Samajavaragamana: ఓటీటీలో రికార్డులు బద్దలుకొడుతున్న ‘సామజవరగమన’ - 72 గంటల్లో అంత మంది చూసేశారా?
‘సామజవరగమన’ సినిమా కేవలం థియేటర్లలో మాత్రమే కాదు.. ఓటీటీలో కూడా తన సత్తా చాటుతోంది.
చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా గత కొన్నేళ్లలో చాలావరకు తగ్గిపోయింది. ఈరోజుల్లో తక్కువ బడ్జెట్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. అసలు బాక్సాఫీస్ దగ్గర తక్కువ బడ్జెట్ సినిమాలు సృష్టిస్తున్న వండర్స్ చూస్తుంటే స్టార్ ప్రొడ్యూసర్సే ఆశ్చర్యపోతున్నారు. హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, దర్శకుడికి ఇది డెబ్యూ సినిమానా, ఇలాంటి తేడాలు ఏమీ లేకుండా కంటెంట్ నచ్చితే చాలు.. ప్రేక్షకులు సినిమాను సూపర్ డూపర్ హిట్ చేస్తున్నారు. 2023లో అలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి విడుదలయిన తర్వాత కలెక్షన్లను కొల్లగొట్టిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ‘సామజవరగమన’. ఈ సినిమా కేవలం థియేటర్లలో మాత్రమే కాదు.. ఓటీటీలో కూడా తన సత్తా చాటుతోంది.
ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంటరై పొటెన్షియల్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ఈరోజుల్లో టాలీవుడ్‌లో కొంతమంది యంగ్ హీరోలు విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ముందుకెళ్తారు అనే పేరును సాధించారు. ఆ లిస్ట్‌లో శ్రీవిష్ణు పేరు కూడా కచ్చితంగా చేరుతుంది అని చాలామంది టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటివరకు శ్రీవిష్ణు చేసిన సినిమాల్లో కమర్షియల్ జోనర్‌కు చెందిన చిత్రాలు చాలా తక్కువ. తన సినిమాల్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే ఏదో ఒక ఎలిమెంట్ దాగి ఉంటుంది. ‘సామజవరగమన’లో ఉండే కామెడీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందని స్పష్టంగా తెలుస్తోంది. కేవలం మౌత్ టాక్‌తో ‘సామజవరగమన’కు కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి.
నరేశ్ నటన హైలెట్
‘సామజవరగమన’ కలెక్షన్స్ చూసి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఇందులో హీరోయిన్‌గా నటించిన రెబా జాన్‌కు తెలుగులో ఇది మొదటి చిత్రమే అయినా.. తన నటనతో ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సినిమాకు ప్రాణం పోసిన పాత్రలో నటించారు నరేశ్. సీనియర్ నటుడు నరేశ్.. గత కొన్నిరోజులుగా అనేక సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపేస్తున్నారు. అంతే కాకుండా ఆయన నటిస్తున్న ప్రతీ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్‌ను అందుకుంటోంది. కానీ ఆయన తాజాగా నటించిన ‘మళ్లీ పెళ్లి’, ‘ఇంటింటి రామాయణం’తో పోలిస్తే.. ‘సామజవరగమన’లో నరేశ్ పోషించిన పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. సినిమా మొత్తాన్ని తన కామెడీతో మరో ఎత్తుకు తీసుకెళ్లాడు ఈ సీనియర్ నటుడు.
థియేటర్లలో ఉండగానే ‘ఆహా’లోకి
సామజవరగమన థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సమయంలోనే తెలుగు ఓటీటీ ‘ఆహా’లో విడుదలవుతున్నట్టుగా ప్రకటన విడుదలయ్యింది. అయినా కూడా థియేటర్లలోకి వెళ్లే ప్రేక్షకుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. ఒకవైపు థియేటర్లలో రన్ అవుతుండగా ఆహాలో విడుదలయిన వెంటనే సరికొత్త రికార్డులను సృష్టించడం మొదలుపెట్టింది సామజవరగమన. విడుదలయిన 72 గంటల్లోనే 200 మిలియన్ స్ట్రీమింగ్ మినెట్స్‌ను సాధించి ఆహా యాజమాన్యాన్ని సైతం ఆశ్చర్యపరిచింది. జులై 27న విడుదలయిన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే 18 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రామ్ అబ్బరాజు గురించి కూడా ప్రేక్షకులతో పాటు సినీ రంగంలోని పెద్దలకు కూడా తెలిసింది. అందుకే అప్పుడే యంగ్ హీరో నాగచైతన్యను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడని టాలీవుడ్‌లో రూమర్స్ వైరల్ అయ్యాయి. సామజవరగమన లాంటి ఒక కామెడీ ఎంటర్‌టైనర్‌లో నాగచైతన్య నటిస్తే చూడాలని ఉందంటూ అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Also Read: ‘గుంటూరు కారం’ సినిమాపై ‘బ్రో’ ఎఫెక్ట్ - అంతా త్రివిక్రమ్ వల్లే!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial