Squid Game Season 2: భయంకరమైన ‘గుడ్ న్యూస్’ చెప్పిన ‘స్క్విడ్ గేమ్’ డైరెక్టర్, అంటే సీజన్-2 ఉండదా?
Squid Game Season 2: ‘స్క్విడ్ గేమ్’ సీజన్-2 అప్‌డేట్ చెప్పిన దర్శకుడు హ్వాంగ్. ఇదే కాకుండా మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు.
Squid Game | నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సీరిస్‌ను మీరు కూడా చూసే ఉంటారు. సరికొత్త కథనంతో ఆకట్టుకున్న ఈ వెబ్ సీరిస్.. రెండో సీజన్ కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సీరిస్ దర్శకుడు హ్వాంగ్ డాంగ్-హ్యూక్ మాత్రం మరో భయానకమైన ‘గుడ్ న్యూస్’ చెప్పాడు. ప్రస్తుతం ఆయన ‘కిల్లింగ్ ఓల్డ్ పీపుల్ క్లబ్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని, అది ‘స్క్విడ్ గేమ్’ కంటే మరింత హింసాత్మకంగా ఉంటుందని వెల్లడించాడు. Hwang Dong-hyuk
‘స్క్విడ్ గేమ్’ కంటే ముందు హ్వాంగ్ డాంగ్-హ్యూక్.. ‘ది ఫోర్ట్రెస్’, ‘సైలెన్‌డ్’, ‘మై ఫాదర్’, ‘మిస్ గ్రానీ’ వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తాజా చిత్రం ఇటాలియన్ నవలా రచయిత ఉంబెర్టో ఎకో రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. కథ ప్రకారం.. హంతకులు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తుంటారని, దీన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లోని వృద్ధులను దాచుకోవలసి వస్తుందని తెలిపాడు. ప్రస్తుతం హ్వాంగ్ యూకే పర్యటనలో ఉన్నాడు.
మరి, ‘స్క్విడ్ గేమ్’ సీజన్-2 ఉండదా?: ‘స్క్విడ్ గేమ్’కు మాంచి క్రేజ్ లభించిన నేపథ్యంలో రెండో సీరిస్ కోసం జనాలు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మీరు దీని గురించి ఆందోళన చెందక్కర్లేదు. త్వరలోనే తాను తిరిగి దక్షిణ కొరియాకు తిరిగి వస్తానని, రాగానే ‘స్క్విడ్ గేమ్’ రెండో సీజన్ మొదలుపెడతానని ఆయన తెలిపారు. ఇందులో మరిన్ని ఆసక్తికరమైన ఆటలు ఉంటాయని హింట్ ఇచ్చారు. అయితే, రెండో సీజన్ కోసం ఆయన ఇంకా స్క్రిప్ట్ కూడా రాసుకోలేదట. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది ‘స్క్విడ్ గేమ్’ సీజన్-2పై ఆశలు వదిలేసుకోవల్సిందే. ఎందుకంటే, 2వ సీరిస్‌ను 2024లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.
Also Read: రొమాన్సే కాదు, అంతకు మించి - ఈ వెబ్ సీరిస్‌లు పెద్దలకు మాత్రమే, పిల్లలతో చూడొద్దు!
స్టీవెన్ స్పీల్‌బర్గ్‌కు బాగా నచ్చేసింది: ‘స్క్విడ్ గేమ్’ మొదటి సీజన్ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్‌కు చాలా నచ్చేసిందని డాంగ్-హ్యూక్ తెలిపారు. ‘‘స్టీవెన్ స్పీల్‌బర్గ్ నాతో మాట్లాడుతూ.. నేను మీ మొత్తం షోను మూడు రోజుల్లో చూసేశాను. ఇప్పుడు నేను మీ మెదడును దొంగిలించాలి అనుకుంటున్నాను. నా జీవితంలో నాకు లభించిన అతిపెద్ద అభినందన ఇది. ఎందుకంటే నేను ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను’’ అని తెలిపారు. ఏదైతే అది అయ్యింది. కాస్త త్వరగా ‘స్క్విడ్ గేమ్’ రిలీజ్ చేయండి బ్రో!!
Also Read: బాక్స్ నిండా మనుషుల తలలు, నగలనుకుని ఎత్తుకెళ్లిన దొంగలు - ఇంతకీ అవి ఎవరి తలలు?