(Source: ECI/ABP News/ABP Majha)
The Legend of Maula Jatt: పాక్ మూవీ ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్‘కి షాక్ - భారత్‌లో విడుదల నిలిపివేత
ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్ నటించిన పాక్ మూవీ ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్‘ సినిమాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ చిత్రం భారత్ లో ఇవాళ విడుదల కావాల్సి ఉండగా చివరి క్షణంలో రిలీజ్ వాయిదా పడింది.
భారత్ లో పాక్ సినిమాలపై అనధికార నిషేధం కొనసాగుతోంది. 2011 తర్వాత భారత్ లో పాకిస్తాన్ సినిమాలు విడుదల కాలేదు. కానీ, ఫవాద్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ మూవీ డిసెంబర్ 30న విడుదల చేసేందుకు ఐనాక్స్ ప్రయత్నించింది. అయితే, సినిమా విడుదలకు చివరి క్షణంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా రిలీజ్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ చిత్రం విడుదలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) రద్దు చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’పై MNS అభ్యంతరం
సినిమా విడుదల వాయిదాకు సంబంధించి ఐనాక్స్ అధికారిక ప్రకటన చేసింది. సినిమా విడుదల నిరవధికంగా వాయిదా వేయబడినట్లు తెలిపింది. ఇప్పటి వరకు కొత్త రిలీజ్ డేట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. “సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని మాకు ప్రోగ్రామింగ్ టీమ్ చెప్పారు. కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు” అని ఐనాక్స్ ప్రతినిధి తెలిపారు. ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ భారత్ లో విడుదల చేయనున్నట్లు ఈ నెల 26న INOX లీజర్ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజేందర్ సింగ్ జ్యాలా తెలిపారు. ఈ ప్రకటన తర్వాత మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) నేత అమేయ ఖోప్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్ లో ఈ సినిమా ప్రదర్శనను తమ పార్టీ అనుమతించదని చెప్పారు.
There are plans to release Pakistani actor Fawad Khan’s Pakistani film ‘ The Legend of Maula Jatt’ in India. It is most infuriating that an Indian company is leading this plan. Following Raj Saheb’s orders we will not let this film release anywhere in India.
— Ameya Khopkar (@MNSAmeyaKhopkar) December 9, 2022
పాక్ లో అత్యధిక వసూళ్లు చేపట్టిన సినిమాగా గుర్తింపు
'ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్' మూవీలో ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ కీ రోల్స్ పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 13న పాకిస్థాన్ లో రీలీజ్ అయ్యింది. 2 నెలల తర్వాత ఇండియాలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరిగినా సక్సెస్ కాలేదు. రూ. 50 కోట్లతో 'ది లెజెండ్స్ ఆఫ్ మౌలా జాట్' తెరకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లు వసూలు చేసింది. బిలాల్ లషారి దర్శకత్వం వహించిన ఈ సినిమా పాకిస్థాన్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా పేరు తెచ్చుకుంది.
2011 తర్వాత పాక్ సినిమాల నిషేధం
భారత్ లో పాకిస్తాన్ సినిమా ‘బోల్’ చివరి సారిగా 2011లో విడుదలైంది. 11 ఏళ్ల తర్వాత 'ది లెజెండ్స్ ఆఫ్ మౌలా జాట్' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అందరూ అనుకున్నారు. కానీ, విడుదల కాలేదు. 2016లో ఉరీ ఉగ్రదాడి తర్వాత పాకిస్థానీ నటీనటులు భారతీయ సినిమాల్లో నటించడం మానేశారు. పాకిస్థాన్ యాక్టర్స్ ను భారతీయ సినిమాల నుంచి నిషేధించడంతో పాటు, అక్కడ సినిమాల ప్రదర్శనను కూడా నిలిపివేయాలనే డిమాండ్లు వచ్చాయి.
Read Also: టాప్ గన్ To అవతార్, ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలు ఇవే!