Suzhal 2 OTT Streaming: తెలుగులోనూ 'సుళుల్ 2' స్ట్రీమింగ్... ప్రైమ్ వీడియో ఓటీటీలో మర్డర్, మిస్సింగ్ కేసుల మిస్టరీ సిరీస్
Suzhal Season 2: ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'సుళుల్: ది వర్టెక్స్' సీజన్ 2 అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

Aishwarya Rajesh's Suzhal Season 2 Web Series Streaming On Amazon Prime Video: క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, సిరీస్ అంటేనే ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్న క్రమంలో ఓటీటీలు సైతం అలాంటి కంటెంట్‌ను ఎక్కువగా అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ జానర్‌లోనే మూడేళ్ల క్రితం వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'సుళుల్: ది వర్టెక్స్' (Suzhal: The Vertex) వెబ్ సిరీస్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సిరీస్‌లో ఆర్.పార్తీబన్ (R.Parthiban), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), శ్రియా రెడ్డి, కథిర్, హరీష్ ఉత్తమన్, నివేదితా సతీష్, ప్రేమ్ కుమార్ తదితరులు నటించారు. సీజన్ 1 తమిళంతో పాటు 30 భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ సిరీస్‌ను బ్రహ్మ జి- అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించారు. దీని సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఈ నెల 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
View this post on Instagram
సీజన్ 1 స్టోరీ ఏంటంటే.?
సాంబలూరు అనే ఊరిలోని సిమెంట్ ఫ్యాక్టరీలో ఓ రోజు కార్మికులకు, యాజమాన్యానికి గొడవ జరుగుతుంది. ఆ కార్మికులకు అక్కడ ఎంతోకాలంగా పని చేస్తోన్న షణ్ముగం (ఆర్.పార్తీబన్) లీడర్‌గా ఉంటారు. ఫ్యాక్టరీ ఎండీ త్రిలోక్ (హరీష్ ఉత్తమన్) దగ్గర డబ్బులు తీసుకుని కార్మికులను అణచివేయాలని సీఐ రెజీనా (శ్రియా రెడ్డి) ప్రయత్నిస్తుంది. దీంతో కార్మికులు సమ్మె చేస్తారు. అదే రోజు రాత్రి ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరగ్గా.. త్రిలోక్, సీఐ రెజీనా షణ్ముగం మీదే అనుమానం వ్యక్తం చేస్తారు. షణ్ముగాన్ని అరెస్టు చేసేందుకు వెళ్లిన రెజీనాకు అతని చిన్న కుమార్తె నీలా (గోపికా రమేష్) కనిపించడం లేదని తెలుస్తుంది. ఈ 2 కేసులను విచారించే క్రమంలో వారికి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. అదే సమయంలో ఆ ఊరి చెరువులో నీలాతో పాటు రెజీనా కుమారుడు అతిశయం (ఫెడ్రిక్ జాన్) మృతదేహాలు లభ్యమవుతాయి. ఆంకాళమ్మ జాతర మయాన్ కొళ్ళాయ్ జరుగుతున్న టైంలో ప్రేమికుల హత్య, ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్, 15 ఏళ్ల క్రితం జాతరలో మరో అమ్మాయి అదృశ్యం కావడం, వీటికి వాటికీ ఉన్న లింకేంటి.? నీలా అక్క నందిని (ఐశ్వర్యా రాజేష్)కి తెలిసిన అసలు నిజం ఏమిటి? అనేది 'సుళుల్' వెబ్ సిరీస్ మెయిన్ కాన్సెప్ట్.
అనుకోని ట్విస్టులతో సీజన్ 1 క్లైమాక్స్‌ను ముగించారు. తన చెల్లిని చంపిన వారిని మర్డర్ చేసి నందిని జైలుకు వెళ్లగా.. ఆమె తరఫున వాదిస్తోన్న లాయర్ మృతితో ఫస్ట్ సీజన్ ఎండ్ కాగా.. మరి రెండో సీజన్ సైతం అంతే ట్విస్టులు, థ్రిల్లింగ్ ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ఫస్ట్ సీజన్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా రెండో సీజన్ ఉంటుందని రచయిత పుష్కర్ గాయత్రి తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

