Mission Impossible 7: ‘ప్రపంచం నీ వెనక పడుతోంది’ - మిషన్ ఇంపాజిబుల్ 7 కొత్త ట్రైలర్ చూశారా?
మిషన్ ఇంపాజిబుల్ ఏడో భాగం డెడ్ రెకానింగ్ మొదటి పార్ట్ ట్రైలర్ విడుదల అయింది.
Mission Impossible Dead Reckoning Part One Official Trailer: మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ పేరు వింటేనే యాక్షన్ లవర్స్‌కు ఇన్‌స్టంట్ గూస్‌బంప్స్ వస్తాయి. ఈ సిరీస్‌లో ఏడో సినిమాగా వస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ 1’ ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా జులై 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో సినిమా మీద హైప్‌ను పెంచేలా ట్రైలర్‌ను కట్ చేశారు. ఈథన్ హంట్ (టామ్ క్రూజ్) వ్యక్తిగత జీవితం మీద కూడా ఈ సినిమాలో ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. ‘మనం గతంలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు జీవిస్తున్న జీవితం. గతం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేం.’ అనే టామ్ క్రూజ్ వాయిస్ ఓవర్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది.
మిషన్ ఇంపాజిబుల్ సినిమాల్లో సాధారణంగా మిషన్ కోసం ప్రాణాలిచ్చే పాత్రలో టామ్ క్రూజ్ కనిపిస్తాడు. కానీ ఇందులో మాత్రం మిషన్ ఏమైనా సహచరుల ప్రాణాలే ముఖ్యం అన్నట్లు ట్రైలర్‌లో చూపించారు. దానికి బలమైన కారణం సినిమాలో ఏమైనా ఉంటుందేమో చూడాలి. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో ప్రతి సినిమాకీ యాక్షన్ విషయంలో లెవల్ పెంచుకుంటూ వెళ్తాడు టామ్ క్రూజ్. ఇందులో మరో అడుగు ముందుకేసి కొండ మీద నుంచి బైక్‌తో సహా దూకే సన్నివేశాలు కూడా షూట్ చేశారు. ఈ సీన్‌లో టామ్ క్రూజ్ ఎటువంటి డూప్ లేకుండా నటించారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను ఇప్పటికే విడుదల చేశారు. సినిమాకు ప్రధాన ఆకర్షణ ఇదే కానుంది.
60 ఏళ్ల వయస్సులోనూ టామ్ క్రూజ్.. కుర్రాడిలా స్టంట్స్ చేయడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇటీవలే ‘టాప్‌గన్’ మూవీలో యుద్ధ విమానాలతో విన్యాసాలు చేసిన టామ్.. ఇప్పుడు ‘మిషన్ ఇంపాజిబుల్’లో కూడా రోమాలు నిక్కబొడుచుకొనే యాక్షన్ సీన్స్‌లో నటించాడు. చిన్న కారులో ఇరుకు వీధుల్లో డ్రైవింగ్, రైలుపై ఫైటింగ్ సీన్స్ తప్పకుండా సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టడం ఖాయమని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ట్రైలర్ చివరిలో బైకుతో సహా ఎత్తైన కొండపై నుంచి లోయలోకి దూకే సీన్ చూస్తే.. ఔరా అనకుండా ఉండలేరు. మొత్తానికి టామ్ క్రూజ్.. ఈసారి కూడా మెస్మరైజ్ చేసి, తన విన్యాశాలతో ఈలలు వేయించుకోవడం ఖాయమనిపిస్తోంది.
దీని తర్వాతి భాగం ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ 2’ 2024 జూన్ 28వ తేదీన విడుదల కానుంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. మొదటి భాగంతో పాటే రెండో భాగం షూటింగ్ కూడా చేసేశారని తెలుస్తోంది. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో టామ్ క్రూజ్ పోషించిన ‘ఈథన్ హంట్’ పాత్రకు ఈ సినిమాతో గుడ్ బై చెప్పనున్నారు. ప్రస్తుతం టామ్ క్రూజ్ వయసు 60 సంవత్సరాలకు పైనే ఉంది. ఇంక ఈ యాక్షన్ సన్నివేశాలు చేయడం కష్టం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
హాలీవుడ్‌లో ‘జేమ్స్ బాండ్’ సినిమా తరహాలోనే ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాకు కూడా మాంచి డిమాండ్ ఉంది. 1996 సంవత్సరంలో ఈ ‘మిషన్ ఇంపాజిబుల్’ ఈ మూవీ సీరిస్ మొదలైంది. అప్పటి నుంచి నిర్విరామంగా ఈ చిత్రానికి సంబంధించి ఆరు మూవీ సీరిస్‌లు విడుదలయ్యాయి. ఇప్పుడు విడుదల కాబోయే ‘మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్’ ఏడవ సీరిస్. ఈ చిత్రానికి క్రిస్టోఫర్ మెక్‌క్వారీ రచన, దర్శకత్వం వహించారు. సైమన్ పెగ్, రెబెక్కా ఫెర్గూసన్, వింగ్ రేమ్స్, వెనెస్సా కిర్బీ, హేలీ అట్‌వెల్, పోమ్ క్లెమెంటీఫ్, క్యారీ ఎల్వెస్, ఇందిరా వర్మ, షియా విఘమ్, రాబ్ డి మోరల్స్ తదితరులు నటించారు.