Nandamuri Balakrishna: అక్కినేనిని బాలకృష్ణ అంత మాట అన్నారా? - మండిపడుతున్న ఏయన్నార్ అభిమానులు!
వీరసింహా రెడ్డి సక్సెస్ మీట్‌లో ‘అక్కినేని, తొక్కినేని’ అంటూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనిపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
నందమూరి బాలకృష్ణ మనసులో ఉన్నది ఎలాంటి ఫిల్టర్ లేకుండా మాట్లాడతారని పేరుంది. కానీ కొన్నిసార్లు అదే వివాదాస్పదం అవుతుంది కూడా. వీరసింహా రెడ్డి సక్సెస్ మీట్‌లో కూడా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ‘అక్కినేని, తొక్కినేని’ అంటూ బాలకృష్ణ మాట్లాడిన వీడియోపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఈ సినిమా షూటింగ్‌లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో తెలిపే సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైమ్ పాస్. ఎప్పుడూ కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకునే వాళ్లం.’ అని బాలకృష్ణ ఈ సందర్భంగా అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే వివాదాస్పదం అవుతున్నాయి. దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
అలాగే 'వీర సింహా రెడ్డి' విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ మాట్లాడిన ఓ మాట కూడా ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిందేనా? అనే అనుమానం కూడా కొందరిలో కలుగుతోంది. బాలకృష్ణకు 'వీర సింహా రెడ్డి' చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని వీరాభిమాని. 'సమర సింహా రెడ్డి' సినిమా చూడటానికి వెళ్ళి పోలీస్ లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి కూడా. అతడి గురించి చెబుతూ 'నేను కారణం చెప్పను. ఎందుకంటే... మళ్ళీ ఇప్పుడు కేసు బుక్ చేస్తారు. ఇప్పుడు చాలా తేలిక కదా! కేసులు బుక్ చేయడం... నిరపరాధుల మీద' అని బాలకృష్ణ చురకలు వేశారు. ఆ మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏపీలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, సోషల్ మీడియాలో చేసిన పోస్టులను సాకుగా చూపిస్తూ కొందరిని అరెస్టులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్ అవుతున్నాయి. ఇక వీరసింహా రెడ్డి సినిమాలో కూడా ఏపీ ప్రభుత్వానికి చురకలు వేశారు.
'సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో! కానీ, ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు'. 'వీర సింహా రెడ్డి' సినిమాలో ఈ డైలాగ్ రాజకీయ పరంగా చర్చనీయాంశమైంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై పేల్చిన బుల్లెట్ కింద ఆ మాటను చాలా మంది చూశారు. సినిమాలో ఆ డైలాగ్ తర్వాత 'దట్స్ మై ఫాదర్' అని కంటిన్యూ చేస్తారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో ఎన్టీఆర్ పేరు తీసేసిన జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం, వైఎస్సార్ పేరును పెట్టడంతో ఈ సెటైర్ వేశారని జనాల అభిప్రాయం. ఈ సినిమాలో అంత కంటే ఘాటైన డైలాగులు కూడా ఉన్నాయి.
''ప్రగతి సాధించడం అభివృద్ధి... ప్రజల్ని వేధించడం కాదు! జీతాలు ఇవ్వడం అభివృద్ధి... బిచ్చం వేయడం కాదు! పని చేయడం అభివృద్ధి... పనులు ఆపడం కాదు! నిర్మించడం అభివృద్ధి... కూల్చడం కాదు! పరిశ్రమలు తీసుకు రావడం అభివృద్ధి... ఉన్న పరిశ్రమలు మూయడం కాదు! బుద్ధి తెచ్చుకో... అభివృద్ధికి అర్థం తెలుసుకో'' డైలాగ్, జీవో డైలాగ్ కూడా ఏపీలో పరిస్థితులను ఉద్దేశించే విధంగా ఉన్నాయనేది చాలా మంది చెప్పే మాట.