Aha: ‘ఆహా’ మిస్సింగ్ - ప్లే స్టోర్‌లో కనిపించని ఓటీటీ యాప్
Aha App: తెలుగు వారికోసమే ఎక్స్‌క్లూజివ్‌గా తయారు చేసిన ఎంటర్‌టైన్మెంట్ ఓటీటీ యాప్ ‘ఆహా’. కానీ ఇప్పుడు ఈ యాప్ ప్లే స్టోర్ నుండి మిస్ అయ్యింది. గూగుల్ స్వయంగా దీనిని తొలగించింది.
Aha App Removed From Play Store: కోవిడ్ సమయంలో థియేటర్లు మూతబడ్డాయి. అప్పుడు ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌కు ఓటీటీ తప్పా వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అలా ఓటీటీ యాప్స్‌కు విపరీతమైన క్రేజ్ లభించింది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ యాప్సే అప్పట్లో ప్రేక్షకులకు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. అందుకే కేవలం తెలుగు వారి కోసం తెలుగు సినిమాలు, షోలు మాత్రమే స్ట్రీమ్ అయ్యేలా చేస్తామంటూ ‘ఆహా’ ముందుకొచ్చింది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఈ యాప్‌ను ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌కు అందించారు. కానీ ఇప్పుడు ప్లే స్టోర్‌లో ‘ఆహా’ కనిపించడం లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
ఒక్కసారిగా షాక్..
ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చేసే ప్రతీ పని జాగ్రత్తగా చేయాలి. లేకపోతే దానికి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానికి ఆహానే ఉదాహరణ. పాలసీలను ఉల్లంఘించిన కారణంగా ప్లే స్టోర్ నుండి ఈ యాప్‌ను తొలగించింది గూగుల్. తెలుగు ప్రేక్షకుల్లో ఆహా యాప్ అనేది చాలా ఫేమస్ కావడంతో గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం కేవలం తెలుగు సినిమాలను, షోలను మాత్రమే అందిస్తూ అలరిస్తున్న ఓటీటీ ఆహా మాత్రమే కావడం విశేషం. మామూలుగా ఏదైనా యాప్‌ను ప్లే స్టోర్ నుండి తొలగించాలంటే వారు చేసిన తప్పు ఏదో చెప్తూ.. ముందుగా వారికి నోటీసులు అందించాలి. కానీ ఆహా విషయంలో అలా జరగలేదని తెలుస్తోంది.
స్పందించిన మినిస్టర్..
ముందే ఏ మాత్రం నోటీసులు ఇవ్వకుండా ఆహా యాప్‌తో పాటు తమ వ్యాపారాలకు సంబంధించిన యాప్స్‌ను కూడా ప్లే స్టోర్ నుండి తొలగించడంపై సంజీవ్ నిక్చంద్నానీ, అనుపమ్ మిట్టల్ లాంటి ఐటీ దిగ్గజలు విమర్శలు కురిపిస్తున్నారు. ఇంటర్నెట్‌లో ఇది బ్లాక్ డే అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇలా చేయడం వల్ల గూగుల్ ప్లే స్టోర్ డెవలపర్స్ నుండి భారీ వసూళ్లు డిమాండ్ చేయవచ్చని సూచించారు. అంతే కాకుండా ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ కూడా ఈ విషయంపై స్పందించారు అంటే దీని ప్రభావం ఎంతవరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఎన్నో ఇండియన్ యాప్స్‌ను ప్లే స్టోర్ నుండి తొలగించాలని గూగుల్ నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ప్రకటించింది కూడా.
మరెన్నో యాప్స్..
ఆహాతో పాటు మరెన్నో యాప్స్ కూడా ప్రస్తుతం ప్లే స్టోర్‌లో కనిపించడం లేదు. షాదీ, అల్ట్ బాలాజీ, భారత్ మ్యాట్రిమోనీ, నౌక్రీ, 99 ఎకర్స్, కూకూ ఎఫ్ఎమ్, స్టేజ్ ఓటీటీ, క్వాక్ క్వాక్ వంటి ఇండియన్ యాప్స్‌ను ప్లే స్టోర్ నుండి తొలగించింది గూగుల్. ఇక గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎంతోమంది ఖండిస్తున్నారు. అంతే కాకుండా చాలామంది అయితే గూగుల్‌కు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. గూగుల్ తయారు చేసిన కొత్త పాలసీ ప్రకారమే ఈ యాప్స్‌ను తొలగించామని గూగుల్ స్పందించింది. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలను వీలైనంత త్వరగా తొలగిస్తామని మాటిచ్చింది.
Also Read: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ - వరుడు ఎవరంటే..