Chiranjeevi: నట సింహం బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు... చిరంజీవికి మెగా ఆహ్వానం
నందమూరి బాలయ్య సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 1న జరిగే ఈ సంబురాల్లొ పాల్గొనాల్సిందిగా చిరంజీవికి ఆహ్వానం అందింది.
Nandamuri Balakrishna's Golden Jubilee Celebrations: తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి నటసింహం నందమూరి బాలకృష్ణ. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆయన... అప్రతిహత విజయాలతో 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ‘తాతామ్మ కల’ సినిమాతో తెలుగు తెరపై తొలిసారి దర్శనం ఇచ్చిన ఆయన, ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. కళామత తల్లి సేవలో 50 ఏండ్లు పూర్తైన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించేందుకు తెలుగు సినిమా పరిశ్రమ అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది.
స్వర్ణోత్సవాల్లో పాల్గొనాలంటూ మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం
సెప్టెంబర్ 1న హైదరాబాద్ లోని నోవోటెల్ లో నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ సంబురాలు జరగబోతున్నాయి. ఈ వేడుకకు తెలుగు సినిమా పరిశ్రమలోని అతిరథ మహారథులు హాజరుకానున్నారు. తాజాగా ఈ సంబురాల్లో పాల్గొనాలంటూ మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. సెలబ్రేషన్స్ నిర్వహించే బృందంతోపాటు టీఎఫ్‌పీసీ, టీఎఫ్‌సీసీ, మా అసోసియేషన్ సభ్యులు చిరంజీవిని కలిసి ఇన్విటేషన్ అందించారు. భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, రాజా రవీంద్ర, జెమినీ కిరణ్, కె. ఎల్. నారాయణ, మాదాల రవి, అనుపం రెడ్డి, నిర్మాత సి కల్యాణ్, డైరెక్టర్ వీర శంకర్, నిర్మాత అశోక్ కుమార్, అనిల్ వల్లభనేని చిరంజీవిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ వేడుకకు తనను ఆహ్వానించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నాలుగు కీలక సంస్థల పెద్దలతో మాట్లాడి, ఆయా సంస్థలు చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు.
ఎఫ్‌ఎన్‌సీసీలో క్టరన్ రైజర్ కార్యక్రమం
అటు సెప్టెంబర్ 1న జరగబోయే బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకకు సంబంధించి రీసెంట్ గా ఎఫ్‌ఎన్‌సీసీలో క్టరన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ వేడుకలో పలువురు సినీ దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన కృష్ణ కలిసి స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్‌ను లాంచ్ చేశారు. కళామతల్లికి బాలయ్య చేసిన సేవలను ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేశారు. ఇండస్ట్రీలో 50 సంవత్సరాల పాటు 109 సినిమాలు చేయడం ఆశామాషీ వ్యవహారం కాదన్నారు. బాలయ్య ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉంటూ ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ ఉండాలని ఆకాంక్షించారు.
ఆగష్టు చివరి నుంచి హైదరాబాద్ లో NBK 109 షూటింగ్
అటు బాబీ, బాలయ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘NBK 109‘ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. రీసెంట్ గా రాజస్థాన్ లో సెడ్యూల్ పూర్తి చేసుకుంది. తర్వాతి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో జరగనుంది. ఆగష్టు చివరి వారం నుంచి జరగనున్న ఈ షూటింగ్ లో బాలయ్యతో పాటు మిగతా నటీనటులు పాల్గొననున్నారు. ఇక ఈ చిత్రంలో బాలయ్యతో పాటు ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: కుర్చీ మడత పెట్టిన ప్రభాస్ హీరోయిన్ - తెలుగు పాటలకు ఇమాన్వీ సూపర్ స్టెప్స్