Manjummel Boys: రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన మలయాళీ మూవీ, ఆ రికార్డు బద్దలు కొట్టేనా?
మలయాళీ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. రూ. 5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 100 కోట్లు సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళీ సినిమాగా నిలిచే ప్రయత్నం చేస్తోంది.
‘Manjummel Boys’ Set To Cross ‘2018’ Collections: మలయాళీ సినిమా పరిశ్రమను ‘మంజుమ్మెల్ బాయ్స్’ షేక్ చేస్తోంది. సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. దర్శకుడు చిదంబరం ఎస్ పొడువల్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 22న విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేస్తోంది. కేవలం రూ.5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచే ప్రయత్నం చేస్తోంది.
వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన ‘మంజుమ్మెల్ బాయ్స్’
2006లో తమిళనాడు కొడైకెనాల్ గుణ గుహల్లో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. కొంత మంది స్నేహితులు టూర్ కోసం వెళ్లగా, అందులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లోయలో పడిపోతాడు. ఆ స్నేహితుడిని కాపాడేందుకు మిత్రులు చేసిన ప్రయత్నాన్ని దర్శకుడు సినిమాగా తెరకెక్కించారు. రెస్క్యూ సిబ్బంది సైతం కాపాడలేమని చెప్పినా, తమ స్నేహితులు అతడిని ఎలా కాపాడుకున్నారో ఇందులో అత్యద్భుతంగా చూపించారు. ఈ సినిమాలోని ప్రతిసీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సినిమా చూస్తున్నట్లుగా కాకుండా, ప్రేక్షకులు లీనం అయ్యేలా రూపొందించారు. ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని ఇట్టే ఆకట్టుకుంటోంది.
రూ. 5 కోట్ల బడ్జెట్- రూ. 100 కోట్లకుపైగా వసూళ్లు
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘మంజుమ్మేల్ బాయ్స్’ మూవీ, బాక్సాఫీస్ దగ్గర సంచలనాలను క్రియేట్ చేస్తోంది. గత 12 రోజుల్లో ఏకంగా రూ.100 కోట్లు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మూవీ మలయాళంలో 400 స్క్రీన్లు, ఇండియాలోని ఇతర నగరాల్లో 100 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లలో విడుదల చేశారు. రిలీజ్ తర్వాత అద్భుత స్పందన రావడంతో తమిళనాడులో స్క్రీన్ల సంఖ్యను భారీగా పెంచారు. ఇరత రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఓవర్సీస్‌లో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి మలయాళ చిత్రంగా రికార్డు సాధించింది. గతంలో ‘లూసిఫర్’ నమోదు చేసిన కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు ఓవర్సీస్ లో రూ. 45 కోట్లు సాధించింది. మొత్తంగా ‘మంజుమ్మేల్ బాయ్స్’ సినిమా ఇప్పటి వరకు రూ. 100 కోట్లు దాటేసింది.
‘2018’ కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టేనా?
ఇక గతంలో మలయాళంలో ‘పులిమురుగన్’, ‘లూసిఫర్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేశాయి. వీటిలో కేరళ వరదలను బేస్ చేసుకుని తెరకెక్కిన ‘2018’ మూవీ రూ.177 కోట్లతో అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమా ‘2018’ కలెక్షన్ల రికార్డును బద్దలుకొట్టేందుకు ప్రయత్నిస్తోంది. శోభున్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, అభిరామ్, అరుణ్, దీపక్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి మంచి స్పందన లభిస్తోంది. థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘మంజుమ్మెల్ బాయ్స్’ మూవీ వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డు సాధించడం ఖాయం అని ట్రేడ్ నిఫుణులు అంచనా వేస్తున్నారు.