(Source: Poll of Polls)
Kangana Ranaut: కంగనాకి షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు, ఎమర్జెన్సీ సినిమాకి సెన్సార్ కష్టాలు
Emergency Movie: కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాకి సినిమా కష్టాలు వెంటాడుతున్నాయి. సెన్సార్ కోసం ఎంత ప్రయత్నించినా బాంబే హైకోర్టు కూడా షాక్ ఇచ్చింది.
Emergency Movie Censor: కంగనా రనౌత్ "ఎమర్జెన్సీ" మూవీకి కష్టాలు తప్పడం లేదు. సిక్కు సంస్థలు పెద్ద ఎత్తున ఈ సినిమాని వ్యతిరేకిస్తున్నాయి. విడుదల చేయొద్దని డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదం కాస్త బాంబే హైకోర్టు వరకూ వెళ్లింది. కోర్టులో అయినా ఊరట వస్తుందని ఆశించిన కంగనా రనౌత్‌కి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ హైకోర్టులో ఈ వివాదం కొనసాగుతోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కి సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయాలని చెప్పలేమని మధ్యప్రదేశ్ కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పుడు బాంబే హైకోర్టు కూడా ఇదే విషయం స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ కోర్టు తీర్పుని ఉల్లంఘించి సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించలేమని వెల్లడించింది. సెప్టెంబర్ 18వ తేదీలోగా ఈ సినిమాపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయో చెప్పాలని సెన్సార్‌బోర్డ్‌కి తేల్చి చెప్పింది. ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న Zee Studios బాంబే హైకోర్టులో పిటిషన్ వేయగా ఈ విచారణ జరిగింది. ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని కంగనా రనౌత్ డైరెక్ట్ చేశారు. ప్రొడ్యూసర్ కూడా ఆమే. సెప్టెంబర్ 6వ తేదీనే సినిమా విడుదల కావాల్సి ఉన్నా సిక్కు సంఘాల ఆందోళనలతో వాయిదా పడుతూ వస్తోంది. సిక్కులను చూపించిన విధానం అభ్యంతరకరంగా ఉందని, చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండి పడుతున్నాయి ఆ సంఘాలు. ఈ క్రమంలోనే బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని తాము ఆదేశించలేమని తేల్చి చెప్పింది. మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా సినిమాలోని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డ్‌కి సూచనలు చేసింది.
"ఇలాంటి విషయాల్లో ఓ కోర్టు అభిప్రాయాన్ని మరో కోర్టు విభేదించడం సరికాదు. పిటిషనర్లు కోరుకున్న విధంగా ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని మేం బోర్డ్‌ని ఆదేశించలేం. అలా అని ఈ పిటిషన్‌ని పక్కన పెట్టడం లేదు. అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవాలని మాత్రం ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డ్‌కి చెప్పగలం"
- బాంబే హైకోర్టు
High court has blasted censor for illegally withholding the cirtificate of #emergency https://t.co/KedtrQlvrU
— Kangana Ranaut (@KanganaTeam) September 4, 2024
ఎంతో డబ్బు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారని, ఇలాంటి వివాదాలను గాలికి వదిలేయడం సరికాదని వ్యాఖ్యానించింది బాంబే హైకోర్టు. సీబీఎఫ్‌సీకి కొంత గడువు ఇచ్చింది. వినాయక చవితిని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా ఈ సమస్యని తేల్చాలని సూచించింది. ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేయడం సరికాదని స్పష్టం చేసింది. ఇంత జరిగినా కంగనా రనౌత్ మాత్రం తనకు అనుకూలంగా పోస్ట్ పెట్టుకున్నారు. సినిమాకి సెన్సార్ చేయకపోవడాన్ని బాంబే హైకోర్టు తప్పబట్టిందని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు. కోర్టులో విజయం సాధించానని ప్రచారం చేసుకుంటున్నారు.