Balakrishna Anil Ravipudi Movie : మంత్రాలయంలో బాలకృష్ణ కొత్త సినిమా కోసం పూజలు - ఏం చేస్తున్నారంటే?
Balakrishna New Movie NBK 108 Launch : నట సింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా కోసం మంత్రాలయంలో పూజలు చేస్తున్నారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు దైవ భక్తి ఎక్కువ. ఆయన పూజలు ఎక్కువగా చేస్తారు. కొన్ని సెంటిమెంట్లు ఫాలో అవుతారు. సినిమా టైటిల్ వెల్లడించడం దగ్గర నుంచి విడుదల రోజు వరకు... ప్రతి విషయానికి పక్కా ముహూర్తం చూసుకుంటారు. ఇప్పుడు కొత్త సినిమాకు కూడా అలవాటైన రూటులో వెళుతున్నారు.
రాఘవేంద్ర స్వామి సమాధి చెంత స్క్రిప్ట్...
బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే. హైదరాబాద్‌లో గురువారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. అయితే... మంత్రాలయంలో ఈ రోజు చిత్ర బృందంలో కొందరు పూజలు నిర్వహించారు. రాఘవేంద్ర స్వామి సమాధి చెంత స్క్రిప్ట్ ఉంచి పూజలు నిర్వహించారు. హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్ వేశారు.
బాలకృష్ణకు జోడీగా ప్రియాంకా జవాల్కర్?
Balakrishna New Movie : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలో కథానాయికగా 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ (Priyanka Jawalkar) ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఆమెకు ఫోటో షూట్ చేశారు. ప్రియాంకను ఎంపిక చేసిందీ? లేనిదీ? సినిమా ఓపెనింగ్ సమయంలో వెల్లడించే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' (Taxiwala) విజయంతో వెలుగులోకి వచ్చిన ప్రియాంక, ఆ తర్వాత 'తిమ్మరుసు', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' సినిమాలతో పేరు తెచ్చుకున్నారు. ఆమె లాస్ట్ సినిమా 'గమనం'. ఆది ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ వస్తే ఆమె మరో మెట్టు ఎక్కినట్టే.
Also Read : తెలుగులో ఈ ఏడాది (2022లో) రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?
తండ్రీ కుమార్తెల ఈ సినిమా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. బాలకృష్ణకు ఈ సినిమా కొత్తగా ఉంటుందని, ఆయనకు డిఫరెంట్ ఇమేజ్ తీసుకు వస్తుందని టాక్. ఈ సినిమాలో కుమార్తె పాత్రకు 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీ లీల (Sree Leela) ఎంపిక అయ్యారు. మరో హీరోయిన్ అంజలి (Anjali) కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్.
బాలకృష్ణకు సాలిడ్ హిట్ పడితే బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్ ఎలా ఉంటుందనేది 'అఖండ' చూపించింది. ఆ చిత్రానికి వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్ళు వచ్చాయి. అందుకని, షైన్ స్క్రీన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న హరీష్ పెద్ది, సాహూ గారపాటి సుమారు 90 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు టాక్. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ సినిమాలు అన్నిటిలోనూ ఆయన డ్యూయల్ రోల్స్ చేశారు. కానీ, ఈ సినిమాలో మాత్రం ఆయనది సింగిల్ రోల్. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి స్పష్టం చేశారు.
అనిల్ రావిపూడి సినిమా కంటే ముందు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy) విడుదల కానుంది. అనిల్ రావిపూడి సినిమా తర్వాత కల్ట్ క్లాసిక్ 'ఆదిత్య 369'కి సీక్వెల్ 'ఆదిత్య 999 మ్యాక్' సెట్స్ మీదకు వెళ్ళనుంది. దానికి బాలకృష్ణ స్క్రిప్ట్ రాస్తున్నారు. అంతే కాదు... ఆయనే డైరెక్ట్ చేయనున్నారు.