Jayaprada: ప్రముఖ నటి జయప్రదకు ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది పురస్కారం
తెలుగు సినీ పరిశ్రమలో 300 చిత్రాల్లో నటించి మేటి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు జయప్రద. పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాల్లో నటించి మెప్పించారు. ఆమె పురస్కారాల లిస్టులో మరో అరుదైన అవార్డు చేరబోతోంది.
అందంతో పాటు అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమనే కాకుండా భారతీయ చిత్ర సీమలో తన నటనతో చెరగని ముద్ర వేశారు జయప్రద. భూమి కోసం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో నటించి మెప్పించారు. నటిగా జయప్రద 300 పైగా సినిమాల్లో నటించారు. నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా జయప్రద రాణించారు. తెలుగులో అగ్రతారగా వెలుగొందిన జయప్రద.. మరో అరుదైన పురస్కారం అందుకోబోతున్నారు. ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది పుస్కారానికి ఆమె ఎంపికయ్యారు. త్వరలో ఈ అవార్డును ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ చేతుల మీదుగా తీసుకోనున్నారు.
Shakapurushudu Shri #NTR Centenary Celebrations ✨
— Vamsi Kaka (@vamsikaka) November 24, 2022
The Prestigious #NTRCentenaryAward & Gold Medal will be presented to Veteran Actress Smt. Jayaprada Garu@JP_LOKSATTA garu will be attending as main Cheif Guest for the event
📍 NVR Convention, Tenali
🗓️ NOV 27th at 6 PM pic.twitter.com/M3M2M3hlo6
ఈ నెల 27న పురస్కార ప్రదానం
నట సింహం నందమూరి బాలకృష్ణ అధ్యక్షతన, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో సంవత్సరం పాటు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 27న ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు తెనా నాజర్ పేట ఎన్వీ ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరగనుంది. ప్రముఖ డైలాగ్ రైటర్ డాక్టర్ సాయి మాధవ్ బుర్ర నిర్వహణలో ఈ సభ జరగబోతున్నది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాన్ని ప్రముఖ సినీ నటి జయప్రదకు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ అందజేయనున్నారు. ఈ అవార్డుల వేడుకకు ముఖ్య అతిథిగా జయప్రకాశ్ నారాయణ హాజరు కానున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి ఆత్మీయ అతిథిగా వ్యవహరించనున్నారు. ఎన్టీఆర్ అభిమాన సత్కార గ్రహీత డాక్టర్ మైధిలి అబ్బరాజు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం సైతం ఈ పురస్కార వేడుకలో పాల్గొననున్నారు.
ఈ నెల 28న ‘అడవి రాముడు’ సినిమా ప్రదర్శన
అటు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలి పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్ లో ఏడాది పొడవునా ఎన్టీఆర్ చలన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న ‘అడవి రాముడు’ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనకు జయప్రద, నందమూరి రామకృష్ణ, ఎ.కోదండరామిరెడ్డి హాజరై ప్రేక్షకులతో కలిసి సినిమా చూడనున్నారు.
తెలుగు రాజకీయాలపై జయప్రద కీలక వ్యాఖ్యలు
ఉత్తరాది రాజకీయాల్లో రాణిస్తున్న జయప్రద ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. తాజాగా హైదరాబాద్ కు వచ్చిన ఆమె తెలుగు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాజకీయాల్లో రావాలని తనకు ఆసక్తిగా ఉందని జయప్రద అన్నారు. ఇక్కడి ప్రజలకు సేవ చేసుకొనే అవకాశం కోసం చూస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నట్లుగా చెప్పారు. తమ పార్టీ పెద్దలు నిర్ణయించి ఆంధ్ర రాష్ట్రంలోగానీ, తెలంగాణలో గానీ పోటీ చేయమని చెప్తే తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. తెలుగు బిడ్డగా వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ దేశ రాజకీయాల్లోకి వెళ్లడం సరి కాదని జయప్రద అభిప్రాయపడ్డారు. మరింత సంపూర్ణమైన పాలన అందించి, ఇక్కడి ప్రజలకే అందుబాటులో ఉండాలని అన్నారు. అప్పుడే ప్రజలు టీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను అభినందిస్తారని అన్నారు.
Read Also: కమల్ హాసన్‌కు అస్వస్థత, హైదరాబాద్ నుంచి వెళ్లగానే హాస్పిటల్‌కు తరలింపు!