HanuMan: థియేటర్‌లోనే కాదు, ఓటీటీలోనూ ‘హనుమాన్’ హవా - ఒక ట్విస్ట్ ఉంది
legend of Hanuman: ప్రస్తుతం థియేటర్లలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ సినిమా సందడి చేస్తోంది. మరోవైపు ఓటీటీలో ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ అంటూ మరో హనుమంతుడు కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
HanuMan Vs The Legend Of Hanuman: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘హనుమాన్’ సందడి నడుస్తోంది. ఒకవైపు థియేటర్లలో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’ సినిమా హల్‌చల్ చేస్తోంది. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరు కారం’తో పోటీకి దిగిన ‘హనుమాన్’.. తమ కంటెంట్‌పై ముందు నుంచి నమ్మకంతో ఉంది. అందుకే ఎన్నో పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతికి విడుదలవుతున్నా.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తాము కూడా అప్పుడే రిలీజ్ చేస్తామని ఫిక్స్ అయ్యి ఉన్నారు మేకర్స్. ఇక మరోవైపు ఓటీటీలో కూడా హనుమాన్ సందడి నడుస్తోంది. సంక్రాంతి వీకెండ్‌కు ఎక్కువ ఓట్లు ఎవరికి పడుతున్నాయో చూసేద్దాం..
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఇప్పటికే వైవిధ్యభరితమైన కథలతో, వివిధ జోనర్లను ట్రై చేస్తాడు అని పేరు తెచ్చుకున్నాడు. పైగా తను ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు కూడా చాలామంది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇంతలోనే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ) అనే ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసి దేవుళ్లను సూపర్ హీరోలుగా చూపిస్తామని ప్రకటించాడు. అందులో ముందుగా హనుమంతుడి కథతో ‘హనుమాన్’ వస్తుందని చెప్పాడు. అనుకున్నట్టుగానే తేజ సజ్జాతో ‘హనుమాన్’ను తెరకెక్కించి ప్రేక్షకుల ముందు పెట్టాడు. తమ కంటెంట్‌పై నమ్మకంతో దీనిని పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయడం మాత్రమే కాకుండా ప్రతీ రాష్ట్రానికి వెళ్లి ప్రమోషన్స్ కోసం కష్టపడ్డారు మేకర్స్.
ఓటీటీలో హనుమంతుడు
జనవరి 12న ‘హనుమాన్’ మూవీ విడుదల అవుతుంది అనగా.. జనవరి 11న పెయిడ్ ప్రీమియర్స్‌ను ఏర్పాటు చేశారు. పెయిడ్ ప్రీమియర్స్ నుండే ‘హనుమాన్’కు మంచి టాక్ లభించింది. ఆ తరువాతి రోజు దానికి పోటీగా విడుదలయిన ‘గుంటూరు కారం’కు యావరేజ్ టాక్ రావడంతో ‘హనుమాన్’కు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రశాంత్ వర్మ మ్యాజిక్ చేశాడని, తన సినిమాపై ఎందుకు అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో ఇప్పుడు అర్థమవుతుందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇక ఇప్పటినుండే తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే తరువాతి సినిమాలు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో అంచనా వేసుకుంటున్నారు. మరోవైపు ఓటీటీలోకి కూడా హనుమంతుడు వచ్చాడు.
సక్సెస్‌ఫుల్‌గా మూడో సీజన్..
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తాజాగా ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3’ అనే ఒక యానిమేషన్ సిరీస్ విడుదలయ్యింది. ఈ సిరీస్‌కు సంబంధించిన మొదటి సీజన్ 2021 జనవరి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షరద్ దేవరాజన్, జీవిన్ జీ కాంగ్, చరువి అగర్వాల్ కలిసి ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. మొదటి సీజన్ విడుదల అవ్వగానే దానికి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌ను చూసి వెంటనే రెండో సీజన్ గురించి అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇక థియేటర్లలో ‘హనుమాన్’ సినిమా విడుదలయిన రోజే.. ఓటీటీలో ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3’ విడుదలయ్యింది. ఇది యానిమేషన్ సిరీసే అయినా.. పిల్లలతో పాటు పెద్దలకు కూడా చాలా నచ్చుతుందని చూసినవారు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.