RRR : 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' మరో సెన్సేషన్!
హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్, ఎమోషన్స్ ని మిక్స్ చేస్తూ మెగా, నందమూరి ఫ్యాన్స్ ను అలరించే విధంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు రాజమౌళి.
'ఆర్ఆర్ఆర్' ( రౌద్రం రణం రుధిరం) సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి' లాంటి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న సినిమా ఇది. 'బాహుబలి'ని మించిపోయేలా ఈ సినిమా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్, ఎమోషన్స్ ని మిక్స్ చేస్తూ మెగా, నందమూరి ఫ్యాన్స్ ను అలరించే విధంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు రాజమౌళి.
ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే దాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన వీడియోలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ వీడియో, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రామ్ చరణ్ వీడియోలను రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించారు. ఇక ఈ ఇద్దరు స్టార్లు సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో చూపిస్తూ మేకింగ్ వీడియోను వదిలారు.
ఈ మేకింగ్ వీడియో చూసిన వారికి గూస్ బంప్స్ రావడం ఖాయం. గాల్లో ఎగురుతూ రామ్ చరణ్ బాణం వేసే సీన్.. బైక్ ను స్పీడ్ గా టర్న్ చేస్తూ ఎన్టీఆర్ బయలుదేరే సన్నివేశాలు వీడియోకి హైలైట్ గా నిలిచాయి. ఇద్దరు హీరోలు ఒకరిచేతులను మరొకరు పట్టుకునే సీన్ ను వీడియోలో చూపించారు. గతంలో దీనిపై ఓ పోస్టర్ కూడా వచ్చింది. ఇక వీడియో మొత్తంలో రాజమౌళి హడావిడి మాములుగా లేదు. డైరెక్షన్ తో పాటు అక్కడక్కడా కెమెరాను హ్యాండిల్ చేస్తూ.. యాక్షన్ సీన్స్ ను కొరియోగ్రాఫ్ చేస్తూ కనిపించారు. హాలీవుడ్ తారలు రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీలు కొన్ని ఫ్రేమ్స్ లో మెరిశారు.
వందల సంఖ్యలో సైనికులు, పోరాట సన్నివేశాలు సినిమాలో ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చిన్న గ్లిమ్ప్స్ ను చూపించారు. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ని సైతం ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు అలా రుచి చూపించారు. ఈ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమాను బడా నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన ఆలియా భట్ ఆడిపాడుతోంది. అజయ్ దేవగణ్, శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.