Mr Celebrity Telugu Movie: 'మిస్టర్ సెలబ్రిటీ'తో హీరోగా పరుచూరి మనవడు... కొత్త పద్ధతిలో రేప్ ఏంటి?
Paruchuri Grandson Sudarshan: ప్రముఖ రచయితలు పరుచూరి సోదరుల గురించి ప్రేక్షకులకు తెలుసు. ఇప్పుడు వాళ్ల ఇంటి నుంచి ఓ హీరో వస్తున్నాడు. 'మిస్టర్ సెలబ్రిటీ'తో పరుచూరి మనవడు హీరోగా పరిచయమవుతున్నాడు.
''సాధారణంగా హీరోల కుమారులు హీరోలు అవుతుంటారు. కానీ, మా ఇంటి నుంచి మా మనవడు హీరోగా పరిచయం అవుతున్నాడు. నేను, మా తమ్ముడు ఈ సినిమా చూశాం సుదర్శన్ బావున్నాడని, సినిమా బావుందని మా తమ్ముడు చెప్పాడు. తను మంచి విమర్శకుడు. అతను బావుందని చెప్పడం సంతోషాన్ని ఇచ్చింది'' అని సీనియర్ రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు అన్నారు. ఆయన చేతుల మీదుగా 'మిస్టర్ సెలబ్రిటీ' టీజర్ విడుదల అయ్యింది. ఈ సినిమాతో పరుచూరి మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా పరిచయం అవుతున్నాడు.
సెలబ్రిటీలపై పుకార్లు... యూట్యూబర్ మీద రేప్!
చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించిన 'మిస్టర్ సెలెబ్రిటీ' చిత్రాన్ని ఆర్‌పి సినిమాస్ పతాకం మీద ఎన్. పాండు రంగారావు, చిన్న రెడ్డయ్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు ప్రధాన తారాగణం.
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల మీద వచ్చే పుకార్ల నేపథ్యంలో 'మిస్టర్ సెలబ్రిటీ' తెరకెక్కిందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. 'రామాయణం కాలంలో చాకలి వాడు అన్న పుకార్ల మాటలకు సీతా దేవీ అరణ్యవాసం చేశారు. ఆ తర్వాత అగ్ని ప్రవేశం చేయవలసి వచ్చింది. కాలం మారింది. కానీ, ఈ పుకార్ల వల్ల ఇంకా ప్రాణాలు పోతున్నాయి' అంటూ వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పిన డైలాగుతో టీజర్ మొదలైంది. విశాఖకు చెందిన సామాజిక కార్యకర్త లలితను హైదరాబాద్ సిటీకి చెందిన యూట్యూబర్ కొత్త పద్ధతితో రేప్ చేయడం ఏమిటి? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ఆసక్తికరం.
Also Read: ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్, సిద్ధూ, నిర్మాతలు... వరద బాధితుల సహాయార్థం ఎవరెంత విరాళం ఇచ్చారంటే?
ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథతో తీశారు!
'మిస్టర్ సెలబ్రిటీ' గురించి పరుచూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ... ''తెరపై ప్రేక్షకుడు ఊహించింది జరగాలి. అయితే, అతను అనుకున్నది ఊహించని సమయంలో జరగాలి. ఈ సినిమా అలాగే జరుగుతుంది. దర్శకుడు రవి కిషోర్ సెలబ్రిటీ పుకార్ల మీద సినిమాను బాగా తీశారు. మా గిరిబాబు కుమారుడు రఘు బాబు అద్భుతంగా నవ్విస్తాడు. సాయి మాధవ్ బుర్రా మంచి రచయిత. ప్రేక్షకులు అందరికీ కనెక్ట్ అయ్యే కథతో తీసిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి'' అని అన్నారు.
ఎవ్వరికీ చెప్పకుండా జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు వేశా!
పరుచూరి మనవడు సుదర్శన్ మాట్లాడుతూ... ''ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండటం సంతోషంగా ఉంది. నేను హీరో అవుతానని చెప్పినప్పుడు మా తాతయ్య గారు కొన్ని టెస్టులు పెట్టారు. నా గురించి ఎవ్వరికీ చెప్పకుండా కొన్ని సినిమాల్లో జూనియర్ ఆరిస్టుగా పని చేశా. సినిమా కష్టాలను నేను చాలా దగ్గరగా చూశా. ఈ కథ నా దగ్గరకు వచ్చినప్పుడు తాతయ్య గారికి చెప్పా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నటించమని చెప్పారు'' అని తెలిపారు.
ఇదొక ప్రయోగాత్మక కథ అని, పరుచూరి గారికి స్క్రిప్ట్ చెప్పినప్పుడు కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారని, ఈ సినిమా క్లైమాక్స్ వైవిధ్యంగా ఉంటుందని దర్శకుడు రవి కిషోర్ తెలిపారు. చిన్న చిన్న మాటలు ఎంత పెద్ద ప్రభావం చూపుతాయనేది ఈ సినిమాలో ప్రేక్షకులు చూస్తారని వివరించారు. వరలక్ష్మి శరత్ కుమార్, సుదర్శన్ పరుచూరి, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు తదితరులు నటించిన ఈ సినిమాకు ఛాయాగ్రహణం: శివ కుమార్ దేవరకొండ, సంగీతం: వినోద్ యాజమాన్య, పాటలు: గణేష్, రాంబాబు గోసాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వెంకట్ రెడ్డి.