Ayalaan OTT Release: ఓటీటీలోకి ‘అయలాన్’- తెలుగు ప్రేక్షకులు వెయిట్ చేయాల్సిందేనా?
Ayalaan: తమిళ మూవీ ‘అయలాన్’ ఓటీటీ విడుదలకు రెడీ అవుతోంది. అయితే, తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
Ayalaan Telugu version OTT Release Delayed: తమిళ నటుడు శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన రీసెంట్ మూవీ ‘అయలాన్’. సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో కార్తికేయన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. రవి కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలై.. మంచి విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగానూ సత్తా చాటింది. ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. సన్ నెక్స్ట్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే సదరు ఓటీటీ సంస్థ తన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, ‘అయలాన్’ సినిమా ఓటీటీలో ఎన్ని భాషల్లో విడుదల అవుతుంది? ఏ భాషలో ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ చేయబోతున్నారు? అనే విషయంలో మాత్రం సన్ నెక్స్ట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఓటీటీలో ‘అయలాన్’ తెలుగు వెర్షన్ విడుదల ఎప్పుడు?
వాస్తవానికి ‘అయలాన్’ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలని చిత్రబృందం ప్రయత్నించింది. సంక్రాంతి కానుకగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించింది. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించింది. అయితే, సంక్రాంతి బరిలో పలు తెలుగు సినిమాలు నిలవడంతో ‘అయలాన్’ పోటీ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఈ సినిమా విడుదల అవుతుందని అందరూ భావించారు. కానీ, తెలుగులో విడుదల అవుతుందా? కాదా? అనే విషయంపై చిత్రబృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
‘అయలాన్’ను విడుదల ఆలస్యం ఎందుకు?
అటు ‘అయలాన్’ సినిమా తమిళ వెర్షన్ మాత్రం రేపటి నుంచి (ఫిబ్రవరి 9) సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు వెర్షన్ లో మాత్రం విడుదలకావడం లేదని తెలుస్తోంది. తమిళ వెర్షన్ విడుదలైన కొద్ది రోజులకు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఓటీటీ విడుదల చేయకపోవడానికి గల కారణాలు ఏంటి? అనే అంశంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటికీ తెలుగు వెర్షన్ లో థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని, డేట్స్ దొరక్క వెయిట్ చేస్తున్నారని అంటున్నారు. ఇతర నిర్మాణ సంస్థలతో ఉన్న చట్టపరమైన సమస్యలు కారణంగానే విడుదల ఆలస్యం అవుతుందని మరికొందరు భావిస్తున్నారు.
‘అయలాన్’ కథ ఏంటంటి?
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఓ మిషన్ కోసం ఓ ఏలియన్ భూమి మీదకు వస్తుంది. తమీజ్(శివ కార్తికేయన్)ను ఆ ఏలియన్ కలుస్తుంది. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. తమీజ్ దాన్ని టట్టూ అనే పేరుతో పిలుస్తాడు. కొన్ని కారణాలతో ఆ ఏలియన్ ఇతరుల చేతుల్లోకి వెళ్తుంది. దాన్ని కాపాడేందుకు హీరో ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అసలు ఆ ఏలియన్ భూమి మీదికి ఎందుకు వచ్చింది? తన మిషన్ కంప్లీట్ చేసుకుని మళ్లీ ఎలా వెళ్లిపోయింది? అనే కథతో ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు. ఈ సినిమాను KJR స్టూడియోస్ బ్యానర్‌పై కోటపాడి జె రాజేష్ నిర్మించారు. శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, భాను ప్రియ, యోగి బాబు సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. ఎ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
Read Also: ఈ వీకెండ్ అదిరిపోయే మూవీస్ - ఓటీటీలో ఒకే రోజు 10 సినిమాలు