Chiranjeevi: గొప్ప మనసు చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి, కష్టాల్లో ఉన్న సీనియర్ కెమెరామెన్ కు ఆర్థికసాయం
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. పేదరికంతో బాధపడుతున్న సీనియర్ కెమెరామెన్ దేవరాజ్ కు ఆర్థిక సాయం చేసి, ఆయన కుటుంబానికి అండగా నిలిచారు.
సినిమా పరిశ్రమలో మనసున్న మనిషిగా మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇండస్ట్రీకి చెందిన వారి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారికి అండగా నిలవడంతో ముందుటారు. మానవసేవే మాధవ సేవ అని మనసావాచా నమ్మే మెగాస్టార్ చిరంజీవి మరో సారి తన ఉదారత చాటుకున్నారు. రెండు దశాబ్దాల పాటు కెమెరా మెన్ గా ఇండస్ట్రీలో సత్తాచాటి, ఇప్పుడు పేదరికంతో ఇబ్బంది పడుతున్న టెక్నీషియన్ కు ఆర్థికంగా అండగా నిలిచారు.
300పైగా సినిమాలకు కెమెరామెన్ గా పని చేసిన దేవరాజ్
తెలుగు సినిమా పరిశ్రమతో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 1980 నుంచి 90 వరకు కెమెరామెన్ గా దేవరాజ్ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అలనాటి మేటి నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజిఆర్, రాజ్ కుమార్, రజనీకాంత్, కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు, మురళీమోహన్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. ఎందరో టాప్ హీరోలతో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు దేవరాజ్ పని చేశారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ భాషల్లో దాదాపు 300కు పైగా సినిమాలు చేశారు.
దేవరాజ్ కు రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేసిన మెగాస్టార్
ఒకప్పుడు సినిమా పరిశ్రమలో వెలుగు వెలిగిన దేవరాజ్ ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఒక యూట్యూబ్ ఛానల్ వెలుగులోకి తీసుకు వచ్చింది. ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి వరకు చేరింది. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘నాగు’, ‘పులిబెబ్బులి’, ‘రాణి కాసుల రంగమ్మ’ లాంటి సినిమాలకు దేవరాజ్ కెమెరామెన్ గా పని చేశారు. ఈ నేపథ్యంలో దేవరాజ్ ఆర్ధిక పరిస్థితి తెలుసుకుని వెంటనే ఆయనను తన నివాసానికి పిలిపించుకున్నారు. తనకు చక్కటి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు రూ. 5 లక్షలు ఆర్థికసాయం చేశారు. ఇకపై ఆయన కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
చిరంజీవి సాయం పట్ల దేవరాజ్ సంతోషం
మెగాస్టార్ చిరంజీవి ఆర్థికసాయం చేడయం పట్ల దేవరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. తన పేదరికం గురించి తెలుసుకుని వెంటనే స్పందించడం చిరంజీవి గొప్ప మనసుకు నిదర్శనం అన్నారు. ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని దేవరాజ్ తెలిపారు. అటు చిరంజీవి మంచి మనసును సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కొనియాడుతున్నారు. గొప్ప పని చేశారంటూ మెచ్చుకుంటున్నారు.
ఇక చిరంజీవి సినిమాల గురించి పరిశీలిస్తే, ఆయన తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహరాజ్ రవితేజ నటించారు. చిరంజీవి వింటేజ్ లుక్, యాక్షన్ సన్నివేశాలు, కామెడీ, పాటలు అన్నీ బాగుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ప్రస్తుతం ఆయన ‘బోళా శంకర్’ సహా పలు సినిమాల్లో నటిస్తున్నారు.
Read Also: ఆ అవమానం తట్టుకోలేక చనిపోయారు, తండ్రి గురించి చెప్తూ కంటతడి పెట్టిన పోసాని