Satthigani Rendekaralu trailer: 'సత్తిగాని రెండెకరాలు' ట్రైలర్ - ఇంతకీ ఆ సూట్‌కేస్‌లో ఏముంది?
'పుష్ప' నటుడు జగదీష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'సత్తి గాని రెండెకరాలు'. మే 26 నుంచి 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.

‘ఆహా' ఓటీటీ పలు వెబ్ సిరీస్లు, సినిమాలు, స్పెషల్ షోస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా 'ఆహా'లో 'సత్తి గాని రెండెకరాలు' సినిమా రాబోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయ్యాడు నటుడు జగదీష్. పుష్పరాజ్ స్నేహితుడు కేశవ పాత్రలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆ పాపులారిటీతో జగదీష్‌కు సినిమా అవకాశాలు కూడా పెరిగాయి.
తాజాగా జగదీష్ ప్రధాన పాత్రలో 'సత్తి గాని రెండెకరాలు' సినిమాలో నటించాడు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించింది. అభినవ్ దండ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి, అనీషా, మోహన శ్రీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. నిజానికి గతంలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. పలు కారణాలవల్ల విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు 'ఆహా' ఓటీటీ లో మే 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్లో సత్తిగాడు ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అయితే తన కూతురికి హాట్ లో హోల్ ఉండడంతో డబ్బులు అవసరం పడతాయి. దీంతో తనకున్న రెండు ఎకరాల పొలాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అతను ఏం చేస్తాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేదే ఈ సినిమా కథ. డార్క్ కామెడీ జోన్ లో సాగే ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకోవడం ఖాయమని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ముఖ్యంగా ట్రైలర్ లో వెన్నెల కిషోర్ కామెడీ, జగదీష్ నాచురల్ యాక్టింగ్ హైలెట్ గా నిలిచాయని చెప్పవచ్చు.
పుష్ప సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న జగదీష్ ఈ సినిమాతో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి. ఇక సత్తి గాని రెండెకరాలు కథ విషయానికి వస్తే.. తెలంగాణ నేపథ్యంలో ఓ చిన్న పల్లెటూరులో ఈ సినిమా సాగుతుంది. ఆ పల్లెటూరులో ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించే ఓ తండ్రికి ఒక సమస్య వస్తుంది. తన కూతురికి హార్ట్ లో హోల్ ఉండడంతో ఆ తండ్రికి డబ్బు అవసరం అవుతుంది. దానికోసం ఆ తండ్రి తనకున్న రెండు ఎకరాలను అమ్ముకోవాల్సి వస్తుంది. మరి ఆ తండ్రి తనకున్న రెండు ఎకరాలను అమ్ముకున్నాడా? తన కూతురిని కాపాడుకున్నాడా? అదంతా ఎలా జరిగింది? అనేది ఈ సినిమా చూసి తీసుకోవాల్సిందే. అన్నట్టు ఈ సినిమాను చాప్టర్స్ వైజ్ గా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
‘సత్తిగాని రెండు ఎకరాలు’ ట్రైలర్ ఇక్కడ చూడండి
Also Read: '2018' రివ్యూ : మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన సినిమా - ఎలా ఉందంటే?





















