Joyland In Oscar Race: ఆస్కార్ బరిలో పాకిస్థాన్ సినిమా ‘జాయ్ ల్యాండ్’ - ఈ చిత్ర నిర్మాత మన తెలుగమ్మాయే!
తొలిసారిగా పాకిస్తాన్ సినిమా ఆస్కార్ బరిలో నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ చిత్రాన్ని నిర్మించింది మరెవ్వరో కాదు, మన తెలుగమ్మయే.
పాకిస్తాన్ అంటే మతపరమైన అల్లర్లు, ఉగ్రవాదం, ఆత్మాహుతి దాడులు ఇవే మొదటగా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు దాన్ని మార్చేందుకు సిద్ధమైంది ఒక సినిమా. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ బరిలో నిలిచింది ఆ సినిమా. తొలిసారిగా పాకిస్తాన్ గౌరవాన్ని అంతర్జాతీయ వేదికగా నిలబెట్టబోతోంది. ఆ సినిమానే ‘జాయ్ ల్యాండ్’. 2022 సంవత్సరానికి గాను పాకిస్తాన్ తరపున ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సినిమా నిర్మాత అచ్చ తెలుగు అమ్మాయి అపూర్వా చరణ్ కావడం విశేషం.
నిర్మాత తెలుగమ్మాయే
లాస్ ఏంజెల్స్ లో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు హరిచరణ్ కుమార్తె ఈ అపూర్వా చరణ్. వైవిధ్యభరితమైన కథ ఉన్న ఈ సినిమా కథ నచ్చడంతో జాయ్ ల్యాండ్ కి నిర్మాతగా వ్యవహరించేందుకు ముందుకు వచ్చింది. తానే కాదు ఈ సినిమాకి ఆమె తల్లిదండ్రులు కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. ఇప్పటికే ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పలు అవార్డులని గెలుచుకున్న మొట్టమొదటి పాకిస్తానీ చిత్రంగా నిలిచింది. అనేక అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకి ఆస్కార్ లభిస్తే అంతర్జాతీయ వేదికపై తెలుగమ్మాయి కీర్తి ప్రతిష్ట మరింత పెరుగుతుంది. అది భారతదేశానికి కూడా గర్వకారణమే.
అసలు కథ ఏంటంటే?
'జాయ్ ల్యాండ్' గురించి చెప్పాలంటే... ట్రాన్స్‌వుమన్ (ట్రాన్స్ జెండర్)తో పెళ్ళైన పురుషుడు ప్రేమలో పడితే ఏం జరిగింది? అనేది సినిమా. ఇందులో దర్శకుడు చాలా అంశాలను చర్చించారు. లాహోర్‌లో మధ్య తరగతి కుటుంబ జీవితాలు, అక్కడి డ్యాన్సర్ల రిహార్సల్స్, సామాజిక స్థితిగతులు, శృంగార పరమైన పరిస్థితులు - పలు అంశాలను సయీమ్ సాధిఖ్ స్పృశించారు.
ట్రాన్స్‌వుమన్‌తో ప్రేమలో పడిన హీరో... ఆమె కటౌట్‌ను ఇంటికి తీసుకొస్తాడు. ఆ పని కుటుంబ సభ్యులకు నచ్చదు. మరో సన్నివేశంలో బాత్‌రూమ్ కిటికీ నుంచి పొరుగింట్లో ఉంటున్న పురుషుడిని బైనాక్యులర్స్ సహాయంతో చూస్తుంది హీరో భార్య. మతపరమైన, సాంప్రదాయ కట్టుబాట్లకు... మోడ్రన్ సెక్సువల్ ఫ్రీడమ్‌కు మధ్య సంఘర్షణను సినిమాలో చూపించారు. ఇది కత్తి మీద సాము లాంటి వ్యవహారం. ఏమాత్రం తేడా వచ్చినా గొడవలు జరిగే ప్రమాదం ఉంది. ఇటువంటి సున్నితమైన అంశాన్ని, వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరించిన సినిమా 'జాయ్ ల్యాండ్'. వినోదాత్మకంగా సాగుతూ భావోద్వేగాలను చూపించింది. తండ్రి కుమారుల మధ్య సంబంధాలను, కుమారులపై తండ్రి అజమాయిషీని చూపించారు.
నటి కూడా రియల్ ట్రాన్స్ వుమెన్
క్యాస్టింగ్ పరంగా కూడా జాయ్ ల్యాండ్ ప్రత్యేకమనే చెప్పాలి. ఈ సినిమాలో ట్రాన్స్ వుమెన్ 'బిబా'గా నటించింది కూడా రియల్ లైఫ్ లో ట్రాన్స్ వుమెన్ కావడం విశేషం. ఆమె పేరు అలీనా ఖాన్. ఆమెకి ఇది తొలి ఫీచర్ ఫిల్మ్. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన తొలి పాకిస్థాన్ సినిమా 'జాయ్ ల్యాండ్'. కాన్‌లో అవార్డు అందుకున్న తొలి పాకిస్తాన్ సినిమా కూడా ఇదే. దర్శకుడు సయీమ్ సాధిఖ్ తీసిన తొలి ఫీచర్ ఫిల్మ్ కూడా ఇదే కావడం విశేషం. ఈ దర్శకుడు తీసిన షార్ట్ ఫిల్మ్ 'డార్లింగ్' వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు అందుకుంది.
Also Read: ఫిక్షన్ సినిమాకు నాన్ ఫిక్షన్‌కు పోలిక సరైనదేనా? ‘బాహుబలి’కి ‘పొన్నియన్ సెల్వన్’కు తేడాలు ఇవే!
Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?