Oscars 2023: తెలుగు వారికి ఇది గర్వకారణం, RRR టీమ్‌కు కంగ్రాట్స్ - తమ్మారెడ్డి భరద్వాజ
Oscars 2023: నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అభినందనలు తెలిపారు.
Oscars 2023:
ప్రశంసలు..
RRRలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కడంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. దేశానికి గర్వకారణం అంటూ RRR టీమ్‌ని ఆకాశానికెత్తేస్తున్నారు. వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. తెలుగుదనం ఉట్టిపడేలా పాటలు స్వరపరిచే ఎమ్ ఎమ్ కీరవాణి, తెలుగు పదాలతో పాటలు రాసే చంద్రబోస్ కలయికలో వచ్చిన ఈ పాటకు అంతర్జాతీయ గుర్తింపు దక్కడం చాలా గర్వంగా ఉందని అన్నారు. తెలుగు సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఎంతో గర్వ పడుతున్నారని చెప్పారు.
"తెలుగు సినిమాల్లో తెలుగుదనం ఉట్టిపడేలా పాటలు స్వరపరిచే అతి తక్కువ మందిలో కీరవాణి ఒకరు. తెలుగు పదాలను పొందు పరిచి పాటలు రాస్తున్న వారిలో చంద్రబోస్ ఒకరు. వీళ్లిద్దరి కలయికలో రూపొందిన ఈ పాటకు ఆస్కార్ రావడం చాలా అద్భుతం. మనంంతా ఆనందిచాల్సిన సమయమిది. RRR టీమ్‌కు నా శుభాకాంక్షలు"
- తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత, దర్శకుడు
వివాదాస్పద వ్యాఖ్యలు..
ఇటీవలే తమ్మారెడ్డి భరద్వాజ RRR సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతి ప్రివ్యూ థియేటర్ ‘వివాదాస్పద విషయాలపై సినిమాల నిర్మాణం’ అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న భరద్వాజ పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ‘RRR’ సినిమా బృందం ఆస్కార్ కోసం చేస్తున్న ఖర్చుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆస్కార్ కోసం పోటీ పడుతున్న ‘RRR’ సినిమా టీమ్ విమాన ఖర్చులకు పెట్టిన డబ్బుతో 8 సినిమాలు తియ్యొచ్చని చెప్పారు. "‘RRR’ సినిమా కోసం రూ. 600 కోట్ల బడ్జెట్ అయింది. మళ్లీ ఆస్కార్ కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టారు. అదే రూ.80 కోట్లతో 8 సినిమాలు చేయొచ్చు. వాళ్లు ఊరికే ఫ్లైట్ టికెట్లకు రూ.80 కోట్లు ఖర్చు పెట్టారు" అని భరద్వాజ అన్నారు. ఆ తరవాత ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికలపై అదరగొడుతుంటే సంతోషించాలి కానీ...ఇలా విమర్శిస్తారా అంటూ మండి పడ్డారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు, నటుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా తమ్మారెడ్డిపై మండి పడ్డారు. దీనిపై స్పందించిన తమ్మారెడ్డి...రెండున్నర గంటలు మాట్లాడితే... అందులో విషయం అంతా వదిలేసి, రెండు నిమిషాల క్లిప్ తీసుకుని ఎవరు పడితే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారని (Tammareddy Bharadwaj) తెలిపారు.
''చాలా అసహ్యంగా, అసభ్యంగా ఉంది. నేను ఆ విధంగా రియాక్ట్ అవ్వాలంటే అవ్వొచ్చు. కానీ, సంస్కారం అడ్డం వస్తోంది. వాళ్ళ సంస్కారం వాళ్ళది. నా సంస్కారం నాది. దానిపై నేను రియాక్ట్ కావాలని అనుకోవడం లేదు. నేను చెప్పాలనుకున్నది యూట్యూబ్ లో వీడియో పోస్ట్ చేశా. మళ్ళీ ఆవేశపడి ఆరోగ్యం చెడగొట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు నాకు ఐడెంటిటీ క్రైసిస్ లేదు. నన్ను టార్గెట్ చేసి వాళ్ళ ఐడెంటిటీ పెంచుకోవాలని అనుకుంటున్నారేమో నాకు తెలియదు. దీన్ని పెంచి పోషించాల్సిన అవసరం లేదు." అని మరో వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.