(Source: Poll of Polls)
Karthikeya 2: నిఖిల్ 'కార్తికేయ 2' వాయిదా పడనుందా?
నిఖిల్ 'కార్తికేయ 2' సినిమాను వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
టాలీవుడ్ హీరో నిఖిల్ (Nikhil Siddharth), దర్శకుడు చందు మొండేటి (Chandoo Mondeti) కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ప్రేక్షకుల ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీకృష్ణునికి సంబంధించిన చరిత్ర, ద్వారకా నగరం మీద అన్వేషణ చేసే వైద్యుడిగా నిఖిల్ కనిపించనున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాను జూలై 22న విడుదల చేయాలనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గా విడుదలైన సినిమా ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా చెప్పిన సమయానికి రాదని అంటున్నారు. అదే రోజున నాగచైతన్య 'థాంక్యూ' సినిమా కూడా విడుదల కానుంది. దీంతో ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు 'కార్తికేయ2' టీమ్ ని తమ సినిమాను వాయిదా వేయమని అడుగుతున్నారట. 'థాంక్యూ'కి సోలో రిలీజ్ ఉండేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. 'కార్తికేయ2' మేకర్స్ ఒప్పుకుంటే గనుక నిఖిల్ సినిమా ఆగస్టుకి వాయిదా పడుతుందని తెలుస్తోంది. కొన్ని రోజుల్లో దీనిపై అధికార ప్రకటన రానుంది.
'కార్తికేయ 2' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
View this post on Instagram