BRO Trending: పాకిస్తాన్‌లోనూ ట్రెండవుతున్న ‘బ్రో’ మూవీ, కారణం ఏంటో తెలుసా?
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన రీసెంట్ మూవీ ‘బ్రో’ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ చిత్రం ప్రస్తుతం పాకిస్తాన్ లో ట్రెండింగ్ లో నిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన తాజా చిత్రం ‘బ్రో’. జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తొలి షో నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగానూ ఫర్వాలేదు అనిపించింది. అనుకున్న స్థాయిలో కాకపోయినా, మూవీ లవర్స్ ను బాగానే అలరించింది. అయితే, ఈ సినిమా విడుదలై నెల రోజులు నిండక ముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 25 నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లి క్స్ లో స్ట్రీమ్ అవుతోంది. తెలుగులో మాత్రమే కాదు.. తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ‘బ్రో’ విడుదల అయ్యింది.
పాకిస్తాన్ లో ట్రెండ్ అవుతున్న ‘బ్రో’ మూవీ
నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ‘బ్రో’ మూవీ గత వారం (ఆగస్టు 21 నుంచి ఆగస్టు 27 వరకు) నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అయ్యింది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కూడా ఈ సినిమా ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ రెండు దేశాల్లో ‘బ్రో’ మూవీ ట్రెండింగ్ లో 8 స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పవన్ కల్యాణ్ మూవీ పాకిస్తాన్ లో ట్రెండ్ అవడం ఏంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నిజానికి ‘BRO’ చిత్రం హిందువు సంప్రదాయాలు, నమ్మకాల ఆధారంగా తెరకెక్కింది. ఈ కోణంలో చూసినప్పుడు పాక్ లో ఈ సినిమా ఎందుకు ట్రెండ్ అయ్యిందనేది అర్థం కాక చాలా మంది బుర్ర గోక్కుంటున్నారు.
OTT విశ్లేషకులు ఈ చిత్రం ఎందుకు ట్రెండ్ అవుతుంది? అనే విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘బ్రో’ మూవీకి సంబంధించి హిందీ వెర్షన్ అందుబాటులో ఉంది. ఈ చిత్రం భారత్ లో ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో సహజంగానే పొరుగు దేశాలైన పాక్ తో పాటు బంగ్లాదేశ్ లో ఈ చిత్రంపై ఆసక్తి చూపిస్తున్నారని చెప్తున్నారు. అంతేకాదు, హిందీ తెలిసి దక్షిణాసియా దేశాలలో ఉంటున్న వాళ్లు కూడా ఈ సినిమాను చూడటంతో బాగా పాపులర్ అవుతున్నట్లు వెల్లడించారు. ఏదైతేనేం తమ అభిమాన హీరో సినిమా పొరుగు దేశాల్లో ట్రెండ్ కావడం పట్ల పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అంతగా ఆకట్టుకోని ‘బ్రో’ పాటలు
ఇక సముద్రఖని దర్శకత్వం వహించిన ‘బ్రో’ సినిమాకు త్రివిక్రమ్ డైలాగులు అందించారు. సాయి ధరమ్ తేజ్‌కు జోడీగా కేతిక శర్మ నటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ‘బ్రో’ను నిర్మించారు. తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందరినీ ఇంప్రెస్ చేసినా, పాటల విషయంలో మాత్రం ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ‘బ్రో’లో ఒక్క పాట కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
Read Also: కప్పు కాదు, మనసులు గెలుచుకున్నారు - ‘బిగ్ బాస్’లో ప్రేక్షకులు మెప్పు పొందిన కంటెస్టెంట్స్ వీరే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial