NTR Vardhanthi: ఫిల్మ్ నగర్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలి - వర్ధంతి సభలో ఎమ్మెల్యే మాగంటి డిమాండ్
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఫిల్మ్ నగర్‌లోని తారక రాముని విగ్రహానికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు, ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు.
''మరణం లేని తెలుగు జాతి గౌరవం మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు. ఆయన భౌతికంగా మా నుంచి దూరమై 28 ఏళ్లు గడిచినా... మనసా వాచా కర్మణా మాతోనే ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు'' అని నందమూరి మోహన కృష్ణ అన్నారు. గురువారం (జనవరి 18న) ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిలిం నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో కల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఫిలింనగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నందమూరి కుటుంబ సభ్యులు మోహన్ కృష్ణ, మోహన రూప, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్న కుమార్, ఎఫ్ఎన్సిసి సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి, మాజీ కార్పొరేటర్ కాజ సూర్యనారాయణ తదితరులు నివాళులు అర్పించారు.
సినిమాల్లో... రాజకీయాల్లో... ఎన్టీఆర్ పెను సంచలనం
ఎన్టీఆర్ తనయుడు మోహన కృష్ణ మాట్లాడుతూ... ''ఎన్టీఆర్... ఈ మూడు అక్షరాల పేరు పెను సంచలనం. సినిమాల్లో, రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. నాన్న పోషించని పాత్ర ఏదీ లేదు. ప్రతినాయకుడి పాత్రల్లో కూడా నటించి మెప్పించిన వ్యక్తి ఎన్టీఆర్. భగవంతుడిగా నటించారు. డీగ్లామరైజ్డ్ రోల్స్ చేశారు. రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల వ్యవధిలోనే ప్రభుత్వాన్ని స్థాపించారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ ఆద్యులు. ఆయన ఎప్పుడూ అందరివాడే. ఆయన ఎప్పుడూ అజాతశత్రువే. దైవం మనుష్య రూపేనా అన్నట్టు ఎన్టీఆర్ గారు మనుషులలో దైవం. ఆయనకు నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు'' అని అన్నారు.
మరణం లేని మహా నాయకుడు ఎన్టీఆర్ - మాగంటి
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ... ''మరణం లేని మహా నాయకుడు ఎన్టీఆర్ గారు. చిత్రసీమలో రారాజుగా వెలుగొందారు. అలాగే... పరిశ్రమలోనూ, రాజకీయాల్లోనూ ఎదురులేని మనిషిగా నిలబడిన వ్యక్తి. భారతదేశంలోనే ఎవరికీ దక్కని గౌరవం ఆయన సొంతం. తెలుగువారు ఉన్నంతకాలం నందమూరి తారక రామారావు గారిని మరవడం అనేది చాలా కష్టం. ఫిలింనగర్ కు ఎన్టీఆర్ గారి పేరు పెట్టాలి అని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము'' అని అన్నారు.
Also Read: మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ - రిపబ్లిక్ డేకి అనౌన్స్?
''మరణం లేని మహానుభావుడు ఎన్టీఆర్ గారు. సినిమా ఇండస్ట్రీలో ఆయన రారాజు. కృష్ణుడిగా నటించమని బాలీవుడ్, హాలీవుడ్ ఆఫర్లు వచ్చినా ఆయన చేయలేదు. తెలుగు వాళ్లకు మాత్రమే తాను సొంతమన్నారు. ప్రజల కోసం ఏదైనా చేయాలని తెలుగు దేశం పార్టీ స్థాపించారు'' అని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ తెలిపారు. ఎన్టీఆర్ ఎప్పటికీ మనతో ఉంటారని నందమూరి మోహన రూప అన్నారు.
Also Read: జయరామ్ పెళ్లాంతో సరిగా కాపురం చేసే క్యారెక్టర్లు చేయరా?
నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన్ రూప గారు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు, ఎఫ్ ఎన్ సి సి సెక్రెటరీ మోహన్ ముళ్ళపూడి గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు, భాస్కర్ నాయుడు గారు మరియు కాజా సూర్యనారాయణ గారు పాల్గొన్నారు.