటారు మన హీరోలు. వచ్చే సంక్రాంతి సినిమాల విషయంలో ఇప్పటికే బెర్తులు కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు. మహేష్ బాబు సినిమా 'సర్కారు వారి పాట', పవన్ కళ్యాణ్-రానాల కొత్త సినిమాలు సంక్రాంతికి రిలీజ్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో 'ఎఫ్ 3' సినిమాను కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. ఇవి మూడు కూడా పెద్ద సినిమాలే కాబట్టి మరో సినిమాకి ఖాళీ ఉండదని భావిస్తున్నారు. కానీ వీటిని మించిన ఓ పెద్ద సినిమా సంక్రాంతి రేసులోకి రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్ కొత్త సినిమా 'రాధేశ్యామ్'ను సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో మరో మూడు రోజుల్లో ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తారని.. అందులో సంక్రాంతి ప్రకటన ఉంటుందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. 'రాధేశ్యామ్' సినిమా అప్డేట్స్ గురించి అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే.. చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ స్వయంగా స్పందించారు. మూడు రోజుల్లో అప్డేట్ రాబోతుందని ఆయన చెప్పుకొచ్చారు.
'రాధేశ్యామ్' సినిమా మొదలై రెండేళ్లు దాటేసింది. కరోనా కారణంగా సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ముందు అనుకున్నట్లుగా అయితే ఈ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రావాలి. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు వాయిదా పడింది. రీసెంట్ గానే షూటింగ్ ను పునః ప్రారంభించారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కు కాస్త ఎక్కువ సమయం పట్టేలా ఉంది. పైగా ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని చోట్లా అనుకూల పరిస్థితులు ఉండాలి.
దసరా నాటికి 'ఆర్ఆర్ఆర్' సినిమా వస్తుందనేది కన్ఫర్మ్. దీపావళికి రజినీకాంత్, అజిత్ ల సినిమాలు లైన్ కడుతున్నాయి. దీంతో సంక్రాంతి సీజన్ అయితే బెస్ట్ అనుకుంటున్నారని తెలుస్తోంది. తెలుగులో పోటీ ఎక్కువ ఉన్నప్పటికీ సంక్రాంతి సీజన్ అయితే కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా కృష్ణం రాజు సమర్పణలో రాబోతున్న ఈ సినిమాను వంశీ కృష్ణారెడ్డి. ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు.
భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛేత్రీ వంటి తారలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కనిపించనున్నారు.